ప్రభుత్వాసుపత్రిలో దాహం .. దాహం

ABN , First Publish Date - 2021-09-06T06:12:39+05:30 IST

రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి లోని అవుట్‌ పేషెంట్‌(ఓపీ) విభాగం ఎదురుగా ఉన్న మంచినీటి ప్లాంటు(కూల్‌ వా టర్‌ కియోస్క్‌) మూలనపడింది.

ప్రభుత్వాసుపత్రిలో దాహం .. దాహం
రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి ఓపీ విభాగం ఎదురుగా పనిచేయని కూల్‌వాటర్‌ కియోస్క్‌

  • మూలన పడిన కూల్‌ వాటర్‌ కియోస్క్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 5: రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి లోని అవుట్‌ పేషెంట్‌(ఓపీ) విభాగం ఎదురుగా ఉన్న మంచినీటి ప్లాంటు(కూల్‌ వా టర్‌ కియోస్క్‌) మూలనపడింది. కొద్దిరోజులుగా ఇది పనిచేయకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి వివిధ వైద్యసేవలకోసం వస్తున్నవారికి తాగడానికి మంచినీళ్లు దొరకడంలేదు. ప్రతిరోజూ ఓపీకి పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఓపీ బిల్డింగ్‌ ప్రారంభంలోనే రోగులకు మందులు ఇస్తుంటారు. ఓపీ విభాగం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో కొవిడ్‌-19 అనుమానితులకు టెస్టులు చేసే సెంటర్‌ ఉంది. దీంతో ఉదయం నుంచి ఈ ప్రాంతంలో రోగులు, వారి సహాయకుల సంచారం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ కూల్‌వాటర్‌ కియోస్క్‌ వద్దనే దాహం తీర్చుకుంటారు. గతంలో రాజమహేంద్రవరంలోని ఇంటర్నేషనల్‌ పేపర్‌మిల్లు సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేసినా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజల దాహార్తి తీరడంలేదు. ప్రస్తుతం ఇది పనిచేయకపోవడంతో రోగులతోపాటు వారి బంధువులు, సహాయకులు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో మార్చురీకి వెళ్లేదారిలో లయ న్స్‌క్లబ్‌ ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంటు ఉన్నా ఈ నీరు తాగడానికి సురక్షితం కాదని చెబుతున్నారు. దీని వాటర్‌ట్యాంకు క్లీన్‌ చేసి ఎన్నాళ్లయిందో కూడా తెలీదని పేర్కొంటున్నారు. ప్రభుత్వాసుపత్రి లోపల ఓపీ కారిడార్‌లో ఫ్రిజ్‌ తరహాలో చిన్న వాటర్‌ కూలర్‌ ఉన్నా ఇది ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. దీంతో అందరూ వాటర్‌బాటిళ్లు కొనుక్కుని దాహం తీర్చుకోవాల్సి వస్తోంది. కూల్‌ వాటర్‌ కియోస్క్‌ మూలనపడడంతో జిల్లా ఆస్పత్రికి వచ్చే ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. ఈ మంచినీటి సమస్యపై ఆసుపత్రి అధికారులు దృష్టిసారించాల్సి ఉంది.

Updated Date - 2021-09-06T06:12:39+05:30 IST