మానవజాతికి కౌంట్‌ డౌన్‌

ABN , First Publish Date - 2021-03-29T07:52:47+05:30 IST

నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యపు ముప్పు మానవజాతి మనుగడకే పెను సవాల్‌ విసురుతోంది. పునరుత్పత్తి సామర్థ్యంపై దెబ్బకొట్టి.. మన నిర్లక్ష్యా నికి మూల్యం చెల్లించమంటోంది! కాలుష్యం అనగానే.. వాహనాలు, ఫ్యాక్టరీ గొట్టాల పొగ...

మానవజాతికి కౌంట్‌ డౌన్‌

  • ప్లాస్టిక్‌ విష రసాయనాల ప్రభావంతో తగ్గిపోతున్న పునరుత్పత్తి సామర్థ్యం
  • కుచించుకుపోతున్న పురుషాంగాలు.. భారీగా పడిపోతున్న వీర్యకణాల సంఖ్య
  • 1973 సగటుతో పోలిస్తే 60శాతం తగ్గాయి.. 2045 నాటికి సున్నా అయ్యే ప్రమాదం
  • అది మానవాళి మనుగడకే ముప్పు.. అమెరికన్‌ పర్యావరణవేత్త హెచ్చరిక

నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యపు ముప్పు మానవజాతి మనుగడకే పెను సవాల్‌ విసురుతోంది. పునరుత్పత్తి సామర్థ్యంపై దెబ్బకొట్టి.. మన నిర్లక్ష్యా నికి మూల్యం చెల్లించమంటోంది! కాలుష్యం అనగానే.. వాహనాలు, ఫ్యాక్టరీ గొట్టాల పొగ ఊహించుకోవద్దు. ఇంట్లో టైల్స్‌ తుడవడానికి వాడే క్లీనర్ల నుంచి.. సబ్బులు, షాంపూలు, ప్లాస్టిక్‌, ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల దాకా.. అన్నింటిలో ఉండే విషరసాయనాలూ కాలుష్యం కిందికే వస్తాయి. అవి స్త్రీ, పురుషుల హార్మోన్ల పనితీరు పాడయ్యేలా చేసి పునరుత్పత్తి సామర్థ్యం మీద దెబ్బ కొడుతున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ షన్నా స్వాన్‌ హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై ఎంతో కాలంగా పరిశోధన చేస్తున్న ఆమె.. ‘కౌంట్‌డౌన్‌’ అనే పుస్తకం రాశారు. 





ఆ దేశం.. ఈ దేశం అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ప్రొఫెసర్‌ షన్నా స్వాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె పరిశోధనలో తేలినదాని ప్రకారం.. 1973 నాటి పురుషుల్లో వీర్యకణాల సంఖ్యతో పోలిస్తే ఇప్పటి పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సగటున 60 శాతం మేర తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే.. 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని.. తద్వారా పునరుత్పత్తి ఆగిపోయి, మానవ జాతి మనుగడకే ముప్పు వస్తుందని ఆమె హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. ‘ఫరెవర్‌ కెమికల్స్‌’గా పేరొందిన పీఎ్‌ఫఏలు (పర్‌ఫ్లోరోఆల్కైల్‌, పాలీఫ్లోరోఆల్కైల్‌) ఎక్కువగా ఉండే వస్తువుల వాడకం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోందని ఆమె తెలిపారు. సాధారణంగా ప్లాస్టిక్‌ భూమిలో కలవాలంటే కొన్ని వందల, వేల ఏళ్లు పడుతుంది. అదే ఈ పీఎ్‌ఫఏలైతే పర్యావరణంలోగానీ, మానవ శరీరంలోగానీ ఎప్పటికీ కలవవని, ఒకచోటికి చేరి శరీరానికి, భూమికి తీవ్ర హాని చేస్తుంటాయని షన్నా వివరించారు. మనం వాడే షాంపూలు, పెయింట్లు, కెమెరాలు, మరక పడకుండా నిరోధించే ఉత్పత్తులు(స్టెయిన్‌ రెసిస్టెంట్‌), నాన్‌స్టిక్‌ ఉ త్పత్తులు(నాన్‌స్టిక్‌ పెనం, కడాయి వంటివి), ఫైర్‌ఫైటిం గ్‌ ఫోమ్‌(అగ్నిప్రమాద సమయాల్లో మంటలను ఆర్పడానికి వాడే నురగ), ఫాస్ట్‌ఫుడ్‌ ప్యాకేజింగ్‌, పురుగుమందు ల వంటివాటిలో పీఎ్‌ఫఏలు ఎక్కువగా ఉంటాయన్నారు.


స్త్రీలకూ ముప్పే..

