Abn logo
Aug 1 2021 @ 11:45AM

HYD: ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

రూ.10 లక్షల సొత్తు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ: దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మారేడ్‌పల్లి పోలీసులు, నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. మహారాష్ట్ర పూనే జిల్లా రుఘం ప్రాంతానికి చెందిన సంగత్‌ సింగ్‌ అజ్మీర్‌సింగ్‌ కళ్యాణి అలియాస్‌ సంగత్‌ సింగ్‌ కళ్యాణి (38) పాత నేరస్థుడు. పందుల పామ్‌ నిర్వహిస్తున్నాడు. ఇతడు 2005 నుంచి నేరాల బాటపట్టాడు. దోపిడీలు దొంగతనాలు చేయడం వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం ప్రారంభించాడు. పూనే జిల్లా హడ్పాసర్‌ గ్రామానికి చెందిన పాత నేరస్థుడు, కారుడ్రైవర్‌ అక్షయ్‌ పోపట్‌ పడూలే(26)ను వెంటతీసుకొని సంగత్‌ సింగ్‌ కళ్యాణి ఈ నెల 6న పుణే నుంచి నగరానికి టీవీఎస్‌ జుపీటర్‌ వాహనం (ఎంహెచ్‌ 12 ఆర్‌జే 3563)పై వచ్చాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు చివరి టోల్‌గేట్‌ దాటిన తర్వాత వాహనం నెంబర్‌ ప్లేట్‌ను మార్చారు. బైక్‌పై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించారు. అక్షయ్‌ పరిసరాలను గమనిస్తుంటే సంగత్‌ సింగ్‌ తాళం బద్దలు కొట్టి లోనికి ప్రవేశించేవాడు. అక్కడ విలువైన నగలు, నగదు చోరీ చేసుకొని పరారయ్యారు. ఇలా జూలై 7 ఒక్క రోజే మారేడ్‌పల్లి, కాచిగూడ, అంబర్‌పేట ప్రాంతంలో నాలుగు ఇళ్లలో చోరీలు చేసి అదేరోజు బైక్‌పై మహారాష్ట్రకు పరారయ్యారు. చోరీ సొత్తును రాజస్థాన్‌ ప్రాంతానికి చెందిన విక్రంసింగ్‌ రాజ్‌పుత్‌కు విక్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చోరీకి గురైన 176 గ్రాముల బంగారు, 2 కిలోల వెండి, 5 మొబైల్‌ ఫోన్లు, చోరీకి వినియోగించే రాడ్డు, ద్విచక్రవాహనం మొత్తం రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగలతోపాటు చోరీ సొత్తు కొనుగోలు చేస్తున్న విక్రంసింగ్‌ను అరెస్ట్‌ చేశారు.