నేటి గ్రేటర్‌ ఫలితాలపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2020-12-04T05:34:34+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలోని పార్టీల నేతలతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలు జోరుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగడంతో ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది.

నేటి గ్రేటర్‌ ఫలితాలపై ఉత్కంఠ

ఫలితాలపై ఉమ్మడి జిల్లా వాసుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..   
జోరుగా కొనసాగుతున్న బెట్టింగ్‌లు

నిజామాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలోని పార్టీల నేతలతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలు జోరుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగడంతో ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో బెట్టింగ్‌లు కూడా భారీ ఎత్తున పెడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీలకు  ఎక్కువగా సీట్లు వస్తాయని ఎవరికి వారే అంచనాలకు వస్తున్నారు. గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నా యి. ప్రధానంగా అధికార  టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య జోరుగా పోటీ కొనసాగింది. వీటికి దీటుగానే ఎంఐఎం, కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రచారం చేశారు. అన్ని పార్టీల నేతలు పోటీపడి ప్రచారం కొనసాగించినా గ్రేటర్‌ ప్రజలు  మాత్రం ఎక్కువగా పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. ఓట్లు ఎక్కువగా వేయకపోవడం వల్ల పోలింగ్‌ శాతం కూడా అనుకున్న రీతిలో పెరగలేదు. నేడు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా భారీగా ఆసక్తి పెరిగింది. సాధారణ ప్రజల్లో కూడా ఈ ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులందరూ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా తమకు కేటాయించిన డివిజన్‌లలో ప్రచారాలు చేశారు. వీరితో పాటు బీజేపీ ఎంపీతో పాటు ఇతర నేతలు గ్రేటర్‌ పరిధిలో ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు ఎంఐఎం నేతలు కూడా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంతో పోలిస్తే ఈ ఎన్నికలు ఈ దఫా ఉత్కంఠగా కొనసాగాయి. భారీ బహిరంగసభలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌,  మంత్రులందరూ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్కంఠగా జరగడంతో ఈ ఎన్నికల ఫలితాలపైన అందరిలో ఆసక్తి నెలకొంది. అధికార,  టీఆర్‌ఎస్‌, బీజేపీలపైన పెద్దఎత్తున ఉమ్మ డి జిల్లా పరిధిలో బెట్టింగ్‌లు కాస్తున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి పార్టీల గ్రామస్థాయి నేతలు కూడా అంతర్గతంగా తమ అభ్యర్థులు గెలుస్తారని ఈ బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఎవరికి వారే అంచనాలకు వస్తున్నారు. పోరు ఉత్కంఠగా  సాగడం వల్ల టీఆర్‌ఎస్‌, బీజేపీలపైనే ఈ బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఈ దఫా టీఆర్‌ఎస్‌ మేయరే సీటు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తుండగా బీజేపీ కూడా రేసులో ఉంటుందని బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో నేడు తేలనుండగా ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రం చర్చలు భారీగా కొనసాగుతున్నాయి. గ్రేటర్‌లో ఎన్నికల ఫలితాల్లో మార్పు ఉంటే జిల్లాలో కూడా తమకు కలిసివస్తుందని భావిస్తున్నారు. ఈ గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నేడు  తేలనుంది. బెట్టింగ్‌లు కాసిన వారికి ఎలాంటి అవకాశం వస్తుందో నేటి ఫలితాలతో క్లియర్‌ కానుంది. ఆయా పార్టీల నేతలు మాత్రం తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు. గ్రేటర్‌లో మెరుగైన ఫలితాలు వస్తే తమకు కూడా మంచి అవకాశాలు వస్తాయని ప్రచారం నిర్వహించిన నేతలు అంచనా వేసుకుంటున్నారు.  గ్రేటర్‌లో ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదని అధికార పార్టీకి చెందిన నేతలు తెలిపారు. గ్రేటర్‌లో మెరుగైన ఫలితాలు వస్తే జిల్లల్లో కూడా తమకు మంచి అవకాశాలు ఉంటే బీజేపీకి చెందిన నేతలు తెలిపారు.

Updated Date - 2020-12-04T05:34:34+05:30 IST