ఢిల్లీ మూలాలపై దృష్టి

ABN , First Publish Date - 2020-04-02T09:12:53+05:30 IST

ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరైన జిల్లావాసులను తక్షణమే గుర్తించి వెంటనే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

ఢిల్లీ మూలాలపై దృష్టి

అక్కడికి వెళ్లి వచ్చిన వారిని వేగంగా గుర్తించాలి

పాజిటివ్‌  ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ ప్లాన్‌ అమలు చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఇందుపల్లి అధికారులకు ఆదేశాలు


గుంటూరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరైన జిల్లావాసులను తక్షణమే గుర్తించి వెంటనే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కరోనాపై తీసుకుంటోన్న ముందస్తు జాగ్రత్త చర్యలపై  బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లిన వారిని, వారితో ప్రాథమికంగా సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సహకారం అందించాలన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయడంతో పాటు కంటైన్‌మెంట్‌ ప్లాన్‌ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.


జిల్లాలో ఐసోలేషన్‌ క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చేందుకు ప్రైవేటు విద్యా సంస్థలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఫంక్షన్‌ హాల్స్‌, హోటళ్లు, సంక్షేమ శాఖ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలను గుర్తించి అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని అన్ని ల్యాబ్‌లు, డయోగ్నస్టిక్‌ సెంటర్లను తక్షణం తెరవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎస్పీలు రామకృష్ణ, విజయారావు, జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, తెనాలి సబ్‌ సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, జేసీ-2 శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో ఎన్‌వీవీ సత్యన్నారాయణ, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ పాల్గొన్నారు. 


సహాయక శిబిరాలకు ఇన్‌చార్జిల నియామకం

రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో సహాయక శిబిరాలకు ఇన్‌చార్జ్‌ అధికారులను నియమిస్తూ బుధవారం కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరుకు బీసీ సంక్షేమ శాఖ డీడీ, సహాయక అధికారిగా ఏబీసీడబ్ల్యూవో, గురజాలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ, ఏఎస్‌డబ్ల్యూవో, నరసరావుపేటకు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఏబీసీడబ్ల్యూవో, తెనాలికి డీఎండబ్ల్యూవో, ఏఎస్‌డబ్ల్యూవోలను నియమించారు.


వ్యవసాయ కూలీలను గుర్తించి వారిని సహాయక శిబిరాలకు తరలించే బాధ్యతని వ్యవసాయ శాఖ జేడీకి, వలస కూలీలను గుర్తించి తరలించే బాధ్యతను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌కి కేటాయించారు. ఇళ్లు లేని వారిని గుర్తించి సహాయక శిబిరాలకు తరలించేందు బాధ్యతను మునిసిపల్‌ కమిషనర్‌లు, ఎంపీడీవో, సీడీపీవోలకు ఇచ్చారు. మండల స్థాయిలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్‌డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు.  

Updated Date - 2020-04-02T09:12:53+05:30 IST