భర్తను కాపాడుకునేందుకు భార్య విశ్వప్రయత్నం..! మనసు కలచివేసే ఘటన!!

ABN , First Publish Date - 2021-04-27T05:06:50+05:30 IST

మరో కుటుంబంలో విషాదం నింపిన కరోనా

భర్తను కాపాడుకునేందుకు భార్య విశ్వప్రయత్నం..! మనసు కలచివేసే ఘటన!!

ఆగ్రా: కరోనా బారిన పడ్డ ఓ వ్యక్తి ఊపిరి తీసుకోలేక అవస్థ పడుతున్నారు. దీంతో..అతడి భార్య ఆయనను వెంటబెట్టుకుని మూడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లింది. కానీ.. వాటి నిర్వహుకులు రోగిని చేర్చుకోవడం కుదరదంటూ చేతులెత్తేశారు. ఆక్సిజన్ కొరత, బెడ్లు ఖాళీ లేకపోవడం వంటి కారణాలతో తిప్పి పంపించేశారు. వాస్తవానికి వారికి కనీసం అంబులెన్స్ కూడా దొరకలేదు. ఆటోలోనే భర్తను ఆస్పత్రులకు తీసుకెళ్లింది. దురదృష్టవశాత్తూ అన్ని చోట్లా నిరాశే ఎదురైంది. మరోవైపు.. భర్త పరిస్థితి క్షణక్షణానికీ దిగజారుతుంది. ఈ క్రమంలో ఆ ఇల్లాలు చివరి ప్రయత్నంగా తన భర్తను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఆటో ఆస్పత్రి గేటు ముందు ఆగింది. 


ఇంతలో భర్త స్పృహకోల్పోయి ఆమె భుజంపై తల వాల్చేశాడు. ఆయన్ను కాపాడుకునే క్రమంలో ఆమె నోటి ద్వారా శ్వాస అందించేందుకు ప్రయత్నంచింది. భర్తను దక్కించుకునేందుకు ఆమె కరోనాను కూడా లెక్కచేయలేదు. మృత్యువు భర్త దరిచేరకుండా ఉండేందుకు ఆమె విశ్వప్రయత్నమే చేసింది. కానీ విధి వారిని కరుణించలేదు. ఎందరో భాదితుల వలెనె రవి సింఘాల్‌ను కూడా కరోనా నిర్దాక్షిణ్యంగా కబళించింది. మరికాసేపటికి డాక్టర్లు వచ్చి రవి సింఘాల్‌ను పరీక్షించి అప్పటికే మరణించినట్టు ధృవీకరించారు. కళ్ల ముందే భర్త ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రేణు సింఘాల్ కుప్పకూలిపోయింది. కన్నీరుమున్నీరయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీ ముందు శుక్రవారం నాడు కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది. దేశంలో కరోనా ఆడుతున్న మృత్యుకేళికి నిదర్శనం. 


ఈ దంపతుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్లతో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగ్రాలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. బెడ్లు ఖాళీ లేవని, ఆక్సిజన్ కొరత ఉందంటూ ఆస్పత్రి వర్గాలు రోగులను తిప్పి పంపిస్తుండటంతో రోగుల బంధువులు తమ ఆప్తులను కాపాడునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో విషాదం మిగులుతోంది.



Updated Date - 2021-04-27T05:06:50+05:30 IST