ఎందుకో ఈ ఉదాసీన వైఖరి!

ABN , First Publish Date - 2021-08-29T06:08:32+05:30 IST

అనేక ఆటంకాలు..

ఎందుకో ఈ ఉదాసీన వైఖరి!
వెలిగొండ రెండో టన్నెల్‌

వెలి‘గొండ’

అటు తెలంగాణ కుటిల నీతి 

ఇటు జగన్‌ సర్కారు ఉదాసీనత

నిధులు ఇవ్వరాదంటూ కేంద్రానికి టీ ప్రభుత్వం లేఖ

గెజిట్‌లో అన్‌అప్రూవ్డ్‌ అంటూ మెలిక

తమ రాష్ట్రంలో యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం

మోసాన్ని అడ్డుకోకపోతే జిల్లాకు తీవ్రనష్టం

తక్షణం సీఎం స్పందించాలని టీడీపీ డిమాండ్‌


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): పాలకుల నిర్లక్ష్యంతో వెలిగొండపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కృష్ణాజలాల వాడకంపై తెలంగాణ ప్రభుత్వం కుటిలనీతి ప్రదర్శిస్తుండగా సకాలంలో ఆ చర్యలను అడ్డుకోవడంలో మన రాష్ట్రప్రభుత్వం తగు చొరవ చూపడం లేదు. ఈ కారణంగా భవిష్యత్‌లో జిల్లాకు తీవ్రనష్టం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వరాదంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం ఆందోళన కలిగించే అంశం. దానిపై ఇంతవరకూ పాలకులు స్పందించకపోవడం దారుణం. అలాగే కేంద్ర గెజిట్‌లో వెలిగొండను చేర్పించడం విషయంలో మన రాష్ట్రప్రభుత్వం నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేదు. దీంతో జిల్లాప్రజల్లో ఆందోళన నెలకొంది. అసలు ప్రాజెక్టులపై వైసీపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. దాంతో పాటు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. 


అనేక ఆటంకాలు, ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాకపోగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ తీరుతో అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. వెలిగొండ తరహాలోనే ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ఆరేడు ప్రాజెక్టులు చేపట్టారు. అందులో రాష్ట్ర విభజన అనంతరం గాలేరు-నగరి, హంద్రీనీవా, ఎస్‌ఆర్‌బీసీ వెలిగొండ ప్రాజెక్టులు మన రాష్ట్రంలోకి రాగా నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు తెలంగాణలోకి వెళ్లాయి. పునర్విభజన చట్టంలో ఈ ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించి నీటి కేటాయింపులు విషయం చూడాలని కృష్ణా నీటి పంపకాలపై నియమించిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. కాగా సదరు ట్రిబ్యునల్‌ ఆయా రాష్ట్రాలకు చేసిన నీటి కేటాయింపులపై సుప్రీంకోర్టులో కేసు ఉండటంతో ఈ విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపుపై స్పష్టత రాలేదు. అదే సమయంలో గతంలో కృష్ణా నీటి పంపకాలపై అమలులో ఉన్న బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల కృష్ణా జలాలలో 512 ఏపీకి 299 తెలంగాణకు విభజన సమయంలోనే కేటాయించారు. ఇప్పటికీ అదే అమలులో ఉంది.

 

నిత్యం గిల్లికజ్జాలు.. ఫిర్యాదులు

ట్రిబ్యునల్‌ తీర్పులు, రాష్ట్ర విభజనచట్టం, దాని ఆధారంగా చేసిన నీటి పంపకాలు, కృష్ణాజలాల పంపిణీ పర్యవేక్షణకు నియమించిన కేఆర్‌ఎంబీ సూచనలు బేఖాతర్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిత్యం నీటి విషయంలో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వస్తోంది. తెలంగాణ ఏర్పడిన అనంతరం పాలమూరు, రంగారెడ్డితోపాటు సుమారు 255 టీఎంసీల సామర్థ్యం కలిగిన పలు ఇతర ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా గతనెలలో మరికొన్నింటి సామర్థ్యం పెంపునకు నిర్ణయించింది. వీటన్నింటికీ సుమారు 400 టీఎంసీల నీరు అవసరం కాగా శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 800 అడుగుల నుంచి నీటిని తీసుకొనేలా డిజైన్‌ చేశారు. వీటిలో ఏఒక్క దానికీ కేఆర్‌ఎంబీ, అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌, ఇతరత్రా చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు లేవు. తద్వారా అవి అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టులు అన్నది నిర్వివాదాంశం. అయితే రాయలసీమ కోసం మనప్రభుత్వం చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు వెడల్పు వంటి వాటిని అనుమతులు లేకుండా చేస్తున్నారని తెలంగాణ ఫిర్యాదులు చేస్తూ తమ చర్యలను సమర్థించుకుంటోంది. పనిలో పనిగా వెలిగొండపైనా తమ అక్కసు వెళ్లగక్కింది. 


