Abn logo
Jul 22 2021 @ 23:46PM

గ్రానైట్‌ గ్యాంగ్‌వార్‌

అక్రమంగా గ్రానైట్‌ ను రవాణా చే స్తూ పట్టుబడిన లారీలు

 మార్టూరు ప్రాంతంలో హల్‌చల్‌

గ్రానైట్‌ లారీలను బోర్డర్‌ దాటించడమే పని

పైలట్‌ వాహనాలతో పక్కాగా వ్యవహారం

విద్యార్థులను ఆ దందాలోకి లాగేస్తున్నారు

బైకులు, కార్లు, విలాసవంతమైన ఇళ్లు

పలువురిని ఆ వైపు మరలిస్తున్న కొందరు

గ్రూపులుగా విడిపోయి ఘర్షణల పడుతున్న వైనం

మార్టూరు, జూలై 22 :

మార్టూరు ప్రాంతంలో గ్రానైట్‌ అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. ఇది చాలామందికి కాసుల వర్షం కురిపిస్తోంది. అటు అధికారులకు సైతం జేబులు నింపుతోంది. మొత్తంగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వ్యవహారంలో కొందరు యువకులు రోజుకు లక్షలు సంపాదించేవారు ఉన్నారు. వారు పెద్దగా చదువుకోకపోయినా ఈ దందాలో మాస్టర్‌ డిగ్రీ పొందారు. వారి వ్యాపారానికి రాత్రింబవళ్లు ప్రైవేటు సైన్యం మాదిరిగా అండగా ఉండేందుకు కొంతమంది యువకులను, విద్యార్థులను చేరదీస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి రూపాయలు ముట్టచెబుతారు. ఇక విలాసాల ఖర్చులు మామూలే. కొంతమంది చదువుకుంటున్న యువకులు కూడా ఈ అక్రమార్కుల వలలో ఇరుక్కుపోతున్నారు. దాంతో ఎప్పుడూ నలుగురు యువకులు తమ వెంట ఉండటంతో ఒకరిపై మరొకరు దాదాగిరి చేసే స్థాయికి వారు ఎదిగిపోయారు. దీంతో తరచూ గొడవలు జరుగతున్నాయి. కొన్ని హత్యాయత్నాల వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

          

 వారికి పట్టుమని మూడు పదుల వయస్సు కూడా ఉండదు. రాత్రయితే మందు, విందు తప్పనిసరి. అక్రమంగా గ్రానైట్‌ను రవాణా చేసే లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో వారు ఆరితేరిపోయారు. జేబు నిండా నోట్ల కట్టలు, కళ్లు చెదిరే భవంతులు, విలాసవంతంగా కార్లలో తిరగడం, ఇవన్నీ అక్రమ గ్రానైట్‌ రవాణా చేస్తున్న యువకుల జీవనశైలిగా మారింది. మార్టూరులో ప్రస్తుతం అక్రమంగా గ్రానైట్‌ను రవాణా చేసే యువకులు 40 మందికిపైగానే ఉన్నారు. మార్టూరు నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాలకు గ్రానైట్‌ స్లాబులు తరలుతున్నాయి. ప్రభుత్వానికి పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ, వీరు జేబులు నింపుకొంటున్నారు. గ్రానైట్‌ లారీలను అందరి కళ్లుగప్పి దగ్గర ఉండి మరీ సరిహద్దులు దాటిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల సహకారం, పోలీసులతో లాలూచీలు, మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారుల మామూళ్లు.. మొత్తంగా గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు దర్జాగా తరలిస్తున్నారు.


పోటీతత్వంతో పెరిగిన ఆధిపత్యపోరు

గత రెండేళ్లు నుంచి గ్రానైట్‌ అక్రమ రవాణా చేసే యువకుల్లో ఆఽధిపత్య పోరు పెరిగింది. ఒకరి వ్యాపారాన్ని మరొకరు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుండటం, దానికి తోడు వారి మధ్య ఆర్థికపరమైన లావాదేవీలలో తేడాలు రావడం తదితర కారణాలతో కక్షలు, కార్పణ్యాలు పెరుగుతున్నాయి. దాంతో ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. గత మంగళవారం మండలంలోని కోనంకి గ్రామ సమీపంలో జరిగిన సంఘటన అందుకు నిదర్శనం. మార్టూరుకు చెందిన అక్రమ గ్రానైట్‌ రవాణాలో దొంగబిల్లులు ద్వారా వ్యాపారం చేసే యువకునిపై రాజుగారిపాలెం, బొబ్బేపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు అక్రమ వ్యాపారం చేసే యువకులు నలుగురితో కలిసి భౌతిక దాడి చేశారు. ఈ సంఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అంతేగాకుండా ఈనెల 16న సంపత్‌నగర్‌కు చెందిన ఒక యువకునిపై అదే కాలనీకి చెందిన యువకుడు నలుగురితో కలిసి ఇసుకదర్శి పాండురంగస్వామి గుడి సమీపంలో ఏకంగా హత్యాప్రయత్రం చేశాడు. అందుకు వారి మధ్య గ్రానైట్‌ అక్రమ రవాణా వ్యవహారంలో పాత కక్షలు, విభేధాలు ఉండటమే కారణమని తెలిసింది. పది రోజుల క్రితం కొణిదెన రోడ్డులోని గొట్టిపాటి నగర్‌లో అక్రమ వ్యాపారం చేసే యువకునికి, రాజుగారిపాలెంకు చెందిన యువకునికి ఈ గ్రానైట్‌ విషయంలోనే మార్కెట్‌ యార్డు వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. అదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అందరూ పరారయ్యారు. 


