పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండ

ABN , First Publish Date - 2021-10-22T05:55:42+05:30 IST

పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, విధి నిర్వహణలో అసువులు బాసిన వారి త్యాగం వెలకట్టలేనిదని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండ
నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

చందుర్తి, అక్టోబరు 21 : పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, విధి నిర్వహణలో అసువులు బాసిన వారి త్యాగం వెలకట్టలేనిదని  కలెక్టర్‌  అనురాగ్‌ జయంతి అన్నారు.  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం చందుర్తి మండలం లింగంపేట  శివారులోని పోలీసు అమరవీరుల స్మారక స్తూపం వద్ద  ఎస్పీ  రాహుల్‌ హెగ్డేతో కలసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ   శాంతి భద్రతల పరిరక్షణకు  పోలీసులు చిత్తశుద్ధితో  విధులు  నిర్వర్తించడం అభినందనీయమన్నారు.   లాక్‌డౌన్‌లో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా పోలీసులు సేవలను అందిచారని గుర్తు చేశారు.  కాలానికి అనుగుణంగా పోలీస్‌ శాఖ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని,  నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ పోలీసులు ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో   ప్రాణాలను కోల్పోవడం బాధాకరమన్నారు.  విధి నిర్వహణలో  సమర్ధవంతగా పని చేస్తూ సామాన్యులకు న్యాయం అందించే విధంగా పనిచేసినప్పుడే అమర వీరులకు నిజమైన నివాళి అన్నారు.  పోలీసుల  త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా జిల్లాలో అక్టోబరు 21 నుంచి  వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్‌ హౌస్‌,  కొవ్వొత్తులతో ర్యాలీలు, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.  అనంతరం  కలెక్టర్‌,  ఎస్పీ చేతుల మీదుగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు.  కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, సీఐలు శ్రీలత, మొగిలి, బన్సీలాల్‌, నవీన్‌కుమార్‌, ఆర్‌.ఐ అడ్మిన్‌ కుమారస్వామి, రజినీకాంత్‌, తహసీల్దార్‌ నరేష్‌, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.            

Updated Date - 2021-10-22T05:55:42+05:30 IST