Abn logo
Feb 8 2020 @ 15:18PM

మధుమేహులు గుండెను కాపాడుకోవడం ఎలా?

మధుమేహంతో బాధపడేవారు గుండె విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మధుమేహ రోగులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘకాలం పాటు మధుమేహం వ్యాధితో ఇబ్బంది పడేవారి హృదయ స్పందనల్లో ఊహించని మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

షుగర్‌కు మాత్రలు వేసుకుంటున్నాం, రక్తంలో షుగర్‌ స్థాయిలు అదుపులోనే ఉన్నాయి అని మధుమేహులు సరిపెట్టుకోవడం పెద్ద పొరపాటే అవుతుంది. మధుమేహానికి దీర్ఘకాలంగా మందులు వాడుతున్నా, తెలియకుండానే గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రక్తం శాతం ప్రామాణిక అంశం 

గుండె ఎడమ జఠరిక (వెంట్రికల్‌)లో రక్తాన్ని శుద్ధిచేసి ధమనుల్లోకి పంపే ప్రక్రియ జరుగుతుంది. అయితే  మధుమేహం కారణంగా గుండె సంకోచ, వ్యాకోచాల సమయంలో ఎడమ జఠరిక నుంచి విడుదలయ్యే రక్త శాతం ప్రామాణిక భాగం (ప్రిజర్వుడు ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ మెజర్‌మెంట్‌) తగ్గిపోయే ముప్పు ఉంది. జఠరిక నుంచి నిర్ధేశిత ప్రామాణిక అంశం కన్నా రక్తం విడుదల చాలా తక్కువ ఉన్నట్లయితే గుండె వైఫల్యానికి (హార్ట్‌ ఫెయిల్యూర్‌) దారితీస్తుంది. అందువల్ల కేవలం షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలోనే ఉన్నాయికదా అని మధుమేహులు సరిపెట్టుకోవడం తగదని హృద్యోగ నిపుణులు చెబుతున్నారు.  హైపర్‌ టెన్షన్‌, ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వంటి గుండె సంబంధిత వ్యాధుల ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎప్పుడూ అవే కారణం కావాల్సిన పరిస్థితి లేదని అమెరికాకు చెందిన ఒక వైద్య కళాశాలలోని రోగులు సహా పలువురిపై అధ్యయనం జరిపిన అనంతరం పరిశోధకులు తేల్చారు. డయాబెటిక్‌ కార్డియోపతి, గుండెపోటు అనే అంశం ఆధారంగా నిర్వహించిన పరీక్షల్లో మధుమేహం ప్రభావం వల్ల కూడా గుండె విఫలమవుతుందని గుర్తించారు. 

అధ్యయనం ఇలా

గుండె కొట్టుకునే సమయంలో గుండె నుంచి విడుదలయ్యే రక్త శాతం ప్రామాణిక భాగం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ మెజర్‌మెంట్‌ ఆఫ్‌ బ్లడ్‌) విషయంలో దీర్ఘకాలంలో గుండె విఫలం చెందడంపై మధుమేహం ప్రభావాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. అధ్యయనంలో భాగంగా హైపర్‌టెన్షన్‌, గుండె ధమనుల సమస్య, ఇతర గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స పొందే మధుమేహం లేని 232 మందితో 116 మంది మధుమేహ బాధితులను పోల్చి చూశారు. పదేళ్ళపాటు జరిగిన ఈ అధ్యయనంలో మధుమేహ బాధితుల్లో ఐదో వంతు మందికి గుండెపోటు వచ్చింది. మధుమేహం లేని వారిలో 12 శాతం మంది మాత్రమే గుండెపోటు బారినపడ్డారు. ఈ రెండు గ్రూపులలో గుండెపోటు బారిన పడ్డవారి గణాంకాల్లో వ్యత్యాసం గురించి మాత్రమే అధ్యయనం చేయలేదు. గుండె విఫలం కావడంలో డయాబెటిస్‌ మిల్లిటస్‌ (మధుమేహం) సొంతంగా చూపే ముప్పు గురించి అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. దీంతో మధుమేహం వల్ల గుండెకు ఏర్పడే ముప్పుపై లోతుగా వేగంగా తెలుసుకునేందుకు ఈ అధ్యయనం తోడ్పడుతుంది.

