హామీ ఒకరికి... పదవి మరొకరికి

ABN , First Publish Date - 2021-07-31T04:41:32+05:30 IST

మార్కాపురం పురపాలక సంఘ వైస్‌ చైర్మన్‌ - 2 ఎంపికపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఆ పదవిని ఏ సామాజికవర్గానికి కేటాయించాలనేది పార్టీ అధిష్ఠానం నుంచి సీల్డ్‌ కవర్లో వస్తుందని, ఆ మేరకే కేటాయిస్తామని స్థానిక నాయకత్వం చెబుతూవచ్చింది. కానీ రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో డిప్యూటీ మేయర్లు ఇద్దరు, వైస్‌ చైర్మన్లు ఇద్దరు ఉంటారని వైసీపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి మర్కాపురం వైస్‌ చైర్మన్‌ 2 పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించనున్నట్లు స్థానిక నాయకత్వం ప్రకటించింది.

హామీ ఒకరికి... పదవి మరొకరికి
ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఏడీసీ సరళావందనం

  • వైస్‌ చైర్మన్‌ 2 ఎంపికపై సర్వత్రా చర్చ
  • సామాజిక సమతుల్యం లేని మున్సిపల్‌ పాలకవర్గం
  • సీల్డ్‌ కవర్‌ రాజకీయంపై వైసీపీ నేతల విమర్శలు

మార్కాపురం, జూలై 30: మార్కాపురం పురపాలక సంఘ వైస్‌ చైర్మన్‌ - 2 ఎంపికపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఆ పదవిని ఏ సామాజికవర్గానికి కేటాయించాలనేది పార్టీ అధిష్ఠానం నుంచి సీల్డ్‌ కవర్లో వస్తుందని, ఆ మేరకే కేటాయిస్తామని స్థానిక నాయకత్వం చెబుతూవచ్చింది. కానీ రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో డిప్యూటీ మేయర్లు ఇద్దరు, వైస్‌ చైర్మన్లు ఇద్దరు ఉంటారని వైసీపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి మర్కాపురం వైస్‌ చైర్మన్‌ 2 పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించనున్నట్లు స్థానిక నాయకత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సన్నద్ధమయ్యారు. కానీ రెండు మూడు రోజుల నుంచి సీల్డ్‌ కవర్‌ రాజకీయం ప్రచారంలోకి వచ్చింది.


సీల్డ్‌ కవర్‌లో రిజర్వేషన్‌ నిర్ణయం

వైస్‌ చైర్మన్‌ - 2 ఏ సామాజికవర్గానికి కేటాయించాలనేది పార్టీ అధిష్ఠానం నుంచి సీల్డ్‌ కవర్‌లో వస్తుందని రెండు, మూడు రోజులుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పటివరకూ స్థానిక నాయకత్వం హామీ ఇచ్చిన ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైస్‌ చైర్మన్‌ 2 ఎంపిక ప్రక్రియను శుక్రవారం నిర్వహిస్తుండగా మార్కాపురంలో శనివారం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ స్థానిక నాయకత్వం హామీ ఇచ్చిన దానికి, తర్వాత జరిగిన పరిణామాలలో జరిగిన ఒప్పందాల మేరకు శుక్రవారమే వైస్‌ చైర్మన్‌ - 2 ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గురువారం అర్ధరాత్రి వైస్‌ చైర్మన్‌- 2 పదవిని మైనార్టీలు మినహా బీసీ సామాజిక వర్గానికి కేటాయించినట్లు సామాజిక మాద్యమాలలో ప్రచారం నిర్వహించారు. 


సామాజిక సమతుల్యం లేని మున్సిపల్‌ పాలకవర్గం

ప్రస్తుత మున్సిపల్‌ పాలకవర్గంలో సామాజిక సమతుల్యం లేదనేది వైస్‌ చైర్మన్‌ - 2 ఎంపికతో తేటతెల్లమౌతోంది. ప్రస్తుతం చైర్మన్‌ పదవిలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ ఉన్నారు. వైస్‌ చైర్మన్‌ - 1 పదవిలో ముస్లిం(బి.సి) సామాజికవర్గానికి చెందిన షేక్‌ ఇస్మాయిల్‌ ఉన్నారు. సామాజిక సమతుల్యంలో భాగంగా వైస్‌ చైర్మన్‌ - 2 ఎస్సీ సామాజికవర్గానికి కేటాయించాల్సి ఉంది. కానీ  బీసీ వర్గానికి కేటాయించాలని సీల్డ్‌ కవర్‌లో వచ్చిందని స్థానిక నాయకత్వం చెప్పడం పట్ల సర్వత్రా, ముఖ్యంగా వైసీపీ వర్గాలలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


 రెండో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా అంజమ్మ

మార్కాపురం(వన్‌టౌన్‌) : మార్కాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ రెండో వైస్‌ చైర్మన్‌గా 13వ వార్డు కౌన్సిలర్‌ చాతరాజుపల్లి అంజమ్మ ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అంజమ్మ పేరును 16వ వార్డు కౌన్సిలర్‌ దారివేముల హర్షిత ప్రతిపాదించగా నాల్గో వార్డు కౌన్సిలర్‌ డాక్టర్‌ కనకదుర్గ బలపర్చారు. ఎన్నికల అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సరళావందనం కౌన్సిల్‌ సభ్యుల ఆమోదంతో అంజమ్మను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అనంతరం అంజమ్మతో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నయీం అహ్మద్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T04:41:32+05:30 IST