బీజేపీ ముందు 3 ఆప్షన్లు.. సీఎం రేసులో ఆ ఇద్దరు..?

ABN , First Publish Date - 2021-09-11T23:04:17+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి ముందే ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ..

బీజేపీ ముందు 3 ఆప్షన్లు.. సీఎం రేసులో ఆ ఇద్దరు..?

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి ముందే ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు పగ్గాలు చేపట్టనున్నారనే ఉత్కంఠ ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో గుజరాత్ అభివృద్ధి కోసం ఐదేళ్ల ప్రయాణం సాగించానని, ఇప్పుడు రాష్ట్రం కొత్త శక్తితో మరింత అభివృద్ధి దిశగా సాగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ రూపానీ తన రాజీనామా అనంతరం ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.


కాగా, విజయ్ రూపానీ  రాజీనామాతో బీజేపీ ముందు 3 ప్రధాన ఆప్షన్లు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూపానీ స్థానంలో కొత్త వారసుడిని (కొత్త మంత్రివర్గం) తీసుకురావడం, రాష్ట్రపతి పాలన విధించడం, నిర్ణీత గడువుకు ముందే ఎన్నికలకు వెళ్లడం ఆ ఆప్షన్లని అంటున్నారు. అయితే, ఈ దశలో బీజేపీ ముందస్తు ఎన్నికల యోచన చేసే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు.


రేసులో ఇద్దరు..?

కాగా, రూపానీ  స్థానంలో ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరికి అప్పగించనున్నారనే విషయంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత జూలైలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మన్సుఖ్ మాండవీయ వీరిలో ఒకరు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో పుట్టిన మాండవీయ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు, సీఎం రేసులో రూపానీ డిప్యూటీగా (ఉప ముఖ్యమంత్రి) ఉన్న నితిన్ పటేల్ పేరు కూడా వినిపిస్తోంది.

Updated Date - 2021-09-11T23:04:17+05:30 IST