కరోనాతోపాటు పుట్టెడు రోగాలున్న వ్యక్తికి 85 రోజుల పాటు చికిత్స
ABN , First Publish Date - 2021-07-07T18:31:16+05:30 IST
ఓ రోగి కరోనా, బ్లాక్ ఫంగస్ తదితర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో 85 రోజులపాటు చికిత్స పొంది కోలుకున్న ఉదంతం...
కొవిడ్, బ్లాక్ ఫంగస్‌ల నుంచి కోలుకున్న రోగి... డిశ్చార్జ్
ముంబై (మహారాష్ట్ర): ఓ రోగి కరోనా, బ్లాక్ ఫంగస్ తదితర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో 85 రోజులపాటు చికిత్స పొంది కోలుకున్న ఉదంతం మహారాష్ట్రలోని ముంబై నగరంలో తాజాగా వెలుగుచూసింది.ముంబై నగరానికి చెందిన భరత్ పంచల్ కరోనా, బ్లాక్ ఫంగస్, అవయవ వైఫల్యం, ఊపిరితిత్తుల చీలిక వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హీరానందాని ఆసుపత్రిలో చేరారు.85 రోజులపాటు చికిత్స పొందిన భరత్ కోలుకోవడంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. 54 ఏళ్ల భరత్ పంచల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుండటంతో అతని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భరత్ కు ఏప్రిల్ 8వతేదీన కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు.
అనంతరం రెండు వారాల తర్వాత భరత్ కు జ్వరం రావడంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. దీంతో భరత్ కు వెంటిలేటరుపై ఉంచి చికిత్స చేయడం ఆరంభించారు.భరత్ మూత్రపిండాల గాయం, కాలేయం సరిగా పనిచేయక పోవడం, ఊపిరితిత్తుల్లో చీలిక, బ్లాక్ ఫంగస్ లతో బాధపడుతూ చికిత్స పొందాడు. భరత్ కు ఊపిరితిత్తుల్లో రక్తస్రావం వల్ల అతని కుటుంబం ఆశ వదులుకున్నా, పక్షం రోజుల తర్వాత కోలుకున్నాడు. 85రోజుల పాటు సుదీర్ఘ చికిత్స పొందిన భరత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వెళ్లారు. ఇన్ని ఆరోగ్య సమస్యలున్నా కోలుకోవడం రికార్డు అని వైద్యులు చెప్పారు.