నీటి లభ్యతపై ఆందోళన

అటు తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం, ఇటు సీమ ప్రాజెక్టులతో భవిష్యత్‌లో సాగర్‌ డ్యామ్‌కు నీటి సరఫరా తగ్గి సాగర్‌ ఆయకట్టుతో పాటు వెలిగొండకు కూడా నీటి లభ్యత కష్టం అన్న ఆందోళన జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఇటీవల కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటి నీటిపంపిణీ నిర్వహణఫై కేంద్రం గెజిట్‌ను ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన, 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఐదింటిని గెజిట్‌లో పేర్కొన్న కేంద్రం వెలిగొండను ఆన్‌ అప్రూవ్డ్‌గా పేర్కొంది. దీనిపై జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం కాగా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంకు, కేంద్ర జలశక్తిశాఖ మంత్రికి లేఖలు రాసి గెజిట్‌లో చేర్చాలని కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి గెజిట్‌లో చేర్చాలని సూచించారు. అలా సానుకూల సంకేతాలు కనిపించగా రాష్ట్రప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన వచ్చిన పరిస్థితి లేదు. 


ఎందుకో ఈ ఉదాసీన వైఖరి!

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్రప్రభుత్వం మొదటి నుంచి ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. అందువల్లనే తొలిటన్నెల్‌ తవ్వకం పూర్తయినా నీరు తీసుకోలేని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కృష్ణానీటి వాడకంపై కుటిల నీతిని ప్రదర్శిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా జిల్లా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఫిర్యాదులు చేస్తోంది. గెజిట్‌లో అన్‌ అప్రూవ్డ్‌ ప్రాజెక్టుగా ఉన్నందున వెలిగొండకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వరాదని డిమాండ్‌ చేసింది. అంతేకాక తెలంగాణ ఈఎన్‌సీ ఏకంగా కేంద్రానికి లేఖ రాసి తద్వారా భవిష్యత్‌లో వెలిగొండకు నీటి కేటాయింపును వివాదం చేసేందుకు ముందు నుంచే చర్యలు చేపట్టారు. తక్షణం రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమై తెలంగాణ చర్యలను అడ్డుకోవడంతోపాటు వెలిగొండను కేంద్ర గెజిట్‌లో చేర్చేలా చర్యలు తీసుకోకపోతే జిల్లాకు తీవ్ర నష్టంతోపాటు వెలిగొండ ఉనికికే ప్రమాదం కలగడం ఖాయంగా కనిపిస్తోంది.


తక్షణం సీఎం స్పందించాలి: ఏలూరి సాంబశివరావు, టీడీపీ ఎమ్మెల్యే 

రాష్ట్ర నీటి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తొలి నుంచి ఉదాసీనంగానే ఉంది. ఆ ప్రభావం జిల్లాపై అధికంగా పడుతోంది. జిల్లాకు జరిగే నష్టాన్ని ఒకటికి రెండుసార్లు వివరిస్తూ సీఎంకు లేఖలు రాశాం. కనీసం స్పందన లేదు. వెలిగొండను గెజిట్‌లో చేర్చాలని కేంద్రమంత్రికి కూడా లేఖ రాశాం. తెలంగాణ ప్రభుత్వం ఏదోరకంగా వివాదం సృష్టించి నీటి విషయంలో ఆటంకాలు కల్పిస్తుంటే మన ప్రభుత్వం తగుస్థాయిలో స్పందించడం లేదు. ఇప్పటికైనా సీఎం స్పందించాలి. 


Updated Date - 2021-08-29T06:08:32+05:30 IST