గంగమ్మ పైపైకి!

ABN , First Publish Date - 2021-10-19T04:23:51+05:30 IST

ఒకప్పుడు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ ప్రాంతాల పేరు వినగానే కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, బీడు భూములు, మెట్ట సాగు గుర్తుకొచ్చేవి. కానీ ప్రస్తుతం నాటి ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయి. ఎటుచూసినా జలసవ్వడే వినిపిస్తున్నది. అధిక వర్షాలతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

గంగమ్మ పైపైకి!
సిద్దిపేటలోని కోమటిచెరువు సమీపంలో నిండుకుండలా వ్యవసాయ బావి

జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల

6.15 మీటర్ల లోతులోనే జలాలు

గడిచిన పదేళ్లలో ఇదే రికార్డు

అధిక వర్షాలు, కాళేశ్వరం జలాల ప్రభావం

ఈ ఏడాది 1,201 మిల్లిమీటర్ల వర్షపాతం

వచ్చే యాసంగి సాగుకు అనుకూలం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 18 : ఒకప్పుడు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ ప్రాంతాల పేరు వినగానే కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, బీడు భూములు, మెట్ట సాగు గుర్తుకొచ్చేవి. కానీ ప్రస్తుతం నాటి ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయి. ఎటుచూసినా జలసవ్వడే వినిపిస్తున్నది. అధిక వర్షాలతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో పాతాళంలో ఉన్న భూగర్భజలాలు పైకొచ్చాయి. రెండేళ్ల నుంచి భూఉపరితల జలాల వృద్ధి పెరుగుతూ రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సగటున 6.15 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండడం గడిచిన పదేళ్లలో మొదటిసారి అని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 


రికార్డు స్థాయిలో భూగర్భజలాలు..

గతేడాది సెప్టెంబరు నెలలో జిల్లా వ్యాప్తంగా 7.25 మీటర్ల అడుగున భూగర్భ జలాలు ఉన్నాయి. నాడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, అప్పుడప్పుడే కాళేశ్వర జలాలు జిల్లాలో ప్రవేశించడంతో ఆ పరిస్థితి నెలకొంది. అప్పట్లో అదే రికార్డు. కానీ ప్రస్తుతం 6.15 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గడిచిన పదేళ్లకు సంబంధించిన భూగర్భ జలాల వివరాలను పరిశీలిస్తే ఇదే మెరుగని చెబుతున్నారు. ప్రధానంగా వర్గల్‌, హుస్నాబాద్‌, జగదేవపూర్‌, కొండపాక, నంగునూరు, చేర్యాల, కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట, మద్దూరు మండలాల్లో 5 మీటర్ల లోతులోనే జలాలు ఉన్నాయి. దౌల్తాబాద్‌, ములుగు, తొగుట, గజ్వేల్‌, దుబ్బాక మండలాల్లో 10 మీటర్లకు పైగా లోతున భూగర్భ జలాలు ఉండడం గమనార్హం. 


ఈసారి అధిక వర్షపాతం నమోదు

ఐదేళ్ల క్రితం జిల్లాలో వర్షపాతం 500 మిల్లిమీటర్లు కూడా లేదు. ఈ స్థాయి వర్షాల ఫలితంగా భూగర్భ జలాలు సైతం అంతంతమాత్రంగానే వృద్ధి చెందేవి. తాగు, సాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. కానీ 2019వ సంవత్సరంలో జిల్లాలో సగటున 1000 మిల్లిమీటర్ల వర్షపాతం దాటింది. 2020వ సంవత్సరంలో 1400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావడం జిల్లా చరిత్రలోనే రికార్డుగా చెప్పవచ్చు. ఈ ఏడాది ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 1201 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా 40 శాతం ఎక్కువగా వర్షాలు కురిశాయి. 


రిజర్వాయర్లకు జలకళ

జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్‌లో 3 టీఎంసీలు, రంగనాయకసాగర్‌లో 2.5 టీఎంసీల నీరు, కొండపోచమ్మసాగర్‌లో 10 టీఎంసీలు, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో సుమారు 13 టీఎంసీల నీరు ఉండడంతో అవి జలకళను సంతరించుకున్నాయి. సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి రిజర్వాయర్‌లో గోదావరి జలాలు ప్రవేశించి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మసాగర్‌కు చేరుతాయి. ఆ నడుమ రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్లు, వీటికి అనుబంధంగా చెరువులు, చెక్‌డ్యాములు, వాగులు, కాలువలు ఉన్నాయి. నీటి ప్రవాహం వల్ల ఇక్కడ భూఉపరితల జలాలు కూడా వృద్ధి చెందాయి. 


యాసంగికి శుభపరిణామం

రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లు ఉండడం, చెరువులు, చెక్‌డ్యాములు కళకళలాడుతుండడంతో బావులు, బోర్లకు నీటి కటకట తీరింది. యాసంగిలో వరిసాగుకు అనుకూలంగా మారేలా నీటి వనరులు ఉన్నాయి. ప్రస్తుత వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 3.14 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ఈ పరిణామాల వల్ల యాసంగిలోనూ ఇంచుమించు 3 లక్షల ఎకరాల్లో సాగు చేసే పరిస్థితి కనిపిస్తున్నది. తాజా భూగర్భజలాల వివరాల ప్రకారం యాసంగి పంటకు నీటి ఇబ్బందులు ఉండబోవని, అయితే రైతుల బావులు, బోర్ల పరిస్థితిని అంచనా వేయాల్సిన అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 



Updated Date - 2021-10-19T04:23:51+05:30 IST