కోవిడ్-19పై ఈ మాత్రం పోరు సరిపోదు: మాయావతి

ABN , First Publish Date - 2020-06-01T22:57:44+05:30 IST

పెరుగుతున్న కరోనా కేసులపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరులో కేంద్ర

కోవిడ్-19పై ఈ మాత్రం పోరు సరిపోదు: మాయావతి

లక్నో: పెరుగుతున్న కరోనా కేసులపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సీరియస్‌‌గా వ్యవహరించాలని కోరారు. జూన్ 8 నుంచి ‘అన్‌లాక్-1’ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల బస్సు సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇకపై ప్రయాణికుల, సరుకు రవాణా వాహనాలకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. 


‘‘పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా సడలింపులతో 69వ రోజున లాక్‌డౌన్-5 ప్రారంభమైంది. జూన్ 30 వరకు ఇది కొనసాగనుంది. దేశం మొత్తం కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని మాయావతి ట్వీట్ చేశారు. కాగా, దేశంలో ఈ ఏడాది మార్చి 25న తొలిసారి లాక్‌డౌన్‌ను విధించారు.  


అలాగే, సరిహద్దు సమస్యపై పొరుగుదేశం నేపాల్ ‘ఊహించని’ విధంగా అడుగు ముందుకు వేయడం గురించి కూడా కేంద్రం తీవ్రంగా ఆలోచించాలని మాయావతి మరో ట్వీట్‌లో సూచించారు. ‘‘కాలాపానితోపాటు భారత భూభాగంలోని 370 కిలోమీటర్ల ప్రాంతాన్ని నేపాల్ తన కొత్త మ్యాప్‌లో చూపించి భారత్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ ఊహించని చర్యపై కేంద్రం సీరియస్‌గా ఆలోచించాలి’’ అని మాయావతి పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-01T22:57:44+05:30 IST