నేటి నుంచి జిమ్‌లు, స్టేడియంలు

ABN , First Publish Date - 2020-09-21T07:37:33+05:30 IST

సేడియంలు, జిమ్‌లు ఎట్టకేలకు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా, లాక్‌డౌన్‌తో మూతపడటంతో

నేటి నుంచి జిమ్‌లు, స్టేడియంలు

ప్రారంభించేందుకు ఏర్పాట్లు

కొవిడ్‌ నిబంధనలు అనుసరించి.. 


చందానగర్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): సేడియంలు, జిమ్‌లు ఎట్టకేలకు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.  కరోనా, లాక్‌డౌన్‌తో మూతపడటంతో ఆరు నెలలుగా క్రీడాకారులు క్రీడలకు దూరమయ్యారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్న ప్రభుత్వం సెప్టెంబర్‌ 21 నుంచి స్టేడియంలు, పార్కులు, జిమ్‌లు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జిమ్‌లు, ఓపెన్‌ జిమ్‌లు, పీజేఆర్‌ స్టేడియంను పునఃప్రారంభిస్తున్నామని వెస్ట్‌జోన్‌  గేమ్స్‌ ఇన్స్‌పెక్టర్‌ వీరానంద్‌ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి క్రీడాకారులను అనుమతిస్తామని చెప్పారు. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రీడాకారులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో పీజేఆర్‌, ఖాజాగూడ స్టేడియాలు ఉండగా, ఖాజాగూడలో స్టేడియం ఇంకా అందుబాటులోకి రాలేదు. పీజేఆర్‌ స్టేడియంలో రోజూ పదహారు ఆటలకు సంబంధించి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు వచ్చేవారు. అయితే, కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ మంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్‌కు ఒక్కో జిమ్‌ ఉండేది. అయితే, ప్రస్తుతం జిమ్‌లన్నీ తెరుచుకోనున్నాయి. అలాగే, నియోజకవర్గంలోని 150 ప్రైవేట్‌ జిమ్‌లు కూడా తెరవనున్నారు.

 

శుభ్రం చేస్తున్న సిబ్బంది..

ఆరు నెలలుగా నియోజకవర్గంలోని జిమ్‌లు, స్టేడియంలు మూతపడి ఉండటంతో దుమ్ము పేరుకుపోయాయి. నిబంధనల సడలింపులో భా గంగా జిమ్‌లు, స్టేడియాలకు అనుమతులు ఇవ్వనున్నారన్న సమాచారం నేపథ్యంలో 15 రోజులుగా జిమ్‌లు, స్టేడియంలోని మైదానాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. మైదానాలను చదును చేసే పనిలో నిమగ్నమయ్యారు. పీజేఆర్‌ స్టేడియంలోని క్రికెట్‌ మైదానాన్ని చదును చేస్తుండగా, చందానగర్‌ ఉప కమిషనర్‌ సుదాంష్‌ పరిశీలించారు. 

Updated Date - 2020-09-21T07:37:33+05:30 IST