రక్తం పంపింగ్‌ సామర్థ్యం

గుండె జఠరిక నుంచి ధమనుల్లోకి రక్తాన్ని పంపించే (పంపింగ్‌) సామర్థ్యం లెక్కింపు (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌) శాతం సాధారణంగా 50 నుంచి 70 మధ్య ఉంటుంది. సాధారణ ఎజెక్షన్ ఫ్రాక్షన్‌ ఉన్నా హార్ట్‌ ఫెయిలయ్యే అవకాశం ఉంటుంది. దీనిని హార్ట్‌ ఫెయిల్యూర్‌ విత్‌ ప్రిజర్వుడు ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ అంటారు. గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె కవాటాల్లో సమస్య కారణంగా హృదయం కండరాలు దెబ్బతిన్నట్లయితే ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ (పంపింగ్‌ లెక్కశాతం) తక్కువగా ఉంటుంది. సాధారణంగా రక్తాన్ని పంపింగ్‌ చేసే కనీస సామర్థ్యం 50 నుంచి 65 శాతం మధ్య ఉండాలి. అయితే అది (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌) 35 శాతం కన్నా తగ్గిపోయినట్లయితే  ఆకస్మికంగా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. గుండె చేసే ప్రతి చప్పుడు (హార్ట్‌ బీట్‌)కి ఎడమ జఠరిక నుంచి ధమనుల్లోకి పంపింగ్‌ చేయబడే రక్తం శాతాన్ని జఠరికలో గరిష్టంగా నిండే రక్తం పరిమాణంతో భాగించినప్పుడు అది 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే పంపింగ్‌ సాధారణమని నిర్వచిస్తారు. అయితే గుండె దిగువ గది (ఎడమ జఠరిక) రక్తంతో సరిగా నిండకపోతే ధమనుల ద్వారా శరీరానికి సరఫరా అయ్యే రక్తం సాధారణం కన్నా తక్కువ అవుతుంది.

సామర్థ్యం పెంచుకోవచ్చు

గుండె నుంచి రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం సాధారణం కన్నా తక్కువగా అంటే 40 శాతం నుంచి 54 శాతం మధ్య ఉంటే  శుద్ధిచేయబడిన రక్తం సరఫరా శరీరంలోని ఇతర భాగాలను తగినంతగా అందదు. హృదయ కండరాలు, కవాటాలు దెబ్బ తిన్నట్లయితే పంపింగ్‌ సామర్థ్యం 35 శాతం కన్నా తక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ పంపింగ్‌ 25 శాతం మాత్రమే ఉన్న రోగుల్లో 50 శాతం మంది ఐదేళ్ళు జీవించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటిస్తే 25 శాతం మంది ఆయుః ప్రామాణం పదేళ్ళ వరకూ ఉంటుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల జఠరిక నుంచి ధమనుల్లోకి రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుర్తించడం ఎలా?

శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గిపోవడం, కాళ్ల దిగువన, పాదాల్లో వాపు రావడం, గుండె కొట్టుకోవడంలో గణనీయ మార్పులు, తీవ్ర మానసిక ఆందోళన వంటి లక్షణాలను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల మంది అమెరికన్లు కొత్తగా ఇటువంటి రుగ్మతకు గురవుతున్నారు. వీరిలో 50 ఏళ్ళు దాటిన మహిళలే అధికం. అయితే మహిళల విషయంలో ధమనుల్లోకి రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థం సాధారణ స్థాయిలోనే ఉన్నా గుండె పనితీరు తగ్గిపోవడం పరిశోధకులు గుర్తించారు. 

మందులతో చికిత్స

గుండె కండరాలు మరింత బలహీన పడకుండా ఉండేందుకు మందులతోనే చికిత్స చేయవచ్చని హుద్రోగ నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల ఒత్తిడి తగ్గించేందుకు డైరెటిక్స్‌, హైడ్రాలజైన్‌ నైట్రేట్‌, స్పైరొనొలాక్టోన్‌ వంటి మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలి. నిపుణుల పర్యవేక్షణలో కార్డియాక్‌ రీసింక్రనైజేషన్‌ థెరపీ, ఇంప్లాంట్ల ద్వారా కూడా రక్తం పంపింగ్‌ సామర్థాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి.

