ఆశ..నిరాశ

ABN , First Publish Date - 2020-10-20T09:06:47+05:30 IST

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న ‘ఆశ’ కార్యకర్తలు వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆశ..నిరాశ

ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్ల వేధింపులు, ఒత్తిళ్లు

మాస్క్‌లు, శానిటైజర్లు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఉన్నతాధికారుల బెదిరింపులు

సచివాలయాలకు అప్పగించడంతో పెరిగిన పని ఒత్తిడి.. 

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ నిల్‌

అందని జీతం బకాయిలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న ‘ఆశ’ కార్యకర్తలు వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమకు పని భారం విపరీతంగా పెరిగిందని వారు వాపోతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలకు చైర్మన్లు నియామకం తరువాత తమపై పెత్తనం, వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని..ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు.


తమకు సంబంధం లేని పనులు కూడా చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, చేయకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోపక్క ఉన్నతాధికారులు కూడా హీనంగా చూస్తున్నారని వాపోతున్నారు. విధి నిర్వహణలో వుండే తమకు మాస్క్‌లు, శానిటైజర్లు అడుగుతుంటే..నచ్చితే పని చేయండి, లేకపోతే మానేయండంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


జీతం పెంచి..పని భారం అంతకు మించి.. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు వేల రూపాయల నుంచి జీతాన్ని రూ.పది వేలు చేసినప్పటికీ..పని భారం అంతకు మించి పెంచి ఇబ్బంది పెడుతోందని పలువురు ఆశ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది మంది జనాభాకు ఒకరు, నగర  ప్రాంతాల్లో 2500 మంది జనాభాకు ఒకరు  ‘ఆశ’ కార్యకర్త సేవలు అందించేవారు.


అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరిని సచివాలయాలకు అటాచ్‌ చేసి...ప్రతి ఆశ వర్కర్‌ గ్రామీణ ప్రాంతాల్లో 2500 జనాభాకు, నగర ప్రాంతాల్లో అయితే ఐదు వేల జనాభాకు సేవలు అందించాలని ఆదేశించారు. దీనివల్ల తమకు పని ఒత్తిడి పెరిగిపోయిందంటున్నారు. సచివాలయానికి అటాచ్‌ చేసిన తమకు...వారి మాదిరిగానే కాకుండా...24 గంటలు అందుబాటులో సేవలు అందించేలా చేయడం ఎంతవరకు సమంజసమని వారంతా ప్రశ్నిస్తున్నారు. 


రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ లేవు..

ఆశ వర్కర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వర్తింపజేయడం లేదు. ఆశ కార్యకర్తగా పని చేసి రిటైరైన వ్యక్తి కుటుంబ సభ్యులకు గతంలో అవకాశం కల్పించేవారని...ఇప్పుడు అటువంటి దేమీ లేదని వారంతా వాపోతున్నారు. 

అందని జీతం బకాయిలు

గత ప్రభుత్వ హయాంలో ఆశ కార్యకర్తలు నెలకు రూ.6 వేలు వేతనంగా పొందేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పది వేల రూపాయలు చేసింది. అంతకుముందు  నాలుగు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని ఎంత మొత్తుకుంటున్నా...ఫలితం లేదు. ఇప్పటికీ జిల్లాలో 300 మందికిపైగా ఆశ కార్యకర్తలకు మూడు, నాలుగు నెలలకు సంబంధించిన జీతం బకాయిలు రావాల్సి ఉంది. రెండేళ్లు గడుస్తున్నా ఆ జీతాలను చెల్లించకపోవడం పట్ల వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-10-20T09:06:47+05:30 IST