Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్సీలుగా గుత్తా, కోటిరెడ్డి

 నల్లగొండ జిల్లాకు రెండు పదవులు

ఒకే సామాజిక వర్గం నుంచి అవకాశం 

నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మె ల్సీ పదవుల కేటాయింపులో నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యమిచ్చారు. ముందస్తు హామీలో భాగంగా శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తోపాటు సీనియర్‌ నాయకుడు ఎంసీ కోటిరెడ్డికి ఈసారి బెర్త్‌ ఖరా రు చేశారు. గుత్తాకు గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించగా, కోటిరెడ్డికి ఎమ్మెల్యేల కోటాలో స్థానం కల్పించారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడగా ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. మంగళవారం నోటిఫికేషన్‌ కూడా జారీ కానుంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి పూర్తికాలం (ఆరేళ్లు) పూర్తి చేయకపోవడం, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టికెట్‌ ఖరా రు చేయలేకపోవడంతో ఎంసీ కోటిరెడ్డికి అవకాశం ఇస్తానని సీఎం స్వయం గా ప్రకటించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు అవకాశం దక్కింది. టీఆర్‌ఎ్‌సలో చేరిన తర్వాత గుత్తా కేబినెట్‌ హోదాతో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎంపీ పదవి కాలం పూర్తయ్యాక కొంత ఎదురుచూపు తర్వాతే ఎమ్మెల్యే కోటాలో శాసన మండలి సభ్యత్వం, ఆ తర్వాత చైర్మన్‌ పదవి దక్కాయి. నిండా ఆరేళ్లు కాకుండానే రెండేళ్లకే పదవీకాలం పూర్తి కావడంతో ఆయనకు మరోమారు అవకాశం కల్పించారు. ఆయనకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎంఓ కార్యాలయం నుంచి స్పష్టంగా సంకేతాలు మొదటి నుంచి ఉన్నాయి. ఆయనకు ప్రొటోకాల్‌ను కొనసాగిస్తూ వచ్చారు. 

ఎంసీ కోటిరెడ్డికి ఈసారి అవకాశం 

నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది, సీనియర్‌ నాయకుడు ఎంసీ కోటిరెడ్డికి సైతం ఈసారి అవకాశం దక్కింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు టికెట్‌ ఆశించిన ఆయన అధిష్ఠానం సూచన మేరకు పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల విజయం కోసం కృషిచేశారు. మొన్నటి సాగర్‌ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ఎంసీ కోటిరెడ్డికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే భగత్‌తోపాటు ఎమ్మెల్సీగా కోటిరెడ్డి ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం హాలియా బహిరంగసభలో ప్రకటించారు. మంత్రి జగదీ్‌షరెడ్డికి సన్నిహితుడిగా పేరున్న కోటిరెడ్డికి అవకాశం దక్కింది. పదవుల కేటాయింపు క్రమంలో సామాజికవర్గం, జిల్లా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఇద్దరికి, అదీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం దక్కడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా పెద్దమొత్తంలో ఎమ్మెల్సీ పదవులకు ఆశావహులు ఉండగా, ఆరు స్థానాలకు రెండు స్థానాలు జిల్లాకే కేటాయించడం గమనార్హం.  

ఎంసీ కోటిరెడ్డి


Advertisement
Advertisement