Advertisement
Advertisement
Abn logo
Advertisement

దొందూ.. దొందే..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కార్యాలయంపై బీజేపీ దాడిచేసి బీభత్సం సృష్టించడంపై పలు పార్టీలు మండిపడుతున్నాయి. శాంతియుత మార్గంలో నిరసనలు చేపట్టాలి తప్ప ప్రజా ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం సబబు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేసమయంలో సకాలంలో సమావేశాలు నిర్వహించకపోవడంపై అధికార పార్టీ తీరును తప్పు పడుతున్నారు.


టీఆర్‌ఎస్‌, బీజేపీ తీరుపై విమర్శలు

మేయర్‌ తీరే కారణమా..? 

ప్రతిపక్ష సభ్యులను ఎందుకు కలవరు.?

బీజేపీ తీరుపైనా మండిపాటు

ప్రజా ఆస్తుల ధ్వంసంపై విమర్శలు

ఖండించిన సీపీఎం.. 


 హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో విధ్వంసానికి కారణమేంటి, బీజేపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ శ్రేణులు ఎందుకలా వ్యవహరించాయి, మేయర్‌ కలవకుంటే ప్రజా ఆస్తులను ధ్వంసం చేయొచ్చా.. ప్రజా ప్రతినిధులు ఇలా వ్యవహరించడం దేనికి సంకేతం..? అన్నది గ్రేటర్‌ లో చర్చనీయాంశమైంది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌ లో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌లో తమ వాణి వినిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాలకమండలి కొలువుదీరి పది నెలలైనా ఇప్పటి వరకు భౌతిక సమావేశం నిర్వహించక పోవడంతో వారికి ఆ అవకాశం దక్కలేదు. దీంతో నెలన్నరగా బీజేపీ కార్పొరేటర్లు సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మేయర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అక్కడి నుంచి మొదలైన రగడ.. మంగళవారం మెరుపు ధర్నా, విధ్వంసానికి దారి తీసింది. మేయర్‌ కలవకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బీజేపీతోపాటు సొంత పార్టీ కార్పొరేటర్లు కొందరూ అభిప్రాయపడుతున్నారు. మేయర్‌ విజయలక్ష్మి బీజేపీ కార్పొరేటర్లను కలవడకుండా దూరం పెట్టడంపైనా విమర్శలున్నాయి. వారిని కలిసి సర్దిచెబితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కా దని ఓ పార్టీ సీనియర్‌ నాయకుడు పేర్కొన్నారు. 


ప్రజల ఆస్తుల ధ్వంసమేంటి..? 

బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘గడువులోపు కౌన్సిల్‌ సమావేశం నిర్వహించక పోయినా, తమను కలవనందుకు మేయర్‌ తీరుపై అభ్యంతరమున్నా, నిరసన తెలిపి ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ డిమాండ్‌ వ్యక్తపరచాలి. అందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది’ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో బల్దియా కార్యాలయంలోకి బలవంతంగా దూరి ఫర్నిచర్‌, మొక్కల కుండీలు ధ్వంసం చేయడం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ కార్యాలయం పై దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లడం తోపాటు పూలకుండీలను ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు.


32 మంది కార్పొరేటర్లపై కేసు..!

  జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపైౖ కేసు నమోదు చేసినట్టు సైఫాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి తెలిపారు. బల్దియా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోలు, సీసీ పుటేజీలను పరిశీలించారు. రాంనగర్‌, ముసారాంబాగ్‌, బేగంబజార్‌, గన్‌ఫౌండ్రి, మల్కాజ్‌గిరి కార్పొరేటర్లు ఘటనకు ప్రధాన బాధ్యులుగా గుర్తించినట్టు తెలిసింది. కార్పొరేటర్లతోపాటు ధ్వంసానికి పాల్పడిన కార్యకర్తలపైనా కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని  మంత్రి కేటీఆర్‌ నగర సీపీకి సూచించడంతో సైఫాబాద్‌ పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. 


ఫ్లోర్‌ లీడర్లు ఉండుంటే..?

 అసెంబ్లీ తరహాలో గ్రేటర్‌ కౌన్సిల్‌లోనూ గతంలో ప్రధాన పార్టీలకు ఫ్లోర్‌ లీడర్లు ఉండేవారు. పార్టీల అభిప్రాయం, కౌన్సిల్‌ సమావేశం, ఇతరత్రా సమస్యలపై మేయర్‌, కమిషనర్‌తో చర్చించేందుకు పార్టీ ప్రతినిధిగా ఓ సభ్యుడిని ఫ్లోర్‌ లీడర్‌గా నియమించే వారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌లో ఫ్లోర్‌ లీడర్ల నియామకం లేనప్పటికీ..  సౌలభ్యం కోసం గతంలో ఎంపిక చేసే వారు. గత పాలకమండలి హయాంలో ఫ్లోర్‌ లీడర్ల ఏర్పాటుకు స్వస్తి పలికారు. ఫ్లోర్‌ లీడర్‌ ఉండుంటే.. మేయర్‌, అధికారులతో చర్చించే అవకాశం ఉండేదని, ఇంతటి రచ్చ జరిగేది కాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 


చిత్తశుద్ధితో పోరాడాలి

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు సృష్టించిన విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆందోళనలు శాంతియుతంగా జరగాలి. ఆస్తుల ధ్వంసం చేయడం, అరాచకంగా ప్రవర్తించడం బీజేపీకే చెల్లింది. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో పోరాడకుండా అనవసర హంగామా చేసే ఆ పార్టీ తీరును ప్రజలు గమనించాలి. స్థానిక సమస్యల పరిష్కారానికి కౌన్సిల్‌ మీటింగ్‌ పెట్టకుండా ఎన్నాళ్లు ఇలా కొనసాగిస్తారు. 

- ఎం శ్రీనివాస్‌, సీపీఎం నగర కార్యదర్శి... 


జీహెచ్‌ఎంసీ కార్యాలయం శుద్ధి

బీజేపీ దాడి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల క్లీనింగ్‌

బీజేపీ దాడి నేపథ్యంలో బుధవారం టీఆర్‌ఎస్‌ సభ్యులు జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని శుద్ధి చేశారు. మేయర్‌ చాంబర్‌ వద్ద బీజేపీ కార్పొరేటర్లు నల్ల రంగు పూసిన బోర్డుకు క్షీరాభిషేకం చేశారు. మొక్కల కుండీలు, అద్దాలు పగులగొట్టిన కారిడార్లను శుభ్రం చేశారు. డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ విజయలక్ష్మి వారితో సమావేశమయ్యారు. అందరితో ఓ సారి మీటింగ్‌ పెట్టాలని కొందరు కార్పొరేటర్లు కోరగా.. తేనేటి విందులో కలుద్దామని మేయర్‌ చెప్పినట్టు తెలిసింది. లంచ్‌ ఏర్పాటు చేయాలని పలువురు పేర్కొనడంతో త్వరలో సమావేశమవుదామని విజయలక్ష్మి హామీ ఇచ్చినట్టు సమాచారం. 

Advertisement
Advertisement