హౌస్‌ అరెస్ట్‌లతో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN , First Publish Date - 2020-11-23T06:06:51+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకులను పోలవరం వెళ్ళనీయకుండా హౌస్‌ అరెస్ట్‌లు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సీపీఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య అన్నారు.

హౌస్‌ అరెస్ట్‌లతో ప్రజాస్వామ్యం ఖూనీ
చింతలపూడిలో నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య

పలువురు వామపక్ష నాయకుల అరెస్టు, గృహ నిర్బంధం

చింతలపూడి, నవంబరు 22: రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకులను పోలవరం వెళ్ళనీయకుండా హౌస్‌ అరెస్ట్‌లు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సీపీఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య అన్నారు. ఆదివారంనాడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పోలవరం సందర్శనకు వస్తున్న సందర్భంగా ముందస్తుగా సీపీఐ నాయకులను హౌస్‌ అరెస్ట్‌లు చేశారని ఇది అక్రమమని  పేర్కొన్నారు. సీపీఐ నాయకులు ఎం. వసంతరావు, పి. సోమశేఖర్‌,  పి. బాబును  బయటకు రానీయకుండా తాళాలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యాలయం వద్ద  నినాదాలు చేశారు.  

బైక్‌ ర్యాలీ అడ్డగింత..  నాయకుల అరెస్ట్‌

వేలేరుపాడు, నవంబరు 22: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వేలేరుపాడు ఎస్‌ఐ సుధీర్‌ సీపీఐ నాయకులను ఆదివారం తెల్లవారుజామున  నిర్బంధించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ముందస్తు అనుమతితోనే బైక్‌ ర్యాలీని నిర్వహించ తలపెట్టగా తమను  పోలీసులు  స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించడం అన్యాయమని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ మున్నీరు ఆగ్రహం వ్యక్తం చేశారు.  


 నాయకుల హౌస్‌ అరెస్టుపై నిరసన

కుక్కునూరు: సీపీఐ  చేపట్టిన పోలవరం యాత్రను పోలీసులు అడ్డుకు న్నారు. స్థానిక  ఆ పార్టీ నాయకు లను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. సీపీఐ మండల కార్యదర్శి ఎం.వెంకటా చారి, జిల్లా సమితి నాయకుడు అయితా సురేష్‌, నాయకులు కూరాకుల బాబూరావు, కొన్నే లక్ష్మయ్యలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై సీతా రామనగరం, బరపతినగర్‌ గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. సీపీఐ నాయకులను హౌస్‌ అరెస్టు చేయడంపై సీపీఎం మండల కమిటీ సభ్యుడు వై.సాయికిరణ్‌ ఒక ప్రకటనలో నిరసన తెలిపారు.  


పనులు సవ్యంగా ఉంటే అడ్డుకోవడం ఎందుకు?

పోలవరం: సీపీఎం నాయకుల అక్రమ అరెస్టులు ఖండించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి గుడెల్లి  వెంకట్రావు అన్నారు. ఆదివారం  పోలీసులు సీపీఎం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావును ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రాజెక్టు పరిశీలనకు సీపీఐ నాయకులు వస్తుంటే సీపీఎం  నాయకులను  అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు.  ఆదివారం పోలవరం మండలంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అడ్డుకోవడం పిరికిపంద చర్య అని ఆ పార్టీ మండల కార్యదర్శి  నరసింహారావు అన్నారు. ప్రాజెక్టు నిర్మా ణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా  ఉంటే పోలీసులతో ప్రభుత్వం తమ పార్టీ  నాయకులను నిలువరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.  


పోరాటాలను అణచివేస్తే సహించం

కామవరపుకోట: పోరాటాలను అణచివేయాలని చూస్తే సహించేదిలేదని,   సీపీఐ ఏరియా కార్యదర్శి టి.వి.ఎస్‌.రాజు అన్నారు. ఆదివారం  తన మిత్ర బృందంతో పోలవరం సందర్శనకు వెళ్ళేందుకు సిద్ధం కాగా తడికలపూడి పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు.  

అక్రమ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు... 

టి.నరసాపురం, నవంబరు 22: అక్రమ గృహ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు తాడిగడప జయరాజు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా నాయకుల హౌస్‌ అరెస్టుకు నిరసనగా టి.నరసాపురం ఎర్రచెరువు కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో చేశారు.  


అక్రమ అరెస్టులను ఆపాలి

బుట్టాయగూడెం, నవంబరు 22: సీపీఎం  నాయకుల అక్రమ అరెస్టులను ఆపాలని మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని పోలవరం పర్యటన ప్రారంభించిన నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో మొడియం నాగమణి, తామా ముత్యాలమ్మ, ఉడతా వెంకటేశు ఉన్నారు. 


Updated Date - 2020-11-23T06:06:51+05:30 IST