చేతులెత్తేసిన కొవిడ్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2022-01-23T06:32:08+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేంద్రాల తీరు దారుణంగా ఉంది. తొలి రెండు వేవ్‌లలోనూ వేల సంఖ్యలో బాధితులకు ఆశ్రయం కల్పించి, భయం పోగోట్టి భరోసా ఇచ్చిన ఈ కేంద్రాలు మూడోవేవ్‌లో చేతులెత్తేశాయి.

చేతులెత్తేసిన కొవిడ్‌ కేంద్రాలు
ఈ నెల 20 విష్ణు నివాసం కొవిడ్‌ కేంద్రం ముందు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని ఆందోళనకు దిగిన కొవిడ్‌ బాధితులు

గతంలో పోషకాహారం, నాణ్యమైన సేవలు

ప్రస్తుతం నాసిరకం తిండి, పారిశుధ్యం ఘోరం

గతంలో భోజనం పెట్టిన కాంట్రాక్టర్లకు రూ.కోట్ల బకాయిలు

పారిశుధ్య సేవలందించినవారికీ జీతాలు ఎగ్గొట్టిన వైనం



జిల్లాలో కొవిడ్‌ కేంద్రాల తీరు దారుణంగా ఉంది. తొలి రెండు వేవ్‌లలోనూ వేల సంఖ్యలో బాధితులకు ఆశ్రయం కల్పించి, భయం పోగోట్టి భరోసా ఇచ్చిన ఈ కేంద్రాలు మూడోవేవ్‌లో చేతులెత్తేశాయి. నాసిరకం తిండి తినలేక, పారిశుధ్యం కరువైన వాతావరణంలో ఉండలేక అనేక చోట్ల బాధితులు కేంద్రాల ముందే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఈ తిండి తిని బతికేదానికేనా అని నిలదీస్తున్నారు. గతంలో కొవిడ్‌ కేంద్రాల్లో నాణ్యమైన సేవలందేలా బాధ్యత తీసుకున్న ప్రజా ప్రతినిధులు ఈసారి ఆ ఛాయలకు కూడా పోవడం లేదు. అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.గత ఏడాది పెట్టిన తిండికే ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో మంచి భోజనం పెట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గతంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన పారిశుధ్య సిబ్బందిని ఆ తర్వాత తొలగించారు. వారికి కూడా జీతాలు ఇవ్వలేదు. దీంతో కొత్తవారు ముందుకు రావడం లేదు. మొత్తం మీద జిల్లాలో కొవిడ్‌ కేంద్రాల నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరుకు అద్దం పడుతోంది. 


