కలెక్టర్‌ చెబితేనే కరోనా చికిత్స.. కరోనా బాధితుడికి ముప్పతిప్పలు..!

ABN , First Publish Date - 2020-09-04T15:29:10+05:30 IST

డాక్టర్లు దైవంతో సమానం అంటారు. అమ్మ జన్మనిస్తే.. పునర్జన్మనిచ్చేది డాక్టర్లేనని చెబుతారు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్తున్న కరోనా బాధితులను కనీసం ఆసుపత్రి లోపలికి రానీయకుండా

కలెక్టర్‌ చెబితేనే కరోనా చికిత్స.. కరోనా బాధితుడికి ముప్పతిప్పలు..!

కరోనా బాధితుడిని ముప్పతిప్పలు పెట్టిన ప్రభుత్వాసుపత్రి అధికారులు


విజయవాడ, ఆంధ్రజ్యోతి : డాక్టర్లు దైవంతో సమానం అంటారు. అమ్మ జన్మనిస్తే.. పునర్జన్మనిచ్చేది డాక్టర్లేనని చెబుతారు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్తున్న కరోనా బాధితులను కనీసం ఆసుపత్రి లోపలికి రానీయకుండా చెలగాటమాడుతున్న వైద్య వ్యవస్థ ప్రస్తుతం ఉంది. ‘కరోనా సోకింది.. కాపాడండి..’ అంటూ ప్రాణభయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ బాధితుడిని అధికారుల రికమండేషన్‌ కావాలంటూ ముప్పుతిప్పలు పెట్టిన ఘటన గురువారం చోటుచేసుకుంది. 


భవానీపురానికి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం మధ్యాహ్నం ఫోన్‌చేసి చెప్పారు. దీంతో బాధితులు వెంటనే చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, అత్యవసర వైద్యం అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటున్నామని, 38 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్నందున చేర్చుకోబోమని, ఇంటి వద్దే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యాధికారులు సూచించారు. అద్దె ఇంట్లో ఒకే గదిలో భార్యాపిల్లలతో ఉంటున్నానని, తాను ఇంటి వద్దే ఉంటే వారికి కూడా కరోనా సోకే ప్రమాదముందని ప్రాధేయపడినా ఆసుపత్రి అధికారులు కనికరించలేదు. చేసేది లేక ఉసూరుమంటూ వెనుదిరిగిన ఆ బాధితుడు ఇంటికి వెళ్తే భార్యాపిల్లలకు వైరస్‌ సోకుతుందన్న భయంతో రాత్రంతా గొల్లపూడి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలంలో పడుకున్నాడు. తెల్లవారాక తమ ప్రాంత వలంటీర్‌కు, తనకు ఫోన్‌చేసి చెప్పిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి తెలియజేశాడు. వారు దగ్గరలో ఉన్న నిమ్రా కొవిడ్‌ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. 


నిమ్రాలోనూ అదే పరిస్థితి

గురువారం ఉదయమే నిమ్రా ఆసుపత్రికి వెళ్లి తనకు కొవిడ్‌ చికిత్స అందించాలని కోరాడు. జిల్లా అధికారులు చెప్పకుండా ఆసుపత్రిలో చేర్చుకునేది లేదంటూ అక్కడి వైద్యాధికారులు చెప్పారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆసుపత్రి ప్రధాన గేటు వద్దే కూర్చున్నా ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. 


సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి..

అతని దీనస్థితి గురించి తెలుసుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి సోషల్‌ మీడియాలో వివరాలు పోస్ట్‌ చేశారు. కరోనా సోకిన వ్యక్తికి వైద్యం అందించకుండా నిరాకరిస్తున్న కొవిడ్‌ ఆసుపత్రుల తీరును కొంతమంది మీడియా ప్రతినిధులు కలెక్టర్‌ ఇంతియాజ్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించారు. వెంటనే నిమ్రా ఆసుపత్రి అధికారులకు ఫోన్‌చేసి గేటు వద్ద ఉన్న కరోనా బాధితుడికి చికిత్స అందించాలని ఆదేశించడంతో అప్పుడు నిమ్రా ఆసుపత్రి అధికారులు ఆ బాధితుడిని లోపలికి తీసుకెళ్లి బెడ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆ బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

Updated Date - 2020-09-04T15:29:10+05:30 IST