అయోధ్య రామాలయం ట్రస్టుకు ప్రభుత్వ భూమి విక్రయం!
ABN , First Publish Date - 2021-06-24T08:52:45+05:30 IST
అది ప్రభుత్వ భూమి.. దానిని ఏనాడో కౌలుకిచ్చారు.. కౌలుదారులకు దానిని విక్రయించే హక్కు లేదు.
బీజేపీ మేయర్ బంధువు నిర్వాకం?.. కౌలుదార్ల వద్ద లక్షలకు కొనుగోలు
ట్రస్టుకు కోట్లలో అమ్మకం.. కలెక్టర్ విచారణతో వెలుగులోకి
అయోధ్య, జూన్ 23: అది ప్రభుత్వ భూమి.. దానిని ఏనాడో కౌలుకిచ్చారు.. కౌలుదారులకు దానిని విక్రయించే హక్కు లేదు. అయినా కొందరు నేతల ఒత్తిడితో రూ.లక్షలకు అమ్మేశారు. దానిని తామే కొనుగోలు చేసిన సదరు నేతలు.. అయోధ్యలోని రామాలయం ట్రస్టుకు రూ.కోట్లకు విక్రయించారు. బీజేపీకి చెందిన అయోధ్య నగర మేయర్ రిషీకేశ్ ఉపాధ్యాయ్ బంధువు దీప్ నారాయణ చేసిన నిర్వాకమిది. రామజన్మభూమికి పక్కనే ఉన్న 135వ నంబరు భూమిలో 890 చదరపు మీటర్లను దీప్ నారాయణ్ గత ఫిబ్రవరిలో కొనుగోలు చేశాడు. దానిని మే నెలలో ట్రస్టుకు రూ.2.5 కోట్లకు విక్రయించాడు.
ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ట్రస్టు సభ్యుడు కూడా అయిన కలెక్టర్ అనూ్‌పకుమార్ ఝా ఈనెల 21న అంతర్గత విచారణకు ఆదేశించారు. అధికారులు రిజిస్టర్లన్నీ తనిఖీచేసి.. అది ప్రభుత్వ భూమేనని తేల్చారు. దీనిపై మహంత విశ్వనాథ్ ప్రసాదాచార్యకు కౌలు హక్కుంది. అయితే దానినివిక్రయించే హక్కు మాత్రం ఆయనకు లేదని తేలింది. 2017-18 వ్యవసాయ సంవత్సర రికార్డుల్లో.. 135, 142, 129, 201 నంబర్ల భూములు ప్రభుత్వానికి చెందినవని నమోదై ఉన్నాయి. వారసత్వ కౌలు విశ్వనాథ్ ప్రసాదాచార్య పేరిట ఉంది. ఆయన శిష్యుడు-వారసుడైన దేవేంద్ర ప్రసాదాచార్యకు ఆ భూమిని విక్రయించే హక్కు లేదని అధికారులు తమ అంతర్గత నివేదికలో పేర్కొన్నారు. దీనిపై దేవేంద్ర ఓ జాతీయ చానల్‌తో మాట్లాడుతూ.. ‘ఈ భూమి రామాలయం ట్రస్టుకు వెళ్తుందని నాకు చెప్పారు. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి అమ్మితే ఎంత వచ్చినా లాభమేనని భావించాను. రూ.30 లక్షలకు విక్రయించాను’ అని తెలిపారు.
రెండు లావాదేవీల్లో ఆయనకు ఈ సొమ్ము ముట్టింది. ఫిబ్రవరి 20న 890 చదరపు మీటర్లను దీప్ నారాయణ్‌కు రూ.20 లక్షలకు విక్రయించగా.. అదే రోజు మరో 370 చదరపు మీటర్లను రూ.10 లక్షలకు జగదీశ్ ప్రసాద్ అనే వ్యక్తికి అమ్మారు. బ్రిటిష్ పాలనలో ప్రభుత్వ భూమిని ఆక్రమించినవారికి ‘మాలిక్-ఎ-ఆలా’ హక్కును కట్టబెట్టారు. ఈ హక్కున్నవారు భూమిని అమ్ముకోవచ్చు కూడా. అలా 1931లో ఈ భూమి మహంత్ రఘువీర్ ప్రసాద్ పేరిట ‘మాలిక్-ఎ-ఆలా’ రిజిస్టర్ అయినట్లు ఓ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఇంకో నివేదికలో 1914-33 మధ్య ఈ భూమి రామ్ శ్రావణ్ అనే వ్యక్తి పేరిట రిజిస్టరై ఉంది. ఇందులో 1,380 చదరపు మీటర్లు 1957-63 మధ్య రామ్ శ్రావణ్ కుమారుడు గణేశ్ ప్రసాద్ పేరిట ఉంది.
అది మా కిందే ఉంది: బ్రిజ్‌మోహన్ దాస్
135వ నంబరు భూమిలో 1,255 చదరపు మీటర్ల స్థలం ఎన్నో ఏళ్లుగా తమ అధీనంలో ఉందని కోట్ రామచంద్రలోని దశరథ్ గఢీకి చెందిన మహంత్ బ్రిజ్‌మోహన్ దాస్ తెలిపారు. విశ్వనాథ్ ప్రసాదాచార్య దాని కౌలుదారు అని.. తన గురువైన ఆశ్రయదాస్ సహకౌలుదారని తెలిపారు. విశ్వనాథ్ శిష్యుడైన దేవేంద్ర ప్రసాదాచార్య అధీనంలోని భూమి వ్యవహారాలను కూడా తానే చూస్తున్నట్లు తెలిపారు.