పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2021-10-12T04:02:51+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం 2006లో అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు హక్కు పత్రాలిచ్చింది. ఆ తర్వాత సరిగ్గా 15ఏళ్లకు మళ్లీ ఈ అంశంపై కదలిక మొదలైంది.

పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

- హక్కు పత్రాలిస్తామన్న సీఎం ప్రకటనతో హడావుడి

- రికార్డుల దుమ్ము దులుపనున్న ఐటీడీఏ

- జిల్లాలో 35వేలకు పైనే దరఖాస్తు చేసుకునే అవకాశం 

- గిరిజనేతరుల అంశం ఇంకా డోలయామానంలోనే  

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం 2006లో అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు హక్కు పత్రాలిచ్చింది. ఆ తర్వాత సరిగ్గా 15ఏళ్లకు మళ్లీ ఈ అంశంపై కదలిక మొదలైంది. రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిన పోడు వివాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద మరోసారి పట్టిలిస్తామంటూ తాజా ప్రకటన జారీ చేశారు. దీంతో జిల్లాకు చెందిన వేలాది మంది రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా పట్టాలకోసం ఎదురు చూస్తున్న ఆదివాసీ రైతులు ముఖ్యమంత్రి ప్రకటనలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాగా గుర్తింపు పొందిన ఆసిఫాబాద్‌లో ప్రతీఏటా పోడు రైతులు సాగు ప్రారంభంలోనే అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో దాడులు, ప్రతిదాడులు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో స్థానిక శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులపై రైతుల ఒత్తిడి అధికంగా ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే అర్హులైన రైతులు వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయడం కోసం ఈ నెల3వ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొనడంతో దీనిపై స్పష్టత వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అర్హులు ఇదివరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, గతంలో ఎంతమందికి పట్టాలిచ్చారు, ఎంతమందికి హద్దులు నిర్ణయించి పొజిషన్‌ ఇచ్చారన్న విషయాన్ని తేల్చేందుకు ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) రికార్డుల దుమ్ము దులుపుతోంది. 

35వేలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశం..

జిల్లాలో 3మండలాలు మినహా మిగితా అన్ని మండలాల్లోనూ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో భారీ ఎత్తున పోడు పట్టాల కోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2006లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద మొత్తం 82,129ఎకరాల అటవీ భూములకు పోడు పట్టాలకోసం 21,641మంది రైతులు గిరిజన సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 12,631మందికి 46,321ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ చే శారు. దాదాపు 9వేల మంది రైతుల దరఖాస్తులను బుట్టదాఖలు చేశారన్నమాట. అయితే వీరిలో చాలామంది అర్హులైన రైతులున్నా అటవీశాఖ మోకాలడ్డడంతో మిగితా వారికి భూమి హక్కు పత్రాలు అందకుండా పోయాయి. ప్రస్తుతం అలాంటి రైతు కుటుంబాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోయినట్లు చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం ఈ దఫా దరఖాస్తులు 35వేల నుంచి 40వేల వరకు ఉండొచ్చంటున్నారు.

గిరిజనేతర రైతులపై ఇంకా అస్పష్టతే..

జిల్లాలో అటవీశాఖ లెక్కల ప్రకారం సుమారు 40వేల ఎకరాలకు పైగా అటవీ భూములు సాగు భూములుగా మారాయి. ప్రభుత్వం గిరిజనులకు మరోసారి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద పట్టాలిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే  జిల్లావ్యాప్తంగా సుమారు 15-20వేల ఎకరాలలో  గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న భూములపై మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు. దీంతో తమ పరిస్థితి ఏమిటన్నదానిపై గిరిజనేతర రైతులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సుమారు 3,661ఎకరాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ భూములపై రెవెన్యూశాఖ గిరిజనేతర రైతులకు లావుని పట్టాల రూపంలో హక్కు పత్రాలిచ్చింది. అయితే అటవీశాఖ మాత్రం ఆ భూములు తమవేనంటూ పేచీ పెడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. 

Updated Date - 2021-10-12T04:02:51+05:30 IST