నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన

ABN , First Publish Date - 2021-12-08T05:43:51+05:30 IST

ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా ఉద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన
పాడేరు జిల్లా ఆస్పత్రి వద్ద నల్ల బ్యాడ్జీలతో వైద్య ఉద్యోగుల నిరసన

న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్‌


పాడేరు, డిసెంబరు 7: ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా ఉద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఐటీడీఏ, ఎంపీడీవో కార్యాలయం, జిల్లా ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్‌ డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎల్‌.అప్పారావు, ఎస్‌.సంజీవరాజు, తదితరులు పాల్గొన్నారు.


పెదబయలు: గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడా సింహాద్రి ఆధ్వర్యంలో పెదబయలులో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని సింహాద్రి పేర్కొన్నారు. 


అరకులోయ: స్థానిక ఏరియా ఆస్పత్రి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హజరయ్యారు. బకాయి డీఏలు తక్షణమే చెల్లించాలని, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ని రద్దు చేయాలని, జగన్‌ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.  


ముంచంగిపుట్టు: సీపీఎస్‌ని రద్దు చేయాలిని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, డీఏ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్‌లను సత్వరమే పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


అనంతగిరి: ఏపీ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి మధుసూదన్‌ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, బకాయి డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 


ఉద్యోగుల పోరాటానికి బీజేపీ మద్దతు 

పాడేరు, డిసెంబరు 7: తమ డిమాండ్ల సాధనకు ఉద్యోగుల జేఏసీ చేస్తున్న పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ అరకు జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం తగదన్నారు.  


Updated Date - 2021-12-08T05:43:51+05:30 IST