‘కో ఆప్షన్‌’పై ఆశలు

ABN , First Publish Date - 2022-09-13T04:22:31+05:30 IST

మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్యను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి.

‘కో ఆప్షన్‌’పై ఆశలు

 - సభ్యుల సంఖ్యను 5 నుంచి 10కి పెంపు

- ప్రయత్నాలు ప్రారంభించిన ఆశావహులు 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 12: మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్యను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి.  రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన రెండున్నర సంవత్సరాల తర్వాత ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మున్సిపాలిటీల్లో కూడా కో అప్షన్‌ సభ్యుల సంఖ్యను అక్కడి జనాభాను బట్టి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో కో ఆప్షన్‌ సభ్యుల పదవి కోసం పోటీ పడి అవకాశం దక్కని వారితోపాటు కొత్తగా నామినేటెడ్‌ పదవులను ఆశించే వారు కో ఆప్షన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.


 ఖరారు కాని విధివిధానాలు 


 జిల్లాలో కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో 60 మంది కార్పొరేటర్లతోపాటు ఐదుగురు కో అప్షన్‌ సభ్యులు ఉన్నారు. ఐదుగురు కో అప్షన్‌ సభ్యులో ఒక మహిళ, ఒక మైనార్టీకి అవకాశం ఇచ్చారు. కొత్తగా మరో ఐదు కో అప్షన్‌ సభ్యుల సంఖ్య పెరుగుతుండగా, అందులో కూడా మహిళలు, బీసీ, ఎస్సీ,ఎస్టీ, మహిళలకు ప్రత్యేకంగా కొన్ని స్థానాలు కేటాయిస్తారా లేక ఓపెన్‌ కేటగిరీలో అందరికి అవకాశం కల్పిస్తారో స్పష్టత లేదు. రాష్ట్ర మంత్రి వర్గం కో ఆప్షన్‌ పదవులను పెంచుతూ తీర్మానించి పది రోజులు అవుతున్నా నేటికి ఇంకా విధివిధానాలతో కూడిన జీవోను జారీ చేయలేదు. దీనితో కో అప్షన్‌ సభ్యుల సంఖ్య పెంపుపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సగం గడిచి పోయినందున ఈ పాలకవర్గంలోనే కో అప్షన్‌ సభ్యులను పెంచుతారో లేక వచ్చే మున్సిపల్‌ ఎన్నికల నాటికి కో అప్షన్‌ సభ్యుల సంఖ్యను పెంచుతారో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. విధివిధానాలతో కూడిన ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేస్తేనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠతోపాటు నిరాశకూడా నెలకొన్నది. 


 దక్కేదెవరికో..?


గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ టికెట్లను ఆశించి భంగపడ్డవారిలో కొందరు ఆ తర్వాత కో ఆప్షన్‌ పదవుల కోసం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. అవకాశం రాక పోవడంతో కో ఆప్షన్‌ పదవులతోపాటే ఏదైనా నామినేటెడ్‌ పదవులు ఇప్పించాలంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ టికెట్లపై పోటీచేసీ ఓడిపోయిన వారు కొందరు కో ఆప్షన్‌ పదవుల కోసం పోటీపడి కుల, మత, ఇతర సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కని వారు మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటికే కొంత మంది  మంత్రి గంగుల కమలాకర్‌ను, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, మేయర్‌ సునీల్‌రావును కలిసి కో ఆప్షన్‌ పదవిలో తనకు అవకాశం ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్‌లో రాజకీయసందడి నెలకొంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 60 మంది కార్పొరేటర్లలో 42 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉండడంతో ఆపార్టీకి చెందిన వారే కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశాలుండడంతో ఇతర పార్టీల్లో చర్చ జరగడం లేదు. 

Updated Date - 2022-09-13T04:22:31+05:30 IST