Advertisement
Advertisement
Abn logo
Advertisement

హరిత యాదాద్రి

శరవేగంగా గండిచెరువు పనులు

చుట్టూ గ్రీనరీ, పచ్చదనం పరుచుకున్న రింగ్‌ సర్కిళ్లు


యాదాద్రి టౌన్‌, నవంబరు 28: యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా కొండకింద లక్ష్మీతటాకం(గండిచెరువు) పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.33కోట్ల అంచనాతో గండిచెరువు సుందరీకరణ పనులు వైటీడీఏ, ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. గండిచెరువు పూడికతీతతోపాటు చెరువు సంరక్షణ కోసం చుట్టూ రక్షణగోడ పనులను అధికారులు వేగిరంచేశారు. సుమారు 25ఎకరాల విస్తీర్ణంలోని గండిచెరువుకు లక్ష్మీతటాకంగా నామకరణంచేసిన అధికారులు అభివృద్ధి పనులు చేస్తున్నారు. చెరువు చుట్టూ పాత్‌వే, వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌తోపాటు గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చెరువు పరిసర ప్రాంతాల్లో పూల మొక్కలు, దేవతావృక్షాలు, ఔషధ మొక్కలు పెంచనున్నారు. యాదాద్రిని సందర్శించే భక్తులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పంచేలా గండి చెరువుప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. గండిచెరువు చుట్టూ ఐరన్‌ గ్రిల్స్‌ అమర్చుతున్నారు. చెరువు లోతట్టు ప్రాంతంకావడంతో వర్షం వచ్చినప్పుడు వరదతో చెరువు కట్ట దెబ్బతినకుండా ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. వర్షపునీటిని తరలించేందుకు ప్రత్యేకంగా పైప్‌లైన్‌ ఏర్పాటుచేస్తున్నారు. హైదరాబాద్‌లోని నెక్లె్‌సరోడ్‌ తరహాలో గండిచెరువు ప్రాంతాన్ని సుందరీకరించనున్నట్లు, మినీ ట్యాంక్‌బండ్‌ తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెరువు పూడికతీత, అనుసంధాన రహదారులు, గ్రీనరీ, ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితర పనులను పూర్తిచేసిన అనంతరం ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆర్నమెంటేషన్‌, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు.


రింగ్‌ సర్కిల్‌

యాదాద్రికొండ చుట్టూ నిర్మిస్తున్న రింగురోడ్డులో రానున్న సర్కిళ్లలో గ్రీనరీ పనులను వైటీడీఏ అధికారులు వేగవంతంచేశారు. యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా రింగురోడ్డు, సర్కిళ్లను హరితమయంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రికి వచ్చే భక్తులు తొలుత వైకుంఠద్వారాన్ని దర్శించుకుని యాత్రను ఆరంభిస్తారు. ఈ క్రమంలో అధికారులు వైకుంఠద్వారం ఎదుట ఉన్న సర్కిల్‌ను ఆధ్యాత్మికతకు ఆలవాలంగా, ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. సర్కిల్‌లో కమలం పువ్వు ఆకారంలో డిజైన్లు రూపొందించి గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. అందమైన పూల మొక్కలు, ఫాక్స్‌టెయిల్‌ తదితర చెట్లను నాటారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకునే మార్గంలోని సర్కిల్‌ను అరుదైన ఫినిక్స్‌ చెట్లు, పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా కొండపైన, ఘాట్‌రోడ్‌, రింగు సర్కిళ్లలో ల్యాండ్‌ స్కేపింగ్‌ గార్డెన్లు, గ్రీనరీ ఏర్పాటుచేశారు. గండి చెరువునుంచి నీటిని ట్యాంకులలో నింపి డ్రిప్‌ పద్ధతిన గ్రీనరీని సంరక్షిస్తున్నారు.

Advertisement
Advertisement