వేతన జీవులకు ఈపీఎఫ్‌వో ఊరట.. ఇక ఎగ్జిట్ డేట్ మీరే అప్‌డేట్ చెయ్యొచ్చు!

ABN , First Publish Date - 2021-06-15T05:11:14+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పోర్టల్‌లో ఎగ్జిట్ తేదీ అప్‌డేట్ చేయడానికి యాజమాన్యాల చుట్టూ తిరిగే రోజులకు తెరపడింది...

వేతన జీవులకు ఈపీఎఫ్‌వో ఊరట.. ఇక ఎగ్జిట్ డేట్ మీరే అప్‌డేట్ చెయ్యొచ్చు!

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పోర్టల్‌లో ఎగ్జిట్ తేదీ అప్‌డేట్ చేయడానికి యాజమాన్యాల చుట్టూ తిరిగే రోజులకు తెరపడింది. రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులు స్వయంగా ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ చేసుకునేలా ఈపీఎఫ్‌వో అవకాశం కల్పించింది. ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in లోకి లాగిన్ అయ్యి ఉద్యోగం వదిలేసిన తేదీని అప్‌డేట్ చేసుకోవచ్చు. సబ్‌స్క్రైబర్లు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు లేదా కొత్త యాజమాన్యం ఖాతా కిందికి బదలాయించేందుకు ఎగ్జిట్ డేట్‌ను అప్‌డేట్ చేయాల్సి వుంటుందని ఈపీఎఫ్‌వో పేర్కొంది. అయితే ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌వో ఖాతాలో పాత యాజమాన్యం చివరిసారి చందా చెల్లించిన రెండు నెలల తర్వాత మాత్రమే ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు యాజమాన్యాలకు మాత్రమే ఎగ్జిట్ తేదీని అప్‌డేట్ చేసే అధికారం ఉండేది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. ఎగ్జిట్‌ డేట్ లేదా ఉద్యోగం మానేసిన తేదీని ఒక్కసారి అప్‌డేట్ చేశాక మళ్లీ మార్చడం కుదరదు. కాబట్టి దీన్ని సబ్‌మిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త.


ఈపీఎఫ్ పోర్టల్‌లో ఉద్యోగ వదిలివేసిన లేదా ఎగ్జిట్ తేదీని అప్‌డేట్ చేయండిలా...


- ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ www.unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ సందర్శించి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి 


- హోం స్క్రీన్‌లో, ‘మేనేజ్’లోకి వెళ్లి ‘మార్క్ ఎగ్జిట్’ పై క్లిక్ చేయాలి


- డ్రాప్‌డౌన్ మెనులోకి వెళ్లి ‘పీఎఫ్ అకౌంట్ నంబర్‌’ను సెలెక్ట్ చేసుకోవాలి


- ఎగ్జిట్ తేదీని, అందుకు గల కారణాన్ని ఎంటర్ చేయాలి


- రిక్వెస్ట్ ఓటీపీ (వన్‌ టైమ్ పాస్‌వర్డ్) మీద క్లిక్ చేసి, ఆధార్ లింక్ అయిన నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి


- ‘అప్‌డేట్’ మీద క్లిక్ చేయగానే ఎగ్జిట్ తేదీ విజయవంతంగా అప్‌డేట్ అయినట్టు స్క్రీన్ మీద సందేశం కనిపిస్తుంది.

Updated Date - 2021-06-15T05:11:14+05:30 IST