Abn logo
Jul 19 2021 @ 13:22PM

Hyd : రాగల ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం

  • నిండుకుండలా హిమాయత్‌సాగర్‌
  • 1762.70 అడుగులకు చేరగానే రెడ్‌ అలర్ట్‌
  • ఆదివారం రాత్రి నాటికి 1762.30 అడుగులు


హైదరాబాద్‌ సిటీ : హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా తొణికిసలాడుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సాగర్‌ నీళ్లను మరోసారి వదిలేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సరిగ్గా పది నెలల క్రితం భారీగా కురిసిన వర్షాలకు హిమాయత్‌సాగర్‌కు ఎగువ నుంచి 25 వేలకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో 13 గేట్లను ఎత్తారు. జలాశయం చరిత్రలోనే ఒకేసారి 13 గేట్లను ఎత్తడం అదీ రెండోసారి. లక్షలాది క్యూసెక్కుల నీటిని వరుసగా మూడు రోజుల పాటు బయటకు వాటర్‌బోర్డు అధికారులు నిర్ణీత నీటి మట్టాలను కొనసాగించారు. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతమున్న నీటిమట్టాలు పెరిగితే పరిసర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ విధించే అవకాశాలున్నాయి. ఇన్‌ఫ్లో అధికమైతే అందుకనుగుణంగా ఏ క్షణమైనా గేట్లు ఎత్తేందుకు వాటర్‌బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ దాహార్తిని తీర్చిన జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.631 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం హిమాయత్‌సాగర్‌ పై భాగంలోని వికారాబాద్‌, చేవెళ్ల, షాబాద్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఇన్‌ఫ్లో పెరుగుతోంది. గురువారం నీటిమట్టం 1761.10 అడుగుల వరకు ఉండగా, ఆదివారం రాత్రి వరకు 1762.30 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో పెరుగుతూనే ఉంది. రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అలర్ట్‌గా ఉన్నారు.


అప్రమత్తంగా అధికారులు

హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం 1762.70 అడుగులకు చేరగానే దిగువ ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ విధించనున్నారు. ప్రధానంగా మూసీనది పరీవాహక ప్రాంతాల్లో వాటర్‌బోర్డు, రెవెన్యూ, పోలీసు అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో కాజ్‌వేలు, వంతెనలు ఉన్న ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేయనున్నారు.  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పెరుగుతున్న ఇన్‌ఫ్లో ఆధారంగా ఏ క్షణమైనా సాగర్‌ గేట్లను ఎత్తే అవకాశాలున్నాయి.

పది నెలలుగా నిలకడగా నీళ్లు

గతేడాది అక్టోబర్‌ 15న భారీగా వరద రావడంతో హిమాయత్‌సాగర్‌కు ఉన్న 17 గేట్లలో 13 గేట్లను ఎత్తారు. వందేళ్ల తర్వాత మూసీనది ఉగ్రరూపం దాల్చింది. హిమాయత్‌సాగర్‌లోకి చేరిన వరదను వచ్చినట్లుగానే బయటకు వదిలేందుకు చేపట్టిన చర్యలతో మూడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అప్పటి నుంచీ నీటి మట్టాలు నిలకడగా ఉండేలా వాటర్‌బోర్డు అధికారులు చర్యలు చేపడుతున్నారు.


ప్రతీ క్షణం నదిపై దృష్టి : జీఎం

హిమాయత్‌సాగర్‌ జాలాశయం గేట్లు సోమవారం తెరిచే అవకాశం ఉంది. పై భాగంలోని మూసీ నదిలో వరద  పెరిగితే గేట్లు తెరిచి నీరు దిగువకు విడుదల చేస్తామని, ప్రతీ క్షణం నదిపై దృష్టి పెడుతున్నామని జలమండలి జీఎం రామకృష్ణ తెలిపారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య హిమాయత్‌సాగర్‌ కట్టపై గల కట్టమైసమ్మ ఆలయంలో సంప్రదాయం ప్రకారం ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటిని వదిలే ముందు ఈ పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే, ఈసీ పరీవాహక ప్రాంతాలైన కిస్మత్‌పూర్‌, బుద్వేల్‌, బండ్లగూడ, హైదర్‌గూడ, లంగర్‌హౌజ్‌ ప్రాంతంలో రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా  ఆదివారం 1784.24 అడుగులకు నీరు చేరింది. మరో మూడు అడుగులు వస్తే మూసీలోకి నీటిని విడుదల చేస్తారు. 

హైదరాబాద్మరిన్ని...