బూడిద.. భయం..

ABN , First Publish Date - 2022-03-14T05:53:36+05:30 IST

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రాజీవ్‌రహదారిపై ప్రయాణం.. అత్యంత ప్రమాదకంగా మారింది.

బూడిద.. భయం..

- ప్రమాదకరంగా మారిన రాజీవ్‌ రహదారి

- వందలాది టిప్పర్ల ద్వారా యాష్‌ తరలింపు

- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

- పట్టించుకోని సంబంధిత అధికారులు

మార్కండేయకాలనీ, మార్చి 13: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రాజీవ్‌రహదారిపై ప్రయాణం.. అత్యంత ప్రమాదకంగా మారింది. రహదారిపై పేరుకుపోయిన బూడిదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుందనపల్లి, జెన్‌కో యాష్‌ పాండ్ల నుంచి నిత్యం వందల సంఖ్యలో బూడిద టిప్పర్లు.. వాహనాలు వెదజల్లుతున్న బూడిదతో రోడ్డు నిండిపోతోంది. యాష్‌ బ్రిక్‌ కంపెనీల పేర పెద్దఎత్తున యాష్‌ తరలిస్తుండడంతో బుగ్గ క్రాస్‌ నుంచి మంచిర్యాల వరకు 30కిలో మీటర్ల ఇదే పరిస్థితి. వందల సంఖ్యలో బూడిద తరలిస్తున్న వాహనాలు కనీస నిబంధనలు పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ ప్రస్తుతం రోడ్డు కనిపించని తీవ్ర స్థాయిలో బూడిద ఎగిసిపడుతోంది. ఈ దుమ్ముతో చీకటి పడకముందే వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు వెంట ఉన్న చెట్లన్నీ బూడిదతో నిండిపోయాయి. గతంలో యాష్‌ను ట్యాంకర్లలో తరలించేవారు. అప్పుడు ఇలాంటి ఇబ్బంది చాలా తక్కువగా ఉండేది. కానీ ఇటీవల టిప్పర్లు ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా, టార్పాలిన్‌ను పూర్తిస్థాయిలో వేయకుండా బూడిదను తరలిస్తున్నారు. టిప్పర్ల సంఖ్య రోజుకురోజుకు పెరుగుతూ వందల సంఖ్యకు చేరడంతో రోడ్డు మొత్తం బూడిదగా మారింది. వాహనాల రాకపోకలతో బూడిద దుమ్ముతో నిండిపోయింది. స్పీడ్‌ బ్రేకర్స్‌ వద్ద బూడిద కుప్పలుగా పేరుకుపోతుంది. దీంతో వాహనదారులు ప్రయాణించే పరిస్థితి లేకుండా మారింది. 

పట్టించుకునే వారు కరువు..

బుగ్గ క్రాస్‌ రోడ్డు నుంచి మంచిర్యాల వరకు దుమ్ముతో రోడ్డు పూర్తిగా ప్రమాదకరంగా మారింది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు నడుస్తూ బీజీగా ఉండే రహదారిపై ఊపిరి పీల్చుకోలేనంతగా దుమ్ము ఎగిసిపడుతుడడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. దుమ్ము పీల్చుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇంత ప్రమాదకరంగా మారిన రాజీవ్‌ రహదారి పరిస్థితి రవాణాశాఖ గానీ, కాలుష్య నియంత్రణ మండలి కానీ, ఇటు ట్రాఫిక్‌ పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో బూడిద వాహనాలు యధేచ్ఛగా బూడిద వెదజల్లుతూ ప్రయాణాలు సాగిస్తున్నాయి. ప్రమాద కారకాలుగా మారిన బూడిద టిప్పర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు సైతం టిప్పర్లను రద్దు చేసి ట్యాంకర్ల ద్వారానే యాష్‌ తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-03-14T05:53:36+05:30 IST