పీఎ్‌ఫఏల వల్ల పురుషులకే కాదు స్త్రీలకూ ప్రమాదమేనని షన్నా స్వాన్‌ హెచ్చరించారు. ‘‘ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సగటున 20 ఏళ్ల  మహిళల పునరుత్పత్తి సామర్థ్యం.. వారి అమ్మమ్మ/నానమ్మలకు 35 ఏళ్ల వయసులో ఉన్న సామర్థ్యం కన్నా తక్కువగా ఉంది’’ అని ఆమె తన పుస్తకంలో వెల్లడించారు. అలాగే.. ప్రస్తుతం ప్రతి పురుషుడిలోనూ తమ తాతయ్యలతో పోలిస్తే సగటు వీర్యకణాల సంఖ్య దాదాపు సగమే ఉందని చెప్పారు. దీన్ని అంతర్జాతీయ సంక్షోభంగా వర్ణించారామె. వీర్యకణాల సంఖ్య తగ్గడమే కాదు.. పురుషాంగాలు, వృషణాల పరిమాణం సైతం నానాటికీ క్రమంగా కుచించుకుపోతూ వస్తోందని ఆమె హెచ్చరించారు. ఒకరకంగా ఇది పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితేనంటారామె. అసలేం చేసా ్తయి? పీఎ్‌ఫఏలు, ఫాలేట్స్‌, బైస్ఫెనాల్‌ ఏ.. ఇవి మనం నిత్యం వాడే అనేక ఉత్పత్తుల్లో ఉండే విష రసాయనాలు. ప్లాస్టిక్‌ను మృదువుగా, ఎటుపడితే అటు వంగేలా చేయడానికి ఫాలేట్స్‌ను వినియోగిస్తారు. ప్యాకేజింగ్‌, పిల్లల బొమ్మల తయారీలో ఎక్కువగా వాడుతారు. పురుషులు ఈ ఫాలేట్స్‌కు ఎంత ఎక్కువగా గురైతే.. అంతగా వీర్యకణాల సంఖ్యను, లైంగిక కోర్కెలను తగ్గిస్తాయి. మహిళల్లో అయితే చిన్నవయసులోనే రజస్వల కావడం, పెద్దయ్యాక గర్భస్రావాల ముప్పు ఫాలేట్స్‌ వల్ల ఉంటుంది. ఇక.. ప్లాస్టిక్‌ను గట్టిగా చేయడానికి ‘బైస్ఫెనాల్‌ ఏ (బీపీఏ)’ను వాడతారు. ఏటీఎంలు, స్వైపింగ్‌ మెషీన్ల నుంచి వచ్చే రసీదుల్లో కూడా ఈ బీపీఏ ఉంటుంది. ఇది మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్‌లాగా వ్యవహరించడంతో.. శరీరం దాన్ని ఈస్ట్రోజన్‌గా భావించి, తగినంత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ను విడుదల చేయడం మానేస్తుంది. ఫలితంగా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. పురుషుల్లో ఇది వీర్యకణాల సంక్యను, లైంగిక కోర్కెలను తగ్గిస్తుంది. అంతేకాదు.. అంగస్తంభన సమస్యలకు కూడా కారణమవుతుందిది. గర్భిణులు ఈ రసాయనాలకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అయితే వాటి ప్రభావం గర్భస్థ శిశువులపైనా పడుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. పిల్లల బొమ్మల తయారీలో వినియోగించే ఫాలేట్స్‌ వాడకంపై ప్రభుత్వాలు కఠిన పరిమితులు విధించాలని సూచిస్తున్నారు. 






ఏజీడీ... అత్యంత కీలకం

యానోజెనిటల్‌ డిస్టెన్స్‌ (ఏజీడీ).. అంటే గుద భాగానికి, జననావయవాలకు మధ్య ఉండే తేడా. సహజంగా ఇది పురుషుల్లో ఎక్కువగా, స్త్రీలలో తక్కువగా ఉంటుంది. కానీ, ఫాలేట్స్‌కు ఎక్కువగా గురికావడం వల్ల ఈ ఏజీడీల్లో తేడాలు వస్తున్నాయని షన్నా స్వాన్‌ తెలిపారు. పురుషుల్లో ఈ దూరం తగ్గిపోతుండగా.. మహిళల్లో పెరుగుతోందని వివరించారు. నవజాత శిశువుల్లో ఈ దూరాన్ని పరిశీలించ డం ద్వారా భవిష్యత్తులో వారి పునరుత్పత్తి సామర్థ్యా న్ని అంచనా వేయొచ్చని వెల్లడించారు. ఏజీడీ.. పురుషుల్లో తక్కువగా, మహిళల్లో ఎక్కువగా ఉంటే వారి పునరుత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుందన్నారు.  


మరి పరిష్కారం?

ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచమంతా కలిసికట్టుగా పనిచేయాలని.. పీఎ్‌ఫఏలు ఉండే ఉత్పత్తుల వినియోగాన్ని, తయారీని నిషేధిస్తూ కఠిన చట్టాలను జారీ చేయాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఇక మనవంతుగా.. వీలైనంత వరకూ ప్యాకేజ్డ్‌, ప్రాసెస్డ్‌ ఆహారాన్ని తీసుకోవద్దని, ఇంటి భోజనమే చేయాలని, టెఫ్లాన్‌ కోటింగ్‌ ఉన్న పాత్రలను వాడొద్దని, ప్లాస్టిక్‌ పాత్రల్లో ఒవెన్‌లో వండొద్దని, సువాసనలు వెదజల్లే ఉత్పత్తులను వాడొద్దని షన్నా స్వాన్‌ సూచించారు.


- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2021-03-29T07:52:47+05:30 IST