జోరుగా వానకాలం సాగు

ABN , First Publish Date - 2020-08-14T10:24:12+05:30 IST

విస్తారంగా కురుస్తున్న వర్షాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇస్తున్న సాగునీటి ధీమా వర్షాకాలపు సాగుపై ఆశలు రెట్టింపు చేసింది

జోరుగా వానకాలం సాగు

2.22 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి 

ఒక లక్ష 979 ఎకరాల్లో పత్తి 

7,954 ఎకరాల్లో కంది, పెసర పంటలు 

తొమ్మిది వేల ఎకరాల్లో ఇతర పంటల సాగు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

విస్తారంగా కురుస్తున్న వర్షాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇస్తున్న సాగునీటి ధీమా వర్షాకాలపు సాగుపై ఆశలు రెట్టింపు చేసింది. జిల్లాలో వాన కాలం సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అంచనాలను మించి రైతులు సాగు పనులను పూర్తి చేశారు. జిల్లాలో ఈసారి 2.84 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేయగా ఇప్పటికే 3,41, 085 ఎకరాల్లో పంటలు వేశారు. 101 శాతం పంటల సాగు చేసి రైతులు దిగుబడులపై పూర్తిస్థాయిలో భరోసాతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానా కాలం నుంచే నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నది. జిల్లాలో దొడ్డురకాల వరిసాగును తగ్గించి సన్నరకాలను, పత్తి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. మొక్కజొన్న సాగును వానాకాలం అసలే చేపట్టవద్దని రైతులకు సూచించింది. జిల్లాలో వానా కాలంలో 2,80,585 ఎకరాల్లో సాధారణంగా వివిధ పంటలను సాగు చేస్తున్నారు. 


జిల్లాలో సాగు వివరాలు

ఇప్పటి వరకు 2,22,199 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వ్యవసాయశాఖ అంచనా వేసిన దానికన్నా 15 వేల ఎకరాలు ఎక్కువ. ఇంకా వరి నాట్లు కొనసాగుతున్నాయి. 2.6 లక్షల ఎకరాల వరకు వరి సాగు జరుగవచ్చని భావిస్తున్నారు. వ్యవసాయశాఖ 66,693 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేయగా లక్షా 979 ఎకరాల్లో సాగు చేశారు. 2,524 ఎకరాల్లో పెసర, 5,430 ఎకరాల్లో కంది, 460 ఎకరాల్లో మిర్చి, 626 ఎకరాల్లో పసుపు, తొమ్మిది వేల ఎకరాల్లో ఇతర పంటలు, 67 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. 


సాగునీటికి ధీమా

జిల్లాలో సాగునీటికి ఈ సంవత్సరం కూడా ఎలాంటి కొరత ఉండే పరిస్థితి లేదు. ఒక వైపు ఆశించిన మేరకు వర్షాలు కురుస్తుండడంతోపాటు శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ధీమా ఏర్పడింది. వర్షాలు కురవక పోయినా కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. జిల్లాలో వానా కాలం ప్రారంభమైన నాటి నుంచి 616 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్‌ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు 481.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉంటుంది. సుమారు 136 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. ఈ రెండున్నర నెలల్లో 31 రోజులు వర్షాలు కురిశాయి. దీనితో జిల్లాలో చెరువులు, కుంటలు అన్నీ నిండి, వ్యవసాయ పనులు జోరుగా సాగడానికి వీలు కలిగింది.


వర్షాలు పడక ముందే మిడ్‌మానేరు, లోయర్‌ మానేరులో ఉన్న నీటితో , ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో ఆయకట్టు ప్రాంత చెరువులు, కుంటలను నింపారు. ఇటీవల కురిసిన వర్షాలతో మెట్టప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో 90 శాతం నీరు వచ్చి చేరింది. వారంరోజులుగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. ఈ నీటిని ఎల్‌ఎండీ ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు ఇవ్వడమే కాకుండా వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పాత జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు నింపుతున్నారు.  ప్రస్తుతం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 90 టీఎంసీల నీటికి గాను 41 టీఎంసీలు నీరు వచ్చి చేరింది. ఈ నీటితో ఆయకట్టుకు వానాకాలం మొత్తంగా నీరు ఇచ్చే అవకాశం కలుగుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు రిజర్వాయర్లను కూడా నింపుతున్నందు వల్ల వర్షాలు కురియక పోయినా వానా కాలం సాగుకు ఢోకా లేదన్న ధీమా కలగడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తున్నది.  

Updated Date - 2020-08-14T10:24:12+05:30 IST