విచ్చలవిడిగా గ్రావెల్‌ మాఫియా

ABN , First Publish Date - 2021-01-18T04:51:30+05:30 IST

సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు.

విచ్చలవిడిగా గ్రావెల్‌ మాఫియా

మాజీ మంత్రి సోమిరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), జనవరి 17 : సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని ఆయన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వెంకటాచలం మండలం ఈదగాలి శ్రీకాంత్‌కాలనీలో పదుల సంఖ్యలో టిప్పర్లు, ఎక్స్‌కవేటర్లతో గ్రావెల్‌ దోపిడీని గ్రామస్థులు వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ అక్రమ మైనింగ్‌లో ఎమ్మెల్యే కాకాణికి వాటా ఉండడంతో మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా, తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రత్యేక కృషితో వెంకటాచలం మండలాన్ని రూర్బన్‌ పథకానికి ఎంపిక చేశామని, ఆ మండలానికి  వెంకయ్యనాయుడు అనేక కేంద్ర సంస్థలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎవరు గ్రావెల్‌ తవ్వినా పార్టీలకు అతీతంగా కేసులు పెట్టించామన్నారు. అయితే వైసీపీ అధికారంలో కొచ్చాక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అండతో గ్రావెల్‌ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోందని ఆరోపించారు. కసుమూరు కొండ నుంచి సర్వేపల్లి వరకు, చెముడుగుంట నుంచి ఈదగాలి వరకు గ్రావెల్‌ తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడ్డాయన్నారు. పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్పను తవ్వేశారని, ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో మట్టి వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఈ ఆగడాలను అరికట్టలేకపోతే ప్రజలకు, వారి సొత్తుకు ఎవరు రక్షణ కల్పిస్తారన్నారు. వెంకటాచలం మండలంలో అక్రమ మైనింగ్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దోపిడీ సొత్తును రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ వైపు అస్తవ్యస్థ నిర్ణయాలతో జగన్‌ పాలనపై వ్యతిరేకత వస్తోందని, మరోవైపు ఎమ్మెల్యేల దారుణాలను అడ్డుకోలేక సర్కారు మరింత అప్రదిష్టపాలవడానికి కలెక్టర్‌, ఎస్పీలు కారణమవుతున్నారన్నారు. 

Updated Date - 2021-01-18T04:51:30+05:30 IST