నిరుద్యోగుల్లో ఆశలు!

ABN , First Publish Date - 2022-03-10T05:40:42+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు వేస్తామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అదేవిధంగా ఆయా జిల్లాలో శాఖల వారీగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పోస్టులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది.

నిరుద్యోగుల్లో ఆశలు!

- ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల భర్తీ చేస్తామంటూ కేసీఆర్‌ ప్రకటన

- ఖాళీ పోస్టుల వివరాలు వెల్లడించిన ప్రభుత్వం

- కామారెడ్డి జిల్లాలో 1,340 ప్రభుత్వ పోస్టుల ఖాళీలు

- ఉద్యోగార్థులకు పదేళ్లకు వయో పరిమితిని పెంచిన ప్రభుత్వం

- త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లకు సన్నాహాలు

- కామారెడ్డిలో 16వేలకు పైగా నిరుద్యోగులు

- నిరుద్యోగ యువతలో నెలకొంటున్న ఆశలు


కామారెడ్డి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు వేస్తామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అదేవిధంగా ఆయా జిల్లాలో శాఖల వారీగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పోస్టులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో జిల్లాలోని నిరుద్యోగ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1,340 ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవేకాకుండా మరికొన్ని శాఖల్లోనూ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా విద్యా, వైద్యశాఖలతో పాటు పోలీసుశాఖలో ఎక్కువగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగాల నియామకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని కూడా పెంచుతూ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో మరింత ఆశలను రేకెత్తిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రైవేట్‌ కొలువులకు సుమారు 16 వేల మంది నిరుద్యోగ యువతి, యువకులు ఉపాధి కల్పన శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపడితే వీరిలో చాలా మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌లు వేయాలని నిరుద్యోగ యువతి, యువకులు కోరుతున్నారు. 

ఉపాధి కోసం వేల మంది యువత ఎదురుచూపు

గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వపరంగా ఎలాంటి ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్‌ వెలువడకపోవడంతో ఉపాధి కోసం జిల్లాలో వేల మంది యువతి, యువకులు ఎదురుచూస్తున్నారు. బీఈడీ, డీఎడ్‌ చేసిన అభ్యర్థులకు యేటా రెండు సార్లు టెట్‌ నిర్వహించాలి. కానీ ఐదు సంవత్సరాల నుంచి అది జరగడం లేదు. దీంతో ఉపాధ్యాయ వృత్తి కోర్సు చేసిన అభ్యర్థులు చాలా మంది ప్రైవేట్‌ పాఠశాలలో చదువులు చెప్పే అవకాశాన్ని కోల్పోయారు. కరోనా ఎఫెక్ట్‌తో పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.  జిల్లాలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసిన సుమారు 8 వందల మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. మిషన్‌ భగీరథ పథకంలోనూ పని చేస్తున్న పలువురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం కొలువులను కోల్పోయారు. ఇటు కేజీబీవీలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలా వేల మంది నిరుద్యోగ యువతి, యువకులు ఉపాధి కోసం వేచి చూస్తున్నారు.

జిల్లాలో 16 వేల మంది నిరుద్యోగులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో వేల మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆయా ఉపాధి కల్పన కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని మూడు డివిజన్‌ల పరిధిలో సుమారు 16 వేల మందికి పైగా నిరుద్యోగులు ఉపాధి కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందులో ఓసీలు 1,828 మంది ఉండగా, ఎస్‌సీలు 2,567, ఎస్టీలు 1,282, బీసీ ఏ లో 1,254, బీసీ బీ లో 3,272, బీసీ సీ లో 48, బీసీ డీ లో 3,561, బీసీ ఈ లో 371 మంది నిరుద్యోగ యువతి, యువకులు కొలువుల కోసమై ఉపాధి కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నారు. వీరే కాకుండా వికలాంగుల జాబితాలో బధిరులు 140 మంది, మూగ, చెవిటి వారు 119, కాళ్లు, చేతులు లేని వారు 1,544, మానసిక వికలాంగులు 11 మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా మరికొన్ని వేల మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో 1,340 పోస్టుల ఖాళీలు

జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వరంగ సంస్థల్లో 1,340  పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వంతాజాగా ప్రకటించింది. ఇవే కాకుండా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా విద్యాశాఖలో ఎక్కువగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారుల నివేదికలో తేలింది. సుమారు 840 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్‌ఏ, ఎస్‌జీటీ పోస్టులు, భాష పండితుల పోస్టులు, పీఈటీలు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు మరో 21 ప్రభుత్వ శాఖల్లో వెయ్యికి పైగా ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. మల్టీ జోనల్‌, జోనల్‌ పోస్టుల వివరాలను సైతం ప్రభుత్వం ప్రకటించింది. కామారెడ్డి జిల్లా మల్టీ జోన్‌-1 పరిధిలో ఉంది. ఈ జోన్‌ పరిధిలో 6,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్‌-3లో రాజన్న సిరిసిల్లలో కామారెడ్డి జిల్లాతో పాటు కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్‌లో 2,403 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ సంస్థలో ఖాళీల పోస్టుల లెక్కలు తేలడంతో ప్రభుత్వం 91వేలకు పైగా ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగయువత సర్కారు కొలువుల కోసం ఇప్పటి నుంచే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రంథాలయాలు నిరుద్యోగ యువతతో నిండిపోతున్నాయి. మరికొందరు కోచింగ్‌ సెంటర్ల బాట పడుతున్నారు.

అభ్యర్థుల వయో పరిమితి పెంపు

గత కొనేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగకపోవడంతో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కాస్తా సడలింపు సైతం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే యువతి, యువకుల వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది. పోలీసు శాఖ వంటి యునిఫాం సర్వీసులు మినహ, ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని పదేళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింత మంది నిరుద్యోగులకు ప్రభుత్వ అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏళ్లకు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు 49 ఏళ్లకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట వయోపరిమితి పెరగనుంది.


నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నా..

- శివకుమార్‌, నిరుద్యోగి, కామారెడ్డి

నేను ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్నా గతంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించి కొద్దిమేరలో ఉద్యోగం చేజిక్కించుకోలేక పోయాను. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌లు వేస్తుందని ఎదురుచూస్తూ జిల్లా గ్రంథాలయంలో ప్రిపేర్‌ అవుతున్నాను. ప్రస్తుతం నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రకటనను సీఎం కేసీఆర్‌ ప్రకటించడం పట్ల ఆనందంగా ఉంది.


ఎస్‌జీటీ పోస్టుకై ప్రిపేర్‌ అవుతున్నా..

- నీలిమా, డీఎడ్‌, కామారెడ్డి

నేను డీఎడ్‌ పూర్తి చేసి ప్రభుత్వం నిర్వహించిన టెట్‌ పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించాను. ప్రభుత్వ టీచర్‌ కావాలనేది నా కళ. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్‌జీటీ పోస్టు కోసం ప్రిపేర్‌ అవుతూ ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్‌ వేస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేయడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. 

Updated Date - 2022-03-10T05:40:42+05:30 IST