ఎయిమ్స్‌ పనులపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-10-08T14:36:45+05:30 IST

మదురైకి చెందిన కేకే రమేష్‌ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌లో

ఎయిమ్స్‌ పనులపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

చెన్నై: మదురైలో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణపనులకు సంబంధించిన నివేదికను దాఖలుచేయాలని కేంద్రప్రభుత్వానికి హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మదురైకి చెందిన కేకే రమేష్‌ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌లో దాఖలుచేసిన పిటిషన్‌లో... రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు 2015 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటుకు 2018లో తోపూర్‌లో స్థలం ఎంపిక చేశారని, కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. ఎయిమ్స్‌ ఆస్పపత్రి నిర్మాణపనులు వెంటనే ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను 2018లో న్యాయస్థానం విచారించగా, కేంద్ర మంత్రివర్గం అంగీకరించిన 45 నెలల్లో ఎయిమ్స్‌ నిర్మాణపనులు పూర్తిచేస్తామని కేంద్రప్రభుత్వం బదులు పిటిషన్‌ దాఖలుచేసింది.


ఈ వ్యవహారంపై పిటిషనర్‌ రెండవసారి దాఖలుచేసిన పిటిషన్‌లో... తమిళనాడుతో పాటు ప్రకటించిన హిమాచల్‌ప్రదేశ్‌లో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, కానీ తమిళనాడులో మాత్రం పనుల్లో జాప్యం జరిగిందని, ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో పలువురు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతు న్నారని, ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలుచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిమ్స్‌ ఆసుపత్రి ఉన్నట్లుయితే నాణ్యమైన చికిత్స అందడంతో పలువురిని కరోనా నుంచి రక్షించే అవకాశముంటుందన్నారు. కానీ, కేంద్రం జాప్యం కారణంగా అసలు ఎయిమ్స్‌ ఆస్పత్రి వస్తుందా? లేదా? అనే సందిగ్దంలో రాష్ట్రప్రజలు ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో, ఎయిమ్స్‌ ఆస్పపత్రి నిర్మాణాలు ప్రారంభించడం, త్వరలో పూర్తిచేసేలా, అందుకు అవసరమైన నిధులను కేటాయించేలా కేంద్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరాడు. 


ఈ పిటిషన్‌ బుధవారం న్యాయమూర్తులు ఎన్‌.కృపాకరన్‌, పి.పుహళేందిలతో కూడిన బెంచ్‌ ముందు విచారణకు రాగా, కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ విక్టోరియా గౌరి వాదన వినిపిస్తూ, మదురైలో త్వరలో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటవుతుందని, అందుకు సంబంధించిన చర్యలను కేంద్రం వేగవంతం చేసిందని తెలియజేశారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న బెంచ్‌, మదురైలో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, తమిళనాడుతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రుల ఏర్పాటు తదితర అంశాలపై నివేదిక దాఖలుచేయాలని కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను నవంబరు 5వ తేదీకి వాయిదావేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-10-08T14:36:45+05:30 IST