తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని కుమారుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-28T12:07:04+05:30 IST

డబ్బుల కోసం తల్లిదండ్రులతో ఘర్షణ పడిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..

తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని కుమారుడి ఆత్మహత్య

అమీర్‌పేట, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): డబ్బుల కోసం తల్లిదండ్రులతో ఘర్షణ పడిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం, మండలం, దివిలి చంద్రంపల్లి గ్రామానికి చెందిన చింతాకుల త్రిమూర్తులు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చి ఎస్సార్‌నగర్‌ ఎస్సార్టీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.


అతడి కుమారుడు సురేష్‌(20) బల్కంపేటలో డీజే షాపులో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి బీజేఆర్‌నగర్‌లో నిద్రపోతుండేవాడు. ఏడాది క్రితం అతడి స్నేహితులు గది ఖాళీ చేయడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. స్నేహితులతో ఉన్నప్పుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. లాక్‌డౌన్‌ వల్ల పనులు లేకపోవడంతో డబ్బుల కోసం తల్లిదండ్రులను నిత్యం వేధిస్తున్నాడు.


వారు ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం వెళ్లిపోయి బీజేఆర్‌నగర్‌లో పాత రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. శనివారం రాత్రి పొద్దుపోయాక వెళ్లడంతో ఇంటి యజమాని గేటు తీయలేదు. రాత్రంతా బయట గడిపిన సురేష్‌ ఉదయం  గదిలోకివెళ్లి గడియ పెట్టుకున్నాడు. మధ్యాహ్నం అవుతున్నా బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-28T12:07:04+05:30 IST