సంక్రాంతి కిక్కు

ABN , First Publish Date - 2021-01-17T05:58:59+05:30 IST

ఎక్సైజ్‌ శాఖకు పండుగ భారీ కిక్కు ఇచ్చింది. ఈ నెల ఆరంభం నుంచే మద్యం విక్రయాల్లో పెరుగుదల కనిపించింది.

సంక్రాంతి కిక్కు

భారీగా పెరిగిన మద్యం విక్రయాలు

15 రోజుల్లో రూ.141.09 కోట్ల బిజినెస్‌

గురు, శుక్రవారాల్లోనే రూ.40 కోట్లు 

గత ఏడాదితో పోల్చితే 50 శాతం అధికం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఎక్సైజ్‌ శాఖకు పండుగ భారీ కిక్కు ఇచ్చింది. ఈ నెల ఆరంభం నుంచే మద్యం విక్రయాల్లో పెరుగుదల కనిపించింది. గత 15 రోజుల్లో రూ.141.09 కోట్ల విలువైన మద్యం విక్రయం కాగా, అందులో రూ.40 కోట్లు గురు, శుక్రవారాల్లోనే అమ్ముడైంది. గత ఏడాదితో ఇదే సమయంలోని అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది 50 శాతానికి పైగా వృద్ధి నమోదుకావడం విశేషం.


విశాఖ నగరంతోపాటు జిల్లాలో 266 మద్యం దుకాణాలు, 119 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఆనందపురం (డిపో-1), జెర్రిపోతులపాలెం (డిపో-2), అనకాపల్లిలోని ఐఎంఎల్‌ డిపోల ద్వారా మద్యం సరఫరా జరుగుతుంది. సాధారణ రోజుల్లో మూడు డిపోల పరిధిలోనూ రోజుకు ఆరు కోట్ల రూపాయల విలువైన మద్యం, బీరు...దుకాణాలు, బార్లకు సరఫరా అవుతుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యానికి డిమాండ్‌ ఎక్కువగా వుంటుందని కొంతమంది చాలాముందుగానే సరకు కొనుగోలు చేసి ఇళ్లలో భద్రపరుచుకుంటుంటారు. దీనివల్ల జనవరి ఆరంభం నుంచే విక్రయాలు పెరుగుతుంటాయి. అందుకనుగుణంగానే ఎక్సైజ్‌ అధికారులు ఒకటో తేదీ నుంచే ఇండెంట్‌కు మించి సరకును దుకాణాలకు సరఫరా చేశారు. బార్ల నిర్వాహకులు కూడా అమ్మకాలను ముందుగానే అంచనా వేసి ఎక్కువ సరకు తెచ్చి నిల్వ పెట్టుకున్నారు. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకూ మూడు డిపోల నుంచి రూ.141.09 కోట్ల విలువైన 1,29,469 మద్యం కేసులు, రూ.47,886 బీరు కేసులు దుకాణాలు,బార్లకు సరఫరా అయ్యాయి. ఈ సరకంతా శుక్రవారం రాత్రికే దాదాపు అమ్ముడైపోవడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతమంది బార్ల నిర్వాహకులు తమ వద్ద సరకు చివరి దశకు చేరుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఇండెంట్‌ పంపించినా, డీడీలు తీయలేకపోవడంతో డిపోల నుంచి సరకు పంపలేకపోయారు. ఈ నెలలో జరిగిన విక్రయాల్లో రూ.40 కోట్ల విలువైన మద్యం గురు, శుక్రవారాల్లోనే అమ్ముడైనట్టు ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. అదే గత ఏడాది విక్రయాలను పరిశీలిస్తే జనవరి ఒకటి నుంచి 15వ తేదీ వరకూ రూ.97.44 కోట్ల విలువైన 1,18,053 మద్యం కేసులు, 54,074 బీరు కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ లెక్కన గత ఏడాదితో పోల్చుకుంటే విక్రయాలు దాదాపు 50 శాతం పెరిగాయి. 


జనవరి 1-15 మధ్య మద్యం విక్రయాలు

గత ఏడాది  ఈ ఏడాది

మద్యం కేసులు 1,18,053 1,29,469

బీరు కేసులు 54,074 47,886

మొత్తం విలువ రూ.97.44 కోట్లు రూ. 141.09 కోట్లు

Updated Date - 2021-01-17T05:58:59+05:30 IST