మాకు ప్రాధాన్యత ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-05-18T05:50:38+05:30 IST

ఓ వైసీపీ నాయకుడి హల్‌చల్‌తో మద్దూరు ఎన్టీఆర్‌ ఘాట్‌లో అప్పుడే ప్రారంభమైన ఇసుక లోడింగ్‌ నిలిచిపోయింది.

మాకు ప్రాధాన్యత ఇవ్వరా?

  మా లారీలకు రోజుకు 3 ట్రిప్పులు ఇవ్వాల్సిందే

   వైసీపీ నాయకుడి హల్‌చల్‌ 

  ససేమీరా అన్న క్వారీ నిర్వాహకులు 

  అడ్డుకున్న వైసీపీ వర్గీయులు 

 కంకిపాడు, మే 17 : ఓ వైసీపీ నాయకుడి హల్‌చల్‌తో మద్దూరు ఎన్టీఆర్‌ ఘాట్‌లో అప్పుడే ప్రారంభమైన ఇసుక లోడింగ్‌ నిలిచిపోయింది. అధికార పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వరా అంటూ వైసీపీ నాయకుడు హల్‌చల్‌ చేయడంతో రెవెన్యూ, పోలీసులు జోక్యం చేసుకొని అతడిని అక్కడ నుంచి పంపించి లోడింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. 

  మద్దూరు ఎన్టీఆర్‌ పుష్కర్‌ ఘాట్‌లో సోమవారం ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం ఇసుక క్వారీని లీజుకు ఇచ్చింది. ఇసుక లోడింగ్‌ ప్రారంభమైన కాసేపటికే తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు హరిబాబు మద్దూరు క్వారీ వద్దకు చేరుకున్నాడు. అప్పుడే ప్రారంభమైన క్వారీలో తనకు ఉన్న 12 లారీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 12 లారీలకు రోజుకు 3 ట్రిప్పులకు అనుమతి ఇవ్వాలంటూ నిర్వాహుకులతో వాగ్వాదానికి దిగాడు. నిర్వాహకులు ప్రాధాన్యతా క్రమంలో లారీలను లోడింగ్‌ చేస్తామన్నారు. దీంతో హరిబాబు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు.  క్వారీకి వెళ్లే రహదారిపై ఆయన అనుచరులు లారీలను అడ్డుగా పెట్టారు. నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి లోడింగ్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై దుర్గారావు, గ్రామ రెవెన్యూ అధికారి మద్దూరు రఘురామ ప్రసాద్‌ మద్దూరు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. హరిబాబుతో మాట్లాడారు. హరిబాబుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. క్వారీ నిర్వాహకులకు అడ్డంకి కలిగిస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో క్వారీలో మళ్లీ లోడింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. హరిబాబుపై తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌లో కేసులు ఉన్నాయా... వాటి వివరాలను తక్షణం సేకరించాలని సిబ్బందిని ఎస్సై దుర్గారావు ఆదేశించారు. 


Updated Date - 2021-05-18T05:50:38+05:30 IST