Abn logo
May 17 2021 @ 00:33AM

వేడెక్కిన రాజకీయం

వీణవంకలో ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ

జమ్మికుంటలో రెండుగా చీలిన మున్సిపల్‌ పాలకవర్గం 

నియోజకవర్గంపై పట్టుబిగించేందుకు గంగుల ప్రయత్నాలు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ నేపథ్యంలో హుజురాబాద్‌ రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెక్కుచెదరని కోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకులు, శ్రేణుల్లో చీలిక వచ్చింది. ఈటల రాజేందర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నాయకులు చీలిపోవడంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే కాకుండా చొక్కాలు పట్టుకునే స్థాయికి వచ్చారు. 


టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పెద్ద దిక్కుగా గంగుల

ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అనుకూల శ్రేణులకు మంత్రి గంగుల కమలాకర్‌ పెద్ద దిక్కుగా మారారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన ఈటల రాజేందర్‌ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన కోటలో పాగా వేసి తన పట్టు బిగించాలని గంగుల కమలాకర్‌ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంలో తొలుత ఈటల రాజేందర్‌కు ఆ తర్వాత విస్తరణలో గంగుల కమలాకర్‌కు మంత్రి పదవులు దక్కాయి. జిల్లాకు ఇద్దరు మంత్రులున్నా మొదటి నుంచి ఈటలపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంగులను జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. అప్పటి నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ తన నియోజకవర్గానికే పరిమితమై అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో పర్యటించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో జరిగిన ఏ కార్యక్రమానికీ ఆయన రాకుండా ఉన్నారు.


మంత్రి గంగుల జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళి మంత్రిగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా హుజురాబాద్‌కు మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. మంత్రులిద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చి జిల్లా సమావేశాల్లో మాత్రమే కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈటల పలు సందర్బాల్లో తన అసంతృప్తిని వెల్లడిస్తూ మాట్లాడడం, వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరించిన సందర్భంలో అవి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉండడం తదితర కారణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈటలపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని పెంచుకున్నారు. అసైన్డ్‌ భూముల కబ్జా వ్యవహారం ఆయన దృష్టికి రాగానే మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్‌ చేశారు. అప్పటి నుంచి హుజురాబాద్‌ నియోజకవర్గంలో పలు నాటకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. బర్తరఫ్‌ అయిన వెనువెంటనే ఈటల రాజేందర్‌ తన నియోజకవర్గానికి వచ్చి రెండు రోజులపాటు ఇక్కడే మకాం వేసి పార్టీ నాయకులు శ్రేణులు, వివిధ కుల, ప్రజా ఉద్యోగ సంఘాల నేతలను కలిసి అభిప్రాయం సేకరించారు.


ఆయన పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి తన పట్టు నిరూపించుకుంటారని లేక కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ నేతగా పోటీ చేసి సత్తా చాటుకుంటాౄరని అందరూ భావించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తాను రాజీనామా రాజకీయాలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టనని ఈటల ప్రకటించారు. కొత్తపార్టీ పెట్టను, ఇప్పుడున్న ఏ పార్టీలో చేరనని కూడా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లోనే ఉంటూ అటు బీజేపీ నేతలను ఇటు కాంగ్రెస్‌ నేతలను, తెలంగాణ ఉద్యమకాలంనాటి నేతలను కలుస్తూ వస్తూ రాజేందర్‌ రాష్ట్రంలో కొత్త రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఈటల ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. 


నేతలు ఈటల వైపు మళ్లకుండా చర్యలు

ఈ పరిణామాలను అన్నిటిని గమనించిన పార్టీ నాయకత్వం టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థాయి నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ వరకు ఏ ఒక్క నేత కూడా పార్టీని వీడి ఈటల వెంట వెళ్లకుండా చూడాలని భావించి అందుకు ఆయా నేతలకు వర్తమానాలు పంపించారు.  ఈటలతో సన్నిహితంగా ఉన్న మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ సాధవరెడ్డిపై 18 లక్షల నిధుల దుర్వినియోగం కేసును తెరపైకి తెచ్చిన నోటీసును జారీ చేయడం ద్వారా ఈటల వెంట వెళ్లిన వారికి ఎమవుతుందో పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈటలపై అసంతృప్తిగా ఉన్న నేతలను రప్పించుకొని వారిని పార్టీకి అనుకూలంగా పనిచేయాలని పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం జిల్లా మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్‌ పార్టీ అధినేత ఆదేశాల మేరకు హుజురాబాద్‌ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.


