ఇష్టానుసారం.. ‘హక్కుల’కు భాష్యం

ABN , First Publish Date - 2021-10-13T06:57:17+05:30 IST

దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా మానవ హక్కులను ఉపయోగించుకోరాదని, మానవ హక్కులకు సందర్భాన్ని బట్టి భాష్యం చెప్పవద్దని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది తమ స్వార్థం కోసం మానవ హక్కులకు సొంత భాష్యం..

ఇష్టానుసారం.. ‘హక్కుల’కు భాష్యం

  • కొందరికి కొన్ని ఘటనల్లో కనిపించే 
  • ఉల్లంఘన.. మరికొన్నింట్లో కనిపించదు
  • స్వార్థం కోసం సొంతభాష్యం చెప్తున్నారు
  • మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో
  • దేశప్రతిష్ఠకు భంగం కలిగించే యత్నం
  • ఇలాంటి తీరుతో ప్రజాస్వామ్యానికి నష్టం
  • అందరి హక్కులకూ మాది గ్యారెంటీ 
  • మావన హక్కుల సంఘం వ్యవస్థాపక
  • దినోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
  • అమిత్‌ షా వల్లే జమ్మూకశ్మీర్‌లో నవశకం
  • జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా ప్రశంసలు


న్యూఢిల్లీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా మానవ హక్కులను ఉపయోగించుకోరాదని, మానవ హక్కులకు సందర్భాన్ని బట్టి భాష్యం చెప్పవద్దని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది తమ స్వార్థం కోసం మానవ హక్కులకు సొంత భాష్యం చెబుతున్నారని ఆయన విమర్శించారు. వారికి కొన్ని ఘటనల్లో కనిపంచే మానవహక్కుల ఉల్లంఘన.. మరికొన్ని ఘటనల్లో కనిపించట్లేదని.. ఇలాంటి తీరు మానవ హక్కులకే కాక, ప్రజాస్వామ్యానికి కూడా ఎంతో నష్టం కలిగిస్తుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల సంఘం 28వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మానవ హక్కుల సాధనలో రాజకీయ కోణం, లాభ నష్టాలను చూసుకోవడం అతిపెద్ద ఉల్లంఘనగా మోదీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీని మానవ హక్కులు, మానవ విలువలకు ప్రతీకగా ప్రపంచం భావిస్తోందని గుర్తుచేశారు. ‘‘ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడం ద్వారా ముస్లిం మహిళలకు కొత్త హక్కులు కల్పించాం’’ అన్నారు. మహిళా ఉద్యోగులకు 26 వారాలపాటు వేతనంతో కూడిన మాతృత్వ సెలవు లభించేట్లు చేశామన్నారు. ట్రాన్స్‌జెండర్స్‌, బాలలు, సంచారజాతుల కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు విధానం అమలుతో వలస కార్మికులకు ఇబ్బందులు దూరమయ్యాయన్నారు. 


హక్కులు.. విధ్వంసానికా?

దేశంలో మానవ హక్కుల పేరిట కొందరు విధ్వంసాలకు పాల్పడుతున్నారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.హక్కులు ఉన్నది విధ్వంసాలకు పాల్పడేందుకా? అని ఆయన ప్రశ్నించారు. తాము అవలంభిస్తున్న ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ ప్రతి ఒక్కరి మానవ హక్కులకు గ్యారెంటీ ఇస్తోందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.  


హక్కుల పరిరక్షణే ప్రధానం: షా

హక్కుల పరిరక్షణకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. మహిళలు, బాలికల హక్కులకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా 10 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినట్టు తెలిపారు.


షా వల్లే కశ్మీర్‌లో నవశకం

మానవ హక్కుల విషయంలో రాజకీయ జోక్యం వద్దంటూ.. ప్రధాని మోదీ ఉద్ఘాటించిన సభలో.. హక్కుల కమిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘‘మీ వల్లే(షా) జమ్ము కశ్మీర్‌లో నూతన శకం ప్రారంభమైంది. ఇది మీకే చెందుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370 నిర్వీర్యాన్ని ప్రభుత్వం వేసిన పెద్ద అడుగుగా అభివర్ణించారు. పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టడం అమిత్‌ షా వల్లే సాధ్యమైందని కొనియాడారు. దేశంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. ఇటీవల కాలంలో చాలా మంది ఒక నియమం ప్రకారం మాట్లాడుతున్నారని.. దీని వెనుక అంతర్జాతీయ శక్తుల ప్రమేయం ఉందని జస్టిస్‌ మిశ్రా ఆరోపించారు. కాగా, గత ఏడాది జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపైనా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

Updated Date - 2021-10-13T06:57:17+05:30 IST