Advertisement
Advertisement
Abn logo
Advertisement

హుజురాబాద్‌లో మారిన బీజేపీ వ్యూహం.. ఏం జరుగుతుందో..!?

  • - కొవిడ్‌ ఆంక్షల మధ్య హుజూరాబాద్‌ పోరు
  • - బీజేపీ పాదయాత్ర ముగింపు హుస్నాబాద్‌లో...
  • -  జోరు తగ్గనున్న పార్టీల క్యాంపెయిన్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కేంద్ర ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలతో హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారం చిన్నబోనున్నది. నోటిఫికేషన్‌కు ముందే మూడునెలలుగా పూటకో సమావేశం.. రోజుకో సభ ఊరూరా.. విందులతో జరుగుతున్న ప్రచారాలకు అక్టోబరు 1 నుంచి బ్రేక్‌ పడనుంది. ఇక్కడి గెలుపును టీఆర్‌ఎస్‌, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా. భావిస్తుండడంతో ప్రచారానికి ఇరుపార్టీలకు చెందిన అగ్రనేతలు, స్టార్‌ క్యాంపేయినర్లను దింపడానికి కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనలతో వెయ్యి మందికి మించి సభను ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో అగ్రనేతలెవరూ రారని తేలిపోయింది. అంతేకాకుండా ఈరోజు వరకు జరుగుతున్న వివిధ కుల, వృత్తి, ఉద్యోగ, మహిళా సంఘాల సమావేశాలు, పాదయాత్రలు, రోడ్‌ షోలు నిలిచిపోనున్నాయి.

 

అగ్రనేతల ప్రచారం లేనట్లే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజురాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని, బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తారని ఆయా పార్టీల నేతలు భావించారు. కేంద్ర ఎన్నికల సంఘం కొవిడ్‌ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలను విధించి ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను బాద్యులను చేస్తామని పేర్కొన్నది. దీంతో నిబంధనలు కఠినంగా అమలు అయ్యే అవకాశమున్నది.

నిబంధనలు ఇవీ..

- స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభలు అయితే వెయ్యి మంది వరకు, లేక సమావేశ స్థలంలో 50 శాతం సామర్థ్యంతో ఏది తక్కువైతే ఆ సంఖ్యతో సభను నిర్వహించాల్సి ఉంటుంది. సభల వద్ద హాజరైన వారి సంఖ్యను లెక్చించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. 

- స్టార్‌ క్యాంపెయినర్లు కాకుండా ఇతరులు ప్రచారం చేస్తే సమావేశస్థలంలో పట్టే జనం సంఖ్యలో సగంగానీ 500 మందికి మించకుండా గానీ ఉండాలన్న నిబంధన విధించారు. ఈ సభల చుట్టూ పోలీసు వలయాన్ని ఏర్పాటు చేస్తారు. 

- ఇండోర్‌ మీటింగ్‌ నిర్వహిస్తే సీటింగ్‌ సామర్థ్యంలో 30 శాతం మేరకు లేదా 200 మందికి మించకుండా వీటిలో ఏది తక్కువైతే ఆ నిబంధన మేరకు సమావేశాన్ని నిర్వహించుకో వచ్చు. సభ్యులను లెక్కించేందుకు రిజిస్టర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

- రోడ్‌షోలకు, బైక్‌, కార్లు, సైకిల్‌ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోగా ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థితోపాటు ఐదుగురు మాత్రమే ఉండాలని నిబంధన విధించారు. 

- వీధి సమావేశాల్లో స్థలం అందుబాటును బట్టి 50 మందికి అనుమతి ఇస్తారు. 

- వీడియో వ్యాన్ల ప్రచారాలకు కూడా స్థలం అందుబాటును బట్టి 50 మందికే అనుమతి ఉంటుంది. 

- అభ్యర్థి, అతని రాజకీయపార్టీ 20వాహనాలను మాత్రమే వినియోగించుకునేందుకు ఆ వాహనాల్లో 50 శాతం సీటింగ్‌ సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

- ఈసారి పోలింగ్‌ ముగిసే సమయానికి 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. అంటే పోలింగ్‌ జరిగే రెండున్నర రోజుల ముందే మైక్‌ ప్రచారం నిలిచిపోనున్నది. ఎన్నికల కారణంగా కోవిడ్‌ వ్యాప్తిచెందకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను విధించింది. దీంతో మూడునెలలుగా జోరుగా సాగుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారాలు అక్టోబర్‌ 1 నుంచి ఆంక్షల మధ్య చప్పగా సాగనున్నాయి.

మారిన బీజేపీ వ్యూహం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజు హుజురాబాద్‌లో జరుపాలని నిర్ణయించారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి పాదయాత్ర ముగింపు సభను హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకార సభగా మార్చాలని ఆ పార్టీ భావించింది. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని కూడా ఆ పార్టీ ప్రచారం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు హుజురాబాద్‌ పరిధిలో ఈనెల 1 నుంచి వర్తించనున్నందున పాదయాత్ర ముగింపు సభను అక్కడ కాకుండా హుస్నాబాద్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇంకా వేదిక ఖరారుకాకున్నా హుజురాబాద్‌లో మాత్రం సభ ఉండదని తేలిపోయింది. హుజురాబాద్‌ నుంచి పార్టీ జెండాలు లేకుండా భారీ ఎత్తున జన సమీకరణ జరిపి హుస్నాబాద్‌సభలో పాల్గొనేలా చూసే అవకాశముందని చెబుతున్నారు. అమిత్‌షా హుజురాబాద్‌ పర్యటన కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆంక్షల నేపథ్యంలో అగ్రనేతలైన అమిత్‌షా, జేపీ నడ్డా, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి తదితరుల సమావేశాలు ఉండకపోవచ్చని తెలుస్తున్నది. ఒకవేళ ఉన్నా వారు వెయ్యి మంది మాత్రమే హాజరయ్యే సభల్లోనే ప్రసంగించాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి నేతలు వెయ్యి మందితో ఒకటి రెండు గ్రామాలను కలుపుకొని ప్రచార సభలు, స్టార్‌ క్యాంపెయినర్లతో వేయి మంది మధ్య జరుపుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది.   


Advertisement
Advertisement