పేరుకే జిల్లా ఆస్పత్రి..

ABN , First Publish Date - 2020-12-03T06:15:08+05:30 IST

హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రి పేరుకే అన్నట్లుగా మారిపోయింది. వైద్యసేవల్లో మాత్రం అధ్వానంగా తయారైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోగా పని వేళల్లో అందుబాటులో ఉండట్లేదు. దీంతో వైద్యసేవల కోసం వచ్చిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.

పేరుకే జిల్లా ఆస్పత్రి..
హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి

సేవలన్నీ ప్రైవేట్‌ క్లినిక్‌లలోనే..

విధులకు డుమ్మా కొడుతున్న వైద్యులు

1000 ఉండే ఓపీ.. నేడు 250లోపే..

హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో పట్టుతప్పిన పాలన

కరువైన పర్యవేక్షణ

హిందూపురం, డిసెంబరు2: హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రి పేరుకే అన్నట్లుగా మారిపోయింది. వైద్యసేవల్లో మాత్రం అధ్వానంగా తయారైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోగా పని వేళల్లో అందుబాటులో ఉండట్లేదు. దీంతో వైద్యసేవల కోసం వచ్చిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. రోజూ వెయ్యికిపైగా రోగులతో కిటకిటలాడే ఆస్పత్రి ఓపీ.. ప్రస్తుతం వెలవెలబోతుండటమే ఇందుకు నిదర్శనం. రాత్రి వేళ్లలో అత్యవసర వైద్యసేవలు అందని ద్రాక్షలా మారాయి. విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఫోన్‌ చేస్తేగానీ ఆస్పత్రికి రారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ పడకేయటంతో చాలామంది వైద్యులు సొంత క్లినిక్‌లలో సేవలు అన్న విధంగా మారిందన్న విమర్శలు లేకపోలేదు. ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, వాచ్‌మెన్‌ ఉంటున్నారు. ఎవరైనా వైద్యకోసం వస్తే ఫలానా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారు. అన్ని విభాగాల్లో 26 మంది దాకా వైద్యులున్నా.. రోగులకు అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో చేసేదిలేక రోగులు ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.


దారుణంగా పడిపోయిన ఓపీ

కొవిడ్‌కు ముందు ఆస్పత్రిలో మతాశిశు కేంద్రంతో కలుపుకుని రోజూ సగటున వెయ్యి మంది దాకా ఓపీకి వచ్చేశారు. సోమవారం రోజుల్లో 1500 మంది కూడా వచ్చిన సందర్భాలున్నాయి. ప్రసు త్తం మతాశిశు కేంద్రంలో ఓపీ 40కి మించకపోగా జనరల్‌ ఓపీ 200లోపే ఉంటోంది. టీడీపీ హయంలో ఆస్పత్రిని కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేయటంతోపాటు అనునిత్యం పర్యవేక్షణ ఉండేది. నాణ్యమైన వైద్యసేవలు అందుతుండటంతో పెనుకొండ, మడకశిర, చిలమత్తూరు, లేపాక్షి, గోరంట్ల, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి భారీగా వచ్చేవారు. దీంతో క్యూలైన్లు కిటకిటలాడుతుండేవి. ప్రస్తు తం వైద్యసేవలు అంతంత మాత్రంగా అందుతుండటంతో రోగుల సంఖ్య భారీగా తగ్గింది.


సేవలు ప్రైవేటు క్లినిక్‌లలో..

హిందూపురం జిల్లా ఆస్పత్రిని ఇటీవల కొవిడ్‌ సేవలకు కేటాయించారు. దీంతో కొన్ని నెలలపాటు ప్రై వేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించారు. ఇటీవ లే ఓ భాగాన్ని కొవిడ్‌కు కేటాయించి, మిగతా వాటిలో సాధారణ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు చాలామంది సమయపాలన పాటించకపోగా.. 11 గంటలు దాటినా విభాగాల్లో కనిపించట్లేదు. అలా వచ్చి.. ఇలా వెళ్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. స్టాఫ్‌నర్సులు, వాచ్‌మెన్‌ మాత్రం ఉంటున్నారు. అత్యవసర కేసులు వచ్చినపుడు వారు ఫోన్‌ చేస్తే వైద్యులు వస్తున్నారన్న వాదనలు బాధిత వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులకు సొంత క్లినిక్‌లు, ఆస్పత్రులు ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న కొందరు వైద్యులు.. పైస్థాయి అధికారులను సైతం ఖాతరు చేయట్లేదన్న ఆరోపణలున్నాయి.


ప్రైవేటుకు వెళ్లండి..

ప్రభుత్వాస్పత్రిలో సీటీ స్కాన్‌, ఎక్స్‌రే యంత్రాలు మరమ్మతులకు వచ్చాయి. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి వేల  రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు క్లినిక్‌లు ఏర్పాటు చేసుకున్న కొందరు వైద్యులు.. సమష్టిగా ఓ సీటీ స్కానింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక మాతాశిశు ఆస్పత్రిలో డెలివరీకి వచ్చే వారి ప్రాణాలకు ఇబ్బంది ఉంటుందని ప్రైవేటుకు రెఫర్‌ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్‌ సెంటర్‌ ఉందనీ, అటువైపు వైద్యానికి వెళ్లొద్దనీ, ప్రైవేటు క్లినిక్‌లకు రండి అని కొందరు వైద్యులు అసత్య ప్రచారం చేస్తుండటం శోచనీయం. ఏడాదిక్రితం వరకు నాణ్యమైన వైద్యసేవలు అందించినందుకు జాతీయస్థాయి అవార్డులు సొంతం చేసుకున్న ఆస్పత్రిలో ప్రస్తుతం పాలన పట్టుతప్పింది. వైద్యులు సమయపాలన పాటించరు. పరికరాలు పనిచేయవు.


వైద్యసేవలందేలా పర్యవేక్షిస్తున్నాం : దివాకర్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వాస్పత్రి, హిందూపురం

ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో వైద్యులు సమయపాలన పాటిం చటంతో పాటు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా పర్యవేక్షిస్తున్నాం. మైరుగైన వైద్యసేవలు అందించటంపై దృష్టి పెడతాం. ఏడాది కిందటే సీటీ స్కానింగ్‌ యంత్రం మరమ్మతులకు వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రతిపాదనలు పంపాం.

Updated Date - 2020-12-03T06:15:08+05:30 IST