కర్ణాటకలోనూ ఘర్షణలు

ఇవన్నీ ఒక ఎత్తయితే ఏడాది క్రితం మార్టూరు ఇస్మాయిల్‌ టీసెంటరు వద్ద గ్రానైట్‌ అక్రమ రవాణాలో మంచి ఫామ్‌లో ఉన్న నాగరాజుపల్లికి చెందిన యువకుడు, ఈ వ్యాపారం చేస్తూ గతంలో సీడీల షాపు నిర్వహించిన వ్యక్తిపై వెంటపడి మరీ భౌతికదాడి చేశాడు. మన రాష్ట్రంలోనే గాకుండా నాలుగు నెలలు క్రితం ఏకంగా కర్ణాటక రాష్ట్రం బసవకల్యాణి ఏరియాలో కూడా ఈ అక్రమ వ్యాపారులు రెండు గ్రూపులుగా అక్కడ దాడులు చేసుకున్నారు. వారి గ్రానైట్‌ లారీలను అక్కడ పోలీసులు పట్టుకోవడంతో మార్టూరు నుంచి వెళ్లిన రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య గొడవ జరిగి అక్కడ దాడులు చేసుకున్నారు. వారికి మార్టూరులో అక్రమవ్యాపారం చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు తరచుగా ఈ వ్యాపారం చేసే యువకుల మధ్య జరుగుతూనే ఉన్నాయి. ఏడునెలల క్రితం పోలీసులు గ్రానైట్‌ అక్రమరవాణాకు సహకరిస్తున్నారంటూ ఆ రంగంలోన ఉంటున్న ఒక యువకుడు మార్టూరులో ఏకంగా కరపత్రాలు వేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. ఇలాంటి సంఘటన అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనమని ప్రజానీకం వ్యాఖ్యానిస్తున్నారు.


అక్రమార్కులకు కేరాఫ్‌ ఈ లాడ్జి

అక్రమ వ్యాపారం చేసే యువకులకు మార్టూరు సమీపంలోని ఒక లాడ్జి కేరాఫ్‌గా మారింది. అర్ధరాత్రి అపరాత్రితో సంబంధం లేకుండా సొంతింటి మాదిరిగా ఈ లాడ్జిలో బసచేస్తారు. కొంతమంది ఏకంగా నెలరోజులకు గదులు అద్దెకు తీసుకుంటారంటే అతిశయోక్తికాదు. ఇక గదుల్లో మద్యంతో పాటు చిత్తుబొమ్మ అడుతూ యువకులు కాలక్షేపం చేస్తుంటారు. గ్రామానికి దూరంగా ఉండటంతో అక్రమ వ్యాపారస్తులకు ఈ లాడ్జి అనువైన స్థలంగా మారింది. అయితే ఇటీవల కొంతమంది అందమైన యువతులను తీసుకువస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ అక్రమార్కులకు అడ్డుకట్ట వేయకపోతే వారి వ్యవహారాలు శ్రుతిమించిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం: ఎస్‌ఐ

గ్రానైట్‌ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ పి.చౌడయ్య వారిని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఈ ప్రాంతంలో అక్రమ వ్యాపారం చేసే వారితో స్టేషన్‌లో ఎస్‌ఐ సమావేశం ఏర్పాటుచేశారు. భౌతిక దాడులకు పాల్పడటం, అక్రమ పద్ధతులకు పాల్పడటం చేసే వారిపై రౌడీషీట్లు తెరుస్తామని వారికి తెలిపారు. పద్ధతులు మార్చుకొని, సమాజంలో నీతివంతంగా బతకడానికి ప్రయత్నించాలని, వాటిని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 


స్టేషనులో అక్రమార్కులతో సమావేశమైన ఎస్‌ఐ పి చౌడయ్య