వచ్చే ఏడాది వరకూ కరోనా వ్యాక్సీన్ రాదన్న ప్రభుత్వం.. కాసేపటికే!

ABN , First Publish Date - 2020-07-06T03:26:23+05:30 IST

ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సీన్ ఇప్పుడే మార్కెట్లోకి రాదని, కనీసం వచ్చే ఏడాది వరకూ అయినా ఆగాల్సిందేనని కేంద్రం ప్రకటించింది.

వచ్చే ఏడాది వరకూ కరోనా వ్యాక్సీన్ రాదన్న ప్రభుత్వం.. కాసేపటికే!

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సీన్ ఇప్పుడే మార్కెట్లోకి రాదని, కనీసం వచ్చే ఏడాది వరకూ అయినా ఆగాల్సిందేనని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ షాకింగ్ వార్త వెలువరించింది. ఇది చూసిన ప్రజలు అవాక్కయ్యారు. అయితే కాసేపటికే ఈ స్టేట్‌మెంట్‌ను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్‌ఆర్) ఓ ప్రకటన చేసింది. దీనిలో కరోనా వ్యాక్సీన్‌ను కచ్చితంగా ఆగస్టు 15 నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఐసీఎమ్‌ఆర్ పేర్కొంది. భారత్‌లో కోవాక్సీన్, జికోవ్-డీ వ్యాక్సీన్లు హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 140 వ్యాక్సీన్లు హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ‘ఏదిఏమైనా వచ్చే ఏడాది వరకూ ఈ వ్యాక్సీన్లలో ఏదీ మార్కెట్లోకి రాదు’ అంటూ శాస్త్రసాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక వెబ్‌సైట్లో ప్రచురించారు. అయితే ప్రచురితమైన కాసేపటికే మళ్లీ ఈ వార్తను తొలగించారు. దీంతో ఆగస్టు నాటికి కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు.

Updated Date - 2020-07-06T03:26:23+05:30 IST