Abn logo
Oct 29 2020 @ 18:20PM

మమత ప్రభుత్వంపై గవర్నర్ ఆగ్రహం

Kaakateeya

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ, పోలీసు వ్యవస్థల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై ఘాటుగా స్పందించారు. అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయన్నారు. ఈ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారన్నారు. 


గవర్నర్ ధన్‌కర్ న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇంత దారుణంగా అధికార త్యాగం చేస్తారని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. పశ్చిమ బెంగాల్‌కు రాష్ట్ర భద్రతా సలహాదారు ఉన్నారని, ఆయన రిటైర్డ్ డీజీపీ అని, ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి మాత్రమే ఆయన ఉన్నారా? అని ప్రశ్నించారు. 


రాష్ట్రంలో అల్‌ఖైదా విస్తరిస్తోందని, కొందరు అరెస్టవుతున్నారని అన్నారు. చట్టవిరుద్ధంగా బాంబుల తయారీ జరుగుతోందని, ప్రతి సంఘటనలోనూ బాంబులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయని, అంబులెన్సుల్లో బాంబులను తీసుకెళ్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో వీళ్లు (ప్రభుత్వం) ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 


ధన్‌కర్ ఈ నెల 28 నుంచి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన గురువారం సమావేశమయ్యారు. సుమారు ఒక గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. 


Advertisement
Advertisement