Abn logo
Aug 1 2021 @ 12:24PM

దండెత్తుతున్న డెంగీ

నగరంలో జనంపై డెంగీ దాడిచేస్తోంది. దోమల బెడద అంతకంతకూ తీవ్రమవుతుండడంతో క్రమంగా డెంగీ కేసులు పెరిగాయి. ఒక్కో ఆస్పత్రి ఓపీకి 30 నుంచి 40 కేసులు వస్తున్నాయి. ప్రతిరోజు 10మందికి మించి అడ్మిట్‌ అవుతున్నారు. గత ఏడాది ప్రభావం లేని డెంగీ ఈ ఏడాది ప్రతాపం చూపిస్తోంది. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ ఆస్పత్రులకు డెంగీ లక్షణాలతో రోగులు వస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ఇటీవల రెండు రోజుల్లోనే 20 వరకు కేసులు నమోదు అయినట్లు సమాచారం. 


ఒక్కో ఆస్పత్రిలో ఓపీకి 30 నుంచి 40 కేసులు

పదికి మించి అడ్మిషన్లు

క్లాసికల్‌ డెంగీ కేసులు అధికం డెంగీ కేసులలో సగం యువతనే 

ఆస్పత్రులకు పెరుగుతున్న బాధితులు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి)

చాలా కేసులు లెక్కలోకి రావడంలేదు...

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అయితే ఈ సంఖ్య భారీగా ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎలిసా పరీక్ష చేసి నిర్ధారిస్తే కానీ డెంగీ ఉన్నట్లు ధ్రువీకరించరు. దీంతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు నమోదవుతున్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి డెంగీ కేసు అడ్మిట్‌ అయిందని సమాచారం వస్తే అప్పుడు ప్రభుత్వ సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి శాంపిల్స్‌ సేకరించి ఐపీఎంకు పంపిస్తున్నారు. ఐపీఎంలో నిర్ధారణ జరిగిన తరువాతనే వాటిని డెంగీ కేసులుగా పరిగణిస్తున్నారు. దీంతో చాలా కేసులు అధికారుల లెక్కలోకి రాకుండానే వెళ్లిపోతున్నాయి. అనేక సందర్భాలలో లక్షణాల ఆధారంగా పరిశీలించి చికిత్సలు మొదలు పెడుతున్నారు.  


తగ్గిపోతున్న ప్లేట్‌లెట్స్‌

చాలా మందిలో ప్లేట్‌లెట్స్‌ ఆకస్మికంగా తగ్గిపోతున్నా యి. రోజుకు రెండు, మూడు కేసులు ఈ తరహావి ఉంటున్నాయని, కొందరిలో ప్లేట్‌లెట్స్‌ 20 నుంచి 30 వేలకు తగ్గిపోతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.  20 వేల కంటే తక్కువగా ఉంటే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీ లక్షణాలు గమనించి వెంటనే వైద్యున్ని సంప్రందించి నిర్దారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెంగీ కేసులు ఎక్కువగా యువతలో చూస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఆస్పత్రికి వచ్చే డెంగీ కేసులలో ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. 


రోగిని కుట్టిన దోమతో మొదలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. డెంగీ రోగిని మంచి దోమ కుట్టిన తరువాత ఆ వైరస్‌ దానిలోకి ప్రవేశిస్తుంది. తిరిగి ఆ దోమ ఆరోగ్యవంతులపై దాడి చేస్తుండడంతో వారికి డెంగీ ప్రబలుతుంది.   


రకరకాల దాడి 

 అర్బన్‌ మస్కిటో దోమ అనేక రూపాలలో జనంపై దాడి చేస్తుంది. ఈ దోమ కుట్టిన వారిలో క్లాసికల్‌ డెంగీ, హెమరేజ్‌ ఫీవర్‌, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ జబ్బులు వచ్చే ప్రమాదముంది. 

 వైరల్‌ ఫీవర్‌లో ఉండే లక్షణాల ఆధారంగా  క్లాసిక్‌ డెంగీ ఫీవర్‌గా పరిగణిస్తారు. ఇది 5 నుంచి 7 రోజులు ఉంటుంది. మందులతో దీనిని తగ్గించడానికి అవకాశముంది. 

 డెంగీ హెమరేజ్‌ ఫీవర్‌ దశలో రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పరిమాణం తగ్గిపోవడం, బీపీ తగ్గిపోవడం లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశలో రోగిని ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్సలు అందిస్తారు.

 డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ దశ చాలా తీవ్ర దశ. రోగి ఈ దశకు చేరుకోగానే ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్సతో పాటు ప్లాస్మా ఎక్కించాల్సిన అవసరముంటుంది. ఈ దశలో నీరు ఊపిరితిత్తుల్లోకి నీరు చేరే ప్రమాదముంది. రోగికి కృత్రిమ శ్వాస ఇచ్చి ప్రాణాపాయం నుంచి రక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. 


అజాగ్రత్త వద్దు..

 పగలు దోమ కుట్టదనే భావనతో ఉండకూడదు.

 పగటి పూట శరీరం పూర్తిగా కవర్‌ అయ్యేలా దుస్తులు ధరించాలి.

 రాత్రి పూట పడుకునే ముందు దోమ తెరను కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. 

 వంటగదిలో పడేసే అన్నం, కూరలు, చెత్తను ఓపెన్‌గా పెట్టొద్దు.

 పండ్ల తొక్కలను ఇంటి పరిసర ప్రాంతంలో పెట్టొద్దు. 

 ఫ్లవర్‌వాజ్‌, ఎయిర్‌ కూలర్‌ నీళ్లను నిత్యం మార్చాలి. 

 ఇంటిపై ఉండే ట్యాంకులపై మూతలు పెట్టాలి. 


కేసులు పెరుగుతున్నాయ్‌..భద్రం

ఇటీవల హైగ్రేడ్‌ ఫీవర్‌తో కేసులు వస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌ తగ్గిన కేసులు కూడా వస్తున్నాయి. కొందరిలో కాలేయంపై ప్రభావం చూపుతున్నాయి. కడుపులో నీరు ఉంటుంది. కొందరిలో క్లాసికల్‌ డెంగీ ఉంటుంది. ఆస్పత్రులకే కాకుండా స్థానిక క్లినిక్‌లలో కూడా డెంగీ కేసులు ఉంటున్నాయి. కొందరిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయి. సాధారణంగా 1.5 లక్షల వరకు ఉండాల్సిన ప్లేట్‌లెట్స్‌ 20 నుంచి 30 వేలకు తగ్గిపోతున్నాయి. 20 వేల కంటే తక్కువ ఉంటే ప్లేట్‌లెట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రోగులు త్వరగా కోలుకుంటున్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ముందు కొవిడ్‌గా అనుమానించి, ఆ తర్వాత డెంగీగా భావించాలి. జలుబు ఉంటే సీజనల్‌ ఫ్లూగా భావించాలి. 

డాక్టర్‌ శివరాజు, ఇంటర్నల్‌ మెడిసిన్‌, కిమ్స్‌ ఆస్పత్రి