హురియత్ నేత గిలానీ కన్నుమూత
ABN , First Publish Date - 2021-09-02T15:36:04+05:30 IST
హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ శ్రీనగర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి ..
శ్రీనగర్ : హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ శ్రీనగర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఆయన మృతిని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ధ్రువీకరించారు. అనేక విషయాల్లో ఆయనతో తాను ఏకీభవించి ఉండకపోవచ్చని, అయితే నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా ఆయనంటే తనకెంతో గౌరవమని ఓ ట్వీట్‌లో మెహబూబూ ముఫ్తీ పేర్కొన్నారు. ఆయన మృతి తనను విచారంలో ముంచెత్తిందని, ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయాభిలాషులకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. గిలానీ తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సజ్జద్ లోన్ అన్నారు.
హురియత్ కాన్ఫరెన్స్‌లో ప్రముఖ నేత అయిన గిలానీ కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్నారు. గతంలో ఆయన జమాత్-ఇ-ఇస్లామీ కశ్మీర్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత తెహ్రిక్-ఇ-హురియత్‌ను స్థాపించారు. ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1972,76,87లో జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 2020లో హురియత్ నుంచి తప్పుకున్నారు. 1929 సెప్టెంబర్ 29న బండిపోర జిల్లాలో జన్మించిన ఆయన లాహోర్‌లోని ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నారు. జమాత్-ఇ-ఇస్లామీలో చేరకముందు కొన్నేళ్లు టీచర్‌గా పనిచేశారు.