హెచ్చరిక.. : ఈ ‘గీత’ తాకితే.. ఇక వాతే

ABN , First Publish Date - 2021-06-11T20:06:53+05:30 IST

ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జంక్షన్‌ల వద్ద రీడిజైనింగ్స్‌ చేయాలని పోలీసులు

హెచ్చరిక.. : ఈ ‘గీత’ తాకితే.. ఇక వాతే

  • ఆ దిశగా వాహనదారులకు అవగాహన
  • ప్రమాదాల నివారణకు జంక్షన్‌ల.. 
  • వద్ద రీ డిజైనింగ్‌.. కొత్తగా పసుపు గీతలు
  • లాక్‌డౌన్‌లో చకచకా పనులు... 

హైదరాబాద్‌ సిటీ : ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జంక్షన్‌ల వద్ద రీడిజైనింగ్స్‌ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ట్రాఫిక్‌ పోలీస్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయ సమావేశంలో ఈ విషయం చర్చించారు. 


పసుపు గీత తాకితే చలానా..  

జంక్షన్‌ల వద్ద ఇప్పటికే ట్రాఫిక్‌ నిబంధనలకు సంబంధించిన డిజైనింగ్స్‌ చూస్తుంటాం. రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహనాలు ఆగిపోవవడానికి గుర్తుగా అడ్డంగా తెల్లగీత (స్టాపింగ్‌ లైన్‌) ఉంటుంది. వాహనదారులు అక్కడే వాహనాలు ఆపాలి. దానికి కొంచెం ముందుగా జీబ్రా లైన్స్‌ ఉంటాయి. అది ఇరువైపులా వాహనాలు ఆగిన సమయంలో పాదచారులు రోడ్డు దాటడానికి ఉపయోగిస్తారు. ఇదిలా ఉండగా.. కొంతమంది వాహనదారులు రెడ్‌ లైట్‌ పడినప్పుడు జీబ్రాలైన్స్‌ను దాటుకుని ముందుకు వచ్చేస్తారు. ఇలాంటి వాహనదారులపై ఇకనుంచి చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే రీడిజైనింగ్‌ పనులు చేపట్టారు. జంక్షన్‌లలో జీబ్రాలైన్స్‌ వద్ద కొత్తగా పసుపు కలర్‌లో డబ్బాలతో కూడిన డిజైన్‌ వేస్తున్నారు.


రెడ్‌ సిగ్నల్‌ పడిన సమయంలో ఏదేని  వాహనం ఆ పసుపు గీతను తాకిందో వెంటనే పోలీసులు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా పాదచారులు దాటే విధంగా జీబ్రాలైన్‌ వారికి స్పష్టంగా కనిపించాలి. మనుషులు ఉన్నా.. లేకున్నా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలు గీతను తాకొద్దు. అంతేకాదు.. జంక్షన్‌ల వద్ద రోడ్డు దాటడానికి పాదచారులు వేచి ఉండటానికి కూడా రోడ్డు పక్కన ప్రత్యేకంగా ఐ ల్యాండ్‌ పేరుతో డిజైనింగ్‌ ఏర్పాటు చేశారు. ఇలా నగరంలో మొత్తం 30 జంక్షన్‌లు గుర్తించిన అధికారులు సైబరాబాద్‌లో సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌ వద్ద మొదటగా డిజైన్‌ చేశారు. ప్రస్తుతం నగరంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో ఆ సమయాన్ని రీడిజైనింగ్‌ పనులు పూర్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. సైబరాబాద్‌లో సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, వై జంక్షన్‌ ఇలా మొత్తం 8 జంక్షన్‌లతోపాటు.. నగరంలో మొత్తం 30జంక్షన్‌ల వద్ద రీడిజైనింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ ఏడాది కేవలం సైబరాబాద్‌ పరిధిలోని 5 జంక్షన్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు పరిగణలోకి తీసుకుంటే 239 ప్రమాదాలు జరిగాయి. 28 మంది మృతిచెందారు. 213 మంది గాయాలపాలయ్యారు.


Updated Date - 2021-06-11T20:06:53+05:30 IST