వీధి దీపాలపై గ్రేటర్‌ దృష్టి

ABN , First Publish Date - 2022-01-18T05:52:11+05:30 IST

నగరంలో వీధి దీపాల నిర్వహణ విధానాన్ని మార్చాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు.

వీధి దీపాలపై గ్రేటర్‌ దృష్టి

వార్డు యూనిట్‌గా నిర్వహణకు ప్రతిపాదన 

సీసీఎంఎస్‌తో ప్రయోజనం లేదంటున్న అధికారులు

మార్చితో ముగియనున్న కాంట్రాక్టు

...ఆ తరువాత వార్డుల వారీగా బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించే యోచన

ఎక్కడైనా లైట్‌ వెలగకపోతే తక్షణం పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందంటున్న ఇంజనీరింగ్‌ అధికారులు


జీవీఎంసీ పరిధిలో మొత ్తం ఎల్‌ఈడీ లైట్లు 1.2 లక్షలు

నిర్వహణ కోసం ఏజెన్సీకి చెల్లిస్తున్న మొత్తం రూ.2.2 కోట్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో వీధి దీపాల నిర్వహణ విధానాన్ని మార్చాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం ఒకే ఏజెన్సీకి కాకుండా ఒక్కో వార్డులో వీధి దీపాల నిర్వహణను ఒక్కొక్క ఏజెన్సీకి అప్పగించడం వల్ల ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) కాంట్రాక్టు ఈ ఏడాది మార్చితో ముగియనున్నది. ఆ తరువాత ఒప్పందాన్ని కొనసాగించకుండా, కొత్త విధానం తీసుకువచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు.


2014 అక్టోబరులో సంభవించిన హుద్‌హుద్‌ తుఫాన్‌ నగరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పెనుగాలులకు 30 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరకగా, 70 వేల వీధి దీపాలు ధ్వంసమైపోయాయి. ఆ సమయంలో నగరంలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన అప్పటి సీఎం చంద్రబాబునాయుడు వీధుల్లో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలా చేయడం వల్ల విద్యుత్‌ ఆదాతోపాటు జీవీఎంసీకి బిల్లుల భారం తగ్గుతుందని సూచించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)తో జీవీఎంసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం నగరమంతా దాదాపు 1.2 లక్షల ఎల్‌ఈడీ లైట్లను అమర్చడంతోపాటు ఎక్కడైనా లైట్లు పాడైనట్టయితే రెండు రోజుల్లోగా కొత్తవాటిని అమర్చడం, నిర్వహణ, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు వంటి బాధ్యతలను ఏజెన్సీ చూసుకోవాలి. 2015 మార్చి నుంచి ఏడేళ్లకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం ఏజెన్సీకి జీవీఎంసీ నెలకు రూ.2.2 కోట్లు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో వీధిదీపాలు పాడైనట్టయితే ఆ సమాచారం సకాలంలో సిబ్బందికి తెలిసేలా, మానవ ప్రమేయం లేకుండానే సాయంత్రం, ఉదయం వేళల్లో లైట్లను ఆన్‌, ఆఫ్‌ చేసేలా సెంట్రల్‌ కంట్రోల్‌ అండ్‌ మానటరింగ్‌ సిస్టమ్‌ (సీసీఎంఎస్‌)ను అందుబాటులో తెచ్చారు. ప్రతి ఆరు వేల దీపాలకు ఒక సెల్‌ను ఏర్పాటుచేసి, ఒకరిని ఇన్‌చార్జిగా నియమించి ల్యాప్‌టాప్‌ అందించారు. సదరు ఇన్‌చార్జి తన పరిధిలో ఎక్కడైనా వీధిదీపాలు వెలగని పక్షంలో టెక్నాలజీ ద్వారా గుర్తించి 48 గంటల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. అయితే మొదట్లో ఈ విధానం బాగానే పనిచేసినప్పటికీ తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఎల్‌ఈడీ లైట్లను గతంలో వీధి దీపాలు వున్న స్తంభాలపైనే అమర్చారు. ఆ స్తంభాల పై నుంచి వెళుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్ల ప్రభావం వల్ల ఎల్‌ఈడీ లైట్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రస్తుతం నగరంలో వేల సంఖ్యలో వీధి దీపాలు వెలగడం లేదు. ఆ విషయంపై నగరవాసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం వుండడం లేదు. ఎప్పుడో తీరిగ్గా సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించి వెళుతున్నా...కొద్దిరోజుల తర్వాత షరామామూలే. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు పునరాలోచనలో పడ్డారు.


వార్డు యూనిట్‌గా వీధి దీపాల నిర్వహణ బాధ్యత

నగరం మొత్తం ఒకే ఏజెన్సీకి కాకుండా వార్డును యూనిట్‌గా తీసుకుని నిర్వహణ బాధ్యత అప్పగించినట్టయితే సత్ఫలితాలు వుంటాయని అధికారులు భావిస్తున్నారు. వార్డులో ఎక్కడైనా లైట్‌ వెలగకపోతే కార్పొరేటర్‌కు తెలుస్తుంది కాబట్టి, వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్యను తక్షణం పరిష్కరించేందుకు వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వీధి దీపాల నిర్వహణ కోసం వెచ్చిస్తున్న మొత్తంతో కొత్తవిధానంలో వీధి దీపాలను నిర్వహించవచ్చునని పేర్కొంటున్నారు. ఈఈఎస్‌ఎల్‌తో మార్చితో కాంట్రాక్టు ముగియనుండడంతో కొత్త విధానంపై కసరత్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-18T05:52:11+05:30 IST