మరో 20 ఏళ్ళు

గుండెలో రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం తగ్గినట్లు గుర్తించినంత మాత్రాన ఆందోళన చెందనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు... మధుమేహం, అధిక రక్తపోటు, గుండె కవాటాల్లో సమస్యలు, దీర్ఘకాలం మద్యపానం చేసినవారు కూడా గుండె సమస్యలను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే మరో 20 ఏళ్ళు నిబ్బరంగా జీవితాన్ని కొనసాగించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె పోటు కారణంగా కండరాలు దెబ్బతిన్నట్లయితే ఆ ప్రాంతంలో తనకు తానుగా కణజాలాన్ని ఉత్పత్తి చేసుకోవడం ద్వారా నయంచేసుకునే సామర్థ్యం గుండెకు ఉంది. అయితే అలా గుండె కండరాలు నయం కావడానికి అనేక వారాల సమయం పడుతుంది. రిపేరుకు అవసరమైన పరిమాణంలో రక్తం పంప్‌ చేసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కండరాల త్వరగా కోలుకోవు.  ఎల్లప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా ఉండటం, చిన్నపాటి వ్యాయామాలు, శరీరానికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం వంటి కారణాలు గుండె పనితీరును మెరుగుపరి పంపింగ్‌ సామర్థాన్ని పెంచుతాయని అధ్యయకారులు చెబుతున్నారు.  జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ఇందుకు ముఖ్యమని, తద్వారా ఆయుః ప్రమాణాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి, బరువు తగ్గాలి. ఆహార నియమాలు–వ్యాయామం కన్నా బరువు తగ్గడం ప్రధానం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. భుక్తాయాసం వచ్చేలా ఎక్కువ ఆహారం తీసుకోరాదు. అనవసర వాదనల కారణంగా ఒత్తిడికి గురికావద్దు. అధిక శ్రమ కలిగించే పనులకు దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు చూడాలి. వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా వాడాలి. రక్తంలో షుగర్‌ స్థాయిలు పెంచే కేకులు, ఐస్‌క్రీం, మిఠాయిలు వంటి తీపి పదార్థాలకు తీసుకోరాదు. హద్రోగ నిపుణులు సూచించిన కార్డియో ఎక్సర్‌సైజులను మాత్రమే చేయాలి.

కళ్ళు జాగ్రత్త 

మధుమేహంతో బాధపడేవారు కంటి చూపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేత్రవైద్యులు చెబుతున్నారు. షుగర్‌ వ్యాధితో బాధపడే వారి రక్తనాళాల్లో అధిక స్థాయుల్లో గ్లూకోజ్‌ ఉంటుందని తెలిసిందే. మధుమేహం వచ్చిన తర్వాత జీవిత కాలం వెన్నంటి ఉంటుంది. మాత్రలు వాడుతున్నా, రక్తంలో షుగర్‌ స్థాయులు నియంత్రణలో ఉన్నట్లు నివేదికలు వచ్చిన ఏమరు పాటుగా ఉండటం తగదు. మధుమేహం ఉన్నవారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్‌ రెటినోపతి, డయాబెటిక్‌ మాక్యులర్‌ ఎడెమా, కాటరాక్ట్‌, గ్లుకోమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. సకాలంలో గుర్తించకపోతే చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం నియంత్రణలో లేకుంటే దీర్ఘకాలంలో అంథత్వం ముప్పు ఉంటుంది. ప్రతి సంవత్సరం నిపుణుల చేత కంటి పరీక్షలు చేయించుకోవాలి. 

పాదాల్లో సమస్య వస్తే

మధుమేహం నియంత్రణలో లేకుంటే నరాలను దెబ్బతీస్తుంది. దెబ్బతిన్న నరాల కారణంగా కాళ్ళు ముఖ్యంగా పాదాలకు ముప్పు ఏర్పడుతుంది. స్పర్శ తెలియదు. వేడి, చల్లదనమే కాదు నొప్పి కలిగినా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఎటువంటి భావన లేకపోవడాన్ని ‘సెంసరీ డయాబెటిక్‌ న్యూరోపతి’ అంటారు. పాదానికి గాయమైనా, నొప్పి కలిగినా ఆ విషయం తెలియని కారణంగా గాయం మరింత ముదిరి ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన చోట శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని తొలగించాల్సి వస్తుంది. అందువల్ల నిత్యం ముఖ్యంగా పాదాలను గమనిస్తూ, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

కళ్ళు, కాళ్ళు జర భద్రం

మధుమేహంతో బాధపడేవారు గుండెతో పాటు, కళ్ళు, కాళ్ళ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారుతుంది. ఆ గ్లూకోజ్‌ రక్తనాళాల ద్వారా రక్త కణాలకు అందుతుంది. అధికంగా ఏర్పడిన గ్లూకోజ్‌ను క్లోమ గ్రంథిలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ ధ్వంసం చేస్తుంది. అయితే ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిగా జరగకపోతే రక్తనాళాల్లో గ్లూకోజ్‌ స్థాయిలు పేరుకుపోయి రక్తం సరఫరా సక్రమంగా జరగదు. దీంతో గుండె, కళ్ళు, కాళ్ళు, పాదాలు దెబ్బతింటాయి. అందువల్ల మధుమేహులు ఏటా గుండె, కళ్ళు, కాళ్ళకు ఈసీజీ, ప్రెజర్‌ టెస్ట్‌, స్పర్శ పరీక్షలు చేయించాలి. ఫలితాల ఆధారంగా వైద్యుల సూచనలు పాటించాలి. కన్ను కాలు సరిగాఉంటే ఎవరిపైనా ఆధారపడకండా ఉండొచ్చని పెద్దలు చెప్పిన మాట నిజమవుతుంది. 

– ఎన్‌. మృదులలిత
ప్రత్యేకం మరిన్ని...