వరుసగా నాలుగు రోజులుగా అన్ని మండలాల నేతలతో మాట్లాడుతూ హుజురాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులకు, శ్రేణులకు తాను అండగా ఉంటానని నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి సాధించేందుకు తోడ్పడతానని హామీ ఇస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయని అలాంటి నేతలందరికి తాను అండగా ఉంటానని భరోసా ఇస్తూ నియోజకవర్గంలో ఈటల కోటకు బీటలు  పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఇప్పటికే పలువురిని కూడగట్టారు. త్వరలో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి హుజూరాబాద్‌లో పర్యటిస్తానని కూడా ఆయన ప్రకటించి హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపల్‌ అధికారులకు ఫోన్లు చేసి పెండింగ్‌ పనులను ఆరా తీసి తగు చర్యలకు ఆదేశించారు. 


పెరిగిన విమర్శల దాడి

ఈటలపైన రాజకీయ విమర్శలదాడిని కూడా పెంచి ఆయన వ్యతిరేకుల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ లేకుంటే ఈటల రాజేందర్‌ అనే వ్యక్తే లేడని 20 సంవత్సరాలుగా అనేక పదవులును అౄనుభవించి పార్టీని చీల్చే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. వ్యవస్థే ముఖ్యమని ఈటల రాజేందర్‌ తనకు తానుగా గొప్పగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. పార్టీ అండ లేకుంటే ఆయన ఏమి కాదని కూడా అన్నారు. నాలుగురోజులుగా ఆయన హుజురాబాద్‌ నియోజకవర్గం నేతలు, పార్టీశ్రేణులకే పూర్తి సమయం కేటాయించి పట్టుబిగించే ప్రయత్నం చేస్తున్నారు.


ఈటల వర్గం ఎదురుదాడి

ఈటల రాజేందర్‌ కూడా గంగుల కమలాకర్‌పై ఎదురుదాడి ప్రారంభించారు. తన నియోజకవర్గ ప్రజలపై తోడేళ్లుగా దాడిచేస్తున్నారని, ఉద్యమాలతోటి సంబంధం లేని మంత్రి, సీఎం కేసీఆర్‌ నియమించిన కొందరు ఇన్‌చార్జీలు నియోజకవర్గంలోని సర్పంచులను, ప్రజాౄప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.  ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఫలించవని అంతిమ విజయం ధర్మానిదే అంటూ పరోక్షంగా మంత్రి గంగులపై ఎదురుదాడికి దిగారు. దీనితో హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయవ్యవహారమంతా ఈటల వర్సెస్‌ గంగుల అన్న విధంగా మారింది. 


వీణవంకలో పోటాపోటీ

రాజకీయ వాతావరణం వేడెక్కడం అసంతృప్తివాదులకు పార్టీ అండ మంత్రి అండ దొరకడంతో వారు కొంత శక్తిని పుంజుకొని ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి రాజకీయ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. వీణవంకలో జమ్మికుంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు టీఆర్‌ఎస్‌  వెంటే తాముంటామని ఈటలకు వ్యతిరేకంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా ఈటల వర్గీయులు అడ్డుకున్నారు. కేసీఆర్‌ జిందాబాద్‌, ఈటల జిందాబాద్‌ అంటూ ఇరువర్గాలు నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో ఒకరినొకరు తోసుకుంటూ దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడగా పోలీసులు ఈటల వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. 


ఆసక్తికరంగా జమ్మికుంట మున్సిపల్‌ రాజకీయం

జమ్మికుంట మున్సిపాలిటీలో పాలకవర్గం ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామని ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో 30 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్‌తోపాటు ఏడుగురు కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దేశిని స్వప్నకోటి ఈటలకు అనుకూలంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని తేల్చిచెప్పారు. ఈ సమావేశానికి ఆమెతోపాటుమరో 13 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.


ఈ మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లుగాను 23 మంది టీఆర్‌ఎస్‌ వారే. నలుగురు కాంగ్రెస్‌, ముగ్గురు ఇండిపెండెంట్లు కౌన్సిలర్లు ఉన్నారు. 23 మందిలో  13 మంది ఈటల వర్గీయులు, ఏడుగురు ఆయన వ్యతిరేక వర్గీయులని తేలింది. ముగ్గురు తటస్థంగా ఉన్నారు. ఇదే వాతావరణం అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజుకుంటున్న రాజకీయ నిప్పు రోజురోజుకు మరింత రగిలిపోయి ఎటు దారితీస్తుందోనని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. 

టీఅరెస్, ఈటల వర్గీయుల మధ్య తోపులాట


ఇవి కూడా చదవండిImage Caption

ఈటల దారి ఎటు?మంత్రి గంగులను కలిసిన హుజూరాబాద్‌ నాయకులు

Advertisement
Advertisement