కారుచౌకగా ఖరీదైన స్థలం..

ABN , First Publish Date - 2020-11-24T05:04:49+05:30 IST

గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన బీఆర్‌ స్టేడియం ఎదురు రెడ్‌ట్యాంక్‌ నిర్మాణంలో ఉంది.

కారుచౌకగా ఖరీదైన స్థలం..
గుంటూరు కార్పొరేషన్

రెడ్‌ ట్యాంక్‌లో 70 గజాల స్థలం ఎమ్మెల్యే ముస్తాఫాకు లీజు

మూడేళ్ల కాలపరిమితి మేరకు లీజు మంజూరు

సంవత్సరానికి రూ.1.26 లక్షల అద్దె 

లీజుతో చుట్టుపక్కలవారిని ఖాళీ చేయించే యోచన

తీవ్రంగా ఖండిస్తున్న వ్యాపారులు


గుంటూరు (కార్పొరేషన్‌), నవంబరు 23: గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన బీఆర్‌ స్టేడియం ఎదురు రెడ్‌ట్యాంక్‌ నిర్మాణంలో ఉంది. అక్కడ షాపులు నిర్మించి అద్దె ప్రాతిపదికన లీజుదారులకు ఇచ్చేందుకు అధికారులు పనులు చేపట్టారు. గుంటూరు -1 ఎమ్మెల్యే ముస్తఫా ఆ స్థలంపై దృష్టి సారించారు. కోట్లాది రూపాయలు ఖరీదు చేసే స్థలం కారుచౌకగా కావాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో తలొగ్గారు. మూడేళ్ల కాల పరిమితికి గాను ప్రతి ఏడాది రూ.1.26 లక్షలు చెల్లించే విధంగా 70 గజాల స్థలాన్ని జిల్లా ఉన్నతాధికారులు మంజూరు చేశారు. దీనిపై పాతగుంటూరు, బస్టాండు ప్రాంతాలకు చెందిన అనేకమంది ముస్లిం మైనార్టీలకు చెందిన చేతివృత్తుల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా ఇదేవిధంగా షాపులు కేటాయించాలని వారు కోరుతున్నారు. గతంలో తామంతా కమిటీగా ఏర్పడి రెడ్‌ట్యాంక్‌ అభివృద్ధి అనంతరం షాపులుగా కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారపార్టీని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ముస్తఫా తన అనుచరుల ద్వారా పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం ఎలా కేటాయిస్తారని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

సంవత్సరానికి రూ.1.26 లక్షల అద్దె చెల్లింపు 


రెడ్‌ట్యాంక్‌లో మెయిన్‌రోడ్డు ప్లేసులో ఉన్న స్థలానికి ఏడాదికి అద్దె రూ.1.26 లక్షలు చొప్పున నిర్ణయించడంపై అక్కడి వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. జీఎంసీ నిబంధనల ప్రకారం ప్రధాన స్థలాలను లీజుకు ఇచ్చేటప్పుడు ఆక్షన్‌ నిర్వహించాలి. ఎటువంటి ఆక్షన్‌ లేకుండా అడిగిందే తడవుగా ఎమ్మెల్యే కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. బహిరంగంగా ఆక్షన్‌ పెడితే అక్కడ నెలకు రూ.50వేలకు పైమాటే అద్దె వస్తుందని, కేవలం నెలకు రూ.10వేలను కారుచౌకగా అద్దెకు ఇవ్వడమనేది జీఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.  70 గజాలను లీజుకు తీసుకొని దీన్ని అడ్డుగా పెట్టుకుని చుట్టుపక్కల సుమారు 400 గజాల మేరకు స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.  


అధికారపార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆక్రమణలు: షేక్‌ మీరావలి

రెడ్‌ ట్యాంక్‌ స్థలాన్ని లీజు ముసుగులో ఎమ్మెల్యే ముస్తఫా ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానిక వ్యాపారి షేక్‌ మీరావలి ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడమే కాక చుట్టుపక్కల ఉన్న చేతివృత్తుల వారిని భయబ్రాంతులకు గురిచేసి ఖాళీ చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-11-24T05:04:49+05:30 IST