తిరుపతి సిటీ: గత ఏడాది జిల్లాలో 39 కొవిడ్‌ కేంద్రాలు బాధితులకు కొండంత అండగా నిలిచాయి. వేలాది మంది వీటిల్లో ఆశ్రయం పొందారు. కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే లక్షణాలను బట్టి ఈ కేంద్రాలకు బాధితులను తరలించేవారు. ఉచితంగా మందుల కిట్‌ ఇచ్చేవారు. ఎలా వాడాలో వివరించేవారు. కొన్ని కేంద్రాల్లో కొత్త దుప్పట్లు, టవళ్లు కూడా ప్రతి ఒక్కరికీ ఉచితంగానే ఇచ్చేవారు. పూట పూటా రుచికరమైన పోషకాహారం ఇచ్చేవారు. పండ్లు, కషాయం, నువ్వుండలు, వేరుశనగ ఉండలు వంటివి కూడా బాధితులకు ఇచ్చేవారు. రోజూ వైద్యులు పరీక్షించేవారు.ఆందోళనతో ఉన్నవారికి కౌన్సెలింగ్‌ చేసేవారు. అత్యవసరాల కోసం కొన్ని కేంద్రాల్లో ఆక్సిజన్‌ పడకలు కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన వారిని కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించేవారు.  అయితే ఇదంతా గతం మాత్రమే. వర్తమాన చిత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. కొవిడ్‌ కేసులు రెండు వేలు దాటినా కొవిడ్‌ కేంద్రాల మీద దృష్టి పెట్టనే లేదు. ఈ ఏడాది ఇప్పటికి తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తిల్లో మాత్రమే కేవలం అయిదు కేంద్రాలను ప్రారంభించారు.  వీటిల్లో 2000 దాకా పడకలు సిద్ధం చేసినా 672 మంది మాత్రమే బాధితులు ఉన్నారు. ఇందుకు కారణం వీటి నిర్వహణ వైఫల్యమే. వీటిల్లో చేరడానికి బాధితులు ముందుకు రావడం లేదు. సిబ్బంది కూడా పాజిటివ్‌ అయినవారిని కొవిడ్‌ కేంద్రాలకు తరలించకుండా, ఇంట్లో జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చి పంపేస్తున్నారు. కేంద్రాల్లో చేరినవారు ఇక్కడి భోజనానికి భయపడిపోతున్నారు. తిరుపతి విష్ణునివాసంలో బాధితులు బయట బైఠాయించి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గతంలో నష్టపోయిన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. భోజనం సరఫరా చేసినవారికి, పారిశుధ్య సేవలు అందించిన వారికి జిల్లాలో ఇప్పటికీ దాదాపు 50 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఈ మొత్తాన్ని రాబట్టలేక, కాంట్రాక్టర్లకు సమాధానాలు చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు. గతంలో చొరవ చేసిన ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితి చూసి దూరంగా ఉండిపోయారు.అవస్థలు మాత్రం ప్రజలకు మిగిలిపోయాయి. 


ఈ తిండి మనుషులు తింటారా అంటూ ఈ నెల 20న తిరుపతిలోని విష్ణు నివాసం కొవిడ్‌ కేంద్రం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఈ కొవిడ్‌ కేంద్రంలో గత ఏడాదిగా భోజన నిర్వాహకులకు బిల్లులు అందించలేదని, ఇప్పటికే సుమారు రూ. 2 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఉన్నంతలో  ఏదోవిధంగా  భోజనాలు అందించాల్సిన పరిస్థితి నెలకొందని నిర్వాహకులు వాపోతున్నారు.

పలమనేరులో గత ఏడాది మహిళా పాలిటెక్నిక్‌ కొవిడ్‌ కేంద్రం బాధ్యతలను ఒక రెవెన్యూ అధికారికి అప్పగించారు. ఆయన రూ. 27 లక్షల వరకు ఖర్చు పెట్టి బాధితులకు నాణ్యమైన భోజనాలు అందించారు. కానీ నేటికీ ఆయనకు ఒక్క రూపాయి కూడా బిల్లులు మంజూరు కాలేదు. చేసిన అప్పులకు వడ్డీల కోసం  మరో రూ. 10 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇక వాల్మీకిపురంలోని కొవిడ్‌ కేంద్రం బకాయిలు రూ. 16 లక్షలు, శాంతిపురంలో 21 లక్షలు, పీలేరులో 8 లక్షలు, తంబళ్లపల్లెలోని కేంద్రంలో రూ.8లక్షల దాకా బకాయిలున్నాయి. మదనపల్లెలోని కొవిడ్‌ కేంద్రాలకు దాదాపు రూ.పాతిక లక్షలు భోజనాల బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.  

గతంలో పనిచేసిన పారిశుధ్య కార్మికులకు 3-6 నెలల వరకు వేతనాలు చెల్లించనే లేదు. వీరు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేంద్రాల్లో కొత్త వారిని విధుల్లోకి తీసుకోవడం ప్రారంభించారు. తమకు జీతాలు ఇవ్వకుండా ఇదేమి తీరు అని కడుపుమండిన పాత కార్మికులు శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం కొవిడ్‌ కేంద్రం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 

Updated Date - 2022-01-23T06:32:08+05:30 IST