Abn logo
Aug 1 2021 @ 09:59AM

ఒక నాన్న.. ఓ కూతురు పేదోడిని కాపాడారు

సంకల్పం ముందు చిన్నబోయిన లక్ష్యం


హైదరాబాద్/రాంగోపాల్‌పేట్‌: లక్షల్లో వ్యయం అయ్యే పని అయినా చేయిచేయి కలిపితే ఆ లక్ష్యమే చిన్నబోతుంది. పని సులువవుతుంది. సరిగ్గా ఇదే జరిగింది ఆ తండ్రి, కుమార్తెల విషయంలో. తన తండ్రి కాలేయం పాడైపోయిందని, చికిత్సకు 23లక్షల ఖర్చవుతుందని, తమను ఆదుకోవాలంటూ వచ్చిన ఓ ఫోన్‌ కాల్‌కు వారు స్పందించారు.  తమ ఒక్కరి వల్ల అంత పెద్ద లక్ష్యం సాధ్యం కాదనుకున్నారు. మనం ఒక చేయి కలిపితే, వందల చేతులు తోడావుతాయని భావించారు. మానవతామూర్తులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. వారికి సోనూసూద్‌ ఫౌండేషన్‌ కూడా తోడయింది. వారి సంకల్పం మరింత బలపడింది. ఓ పేదవాడి కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగి, ఆ ఇంట సంతోషాలు విరజిల్లుతున్నాయి. 


పేదోడికి కాలేయ మార్పిడి 

నిధులు జమచేసిన తండ్రి, కుమార్తెలు

బంధువులు, స్నేహితులు, సోనూసూద్‌ ఫౌండేషన్‌ సహకారం

తాజాగా కిడ్నీ మార్పిడి కోసం ముందుకు... 


నగరంలోని సిక్‌విలేజీ డైమండ్‌ పాయింట్‌ గన్‌రాక్‌ ప్రాంతానికి చెందిన మనోజ్‌ రహేజా గతంలో పైపుల వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న ఆయన ఆపదలో ఉన్నామనే వారికి తనకు తోచిన సహాయం చేస్తుంటారు. ఆయన కుమార్తె సంజన రహేజా ఐటీ ఉద్యోగి. ఆమెది తండ్రిలాంటి గుణమే. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పేదలు, మధ్యతరతి వారు ఆస్పత్రులలో పడకలు లేక, ఆక్సిజన్‌ అందక విలవిలాడుతుంటే తండ్రీకుమార్తెలు తల్లడిల్లిపోయారు. తమకు తోచిన సాయం చేయడంతో పాటు ఇతర దాతల సహాయం తీసుకుని పలువురికి ఆస్పత్రులలో పడకలు ఇప్పించారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను, వెంటిలేటర్లను, ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేశారు. పాస్మా, రక్తదాతలను వెతికి అవసరమున్న వారికి అందించారు. తండ్రి, కుమార్తె చేస్తున్న సేవ విషయం ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఈ క్రమంలో జూన్‌ 6న బీహార్‌ బగల్‌పూర్‌కు చెందిన షాను కుమారి నుంచి సంజన రహేజాకు ఫోన్‌ వచ్చింది. షాను కుమారి తండ్రి జైప్రకాష్‌ (51)కి కాలేయం పాడైపోయి, మార్పిడి చేస్తే తప్ప బతికే పరిస్థితి లేదని వైద్యులు చెప్పారు. శస్త్ర చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని, అంత స్థోమత తమ వద్ద లేదని షాను కుమారి చెప్పారు.


హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నాలుగేళ్లుగా చికిత్స చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చామని, ఇప్పడు ఆ స్థోమత కూడా లేక ఇంటి వద్దనే ఉంటున్నామని ఆ ఫోన్‌కాల్‌ సారాంశం. దీంతో చలించిపోయిన సంజన, తండ్రి మనోజ్‌ రహేజాతో చర్చించింది. ఎలాగైనా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించి జై ప్రకాష్‌ ప్రాణాలు కాపాడాలని ఇద్దరూ భావించారు. అనుకున్నదే తడవుగా విమాన చార్జీలు చెల్లించి జూన్‌ 12న బాధితుడిని నగరానికి రప్పించారు. మనోజ్‌ స్నేహితుడైన అనిల్‌ రాజాను సంప్రదించి, డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌లో వారికి బస ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులనూ అందించారు. సోన్‌సూద్‌ ఫౌండేషన్‌ బాధ్యులతో మాట్లాడగా, ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. శస్త్ర చికిత్సకు రూ.23 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగా, తండ్రీ కుమార్తె ఆలోచనలో పడ్డారు. వెంటనే బంధువులు, స్నేహితుల వద్ద నగదు సేకరిస్తూ, పరిస్థితిని తిరిగి సోనూసూద్‌ ఫౌండేషన్‌కు వివరించారు. వారు మిగతా నగదు సమకూర్చారు. బాధితుడు జై ప్రకాశ్‌ కుమారుడు జైషా తన కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకు రాగా, 25 రోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహించి ఈ నెల 6న కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. 13న కాలేయ దాత జైషా, 25న జై ప్రకా్‌షలు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


స్నేహితుల సహకారంతో.. 

ఆపరేషన్‌కు రూ. 23 లక్షలు, ఆ తర్వాత ఏడాది పాటు మందులకు దాదాపు రూ. 2 లక్షలు.. ఇంత డబ్బు ఎలా అని ఆలోచిస్తుండగా, ‘తప్పక అవుతుంది.. మనం చేద్దాం’ అని నా కుమార్తె సంజనా రహేజా నాలో ధైర్యాన్ని నింపింది. స్నేహితులు, బంధువులకు పరిస్థితి వివరించాం. మేము సైతం అంటూ అనిల్‌ రాజ్‌, ఆష్మా కడాకియా, దీపక్‌ దాదు, అగర్వాల్‌, పదం జైన్‌, డాక్టర్‌ రాజ్‌ కటారా, కళ్యాణ్‌ చక్రవర్తి, సోనూసూద్‌ ఫౌండేషన్‌కు చెందిన గోవింద్‌ అగర్వాల్‌ ముందుకు వచ్చి సహకారం అందించారు. వారి సహకారం లేకుంటే మేం ఏం చేయలేకపోయే వారం. ఆపరేషన్‌ విజయవంతమై ఆ కుటుంబం ఆనందంగా ఉంది. అంతకంటే ఏం కావా లి. ఇలాంటి మరెంతో మందికి సేవ చేయడానికి మనోధైర్యాన్ని ఇచ్చింది. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి కేస్‌ టేకప్‌ చేశాం. మున్ముం దు ఇలా మా వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తాం.                               

- మనోజ్‌ రహేజా