1902.. విశాఖకు!

ABN , First Publish Date - 2020-09-23T15:38:43+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1902 కాల్‌సెంటర్‌ను..

1902.. విశాఖకు!

కాల్‌సెంటర్‌ను తరలించిన ప్రభుత్వం 

కార్వీకి స్వస్తి!..

రోడ్డున పడ్డ ఉద్యోగులు 

జీతాలు ల్లేవు.. పీఎఫ్‌ కంట్రిబ్యూషనూ లేదు

న్యాయం కోరుతూ సీఐటీయూ నేతృత్వంలో ధర్నా 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1902 కాల్‌సెంటర్‌ను ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నుంచి విశాఖపట్నంకు మార్చింది. ప్రస్తుత కార్వీ ఏజన్సీని తప్పించి, మౌరి టెక్‌ అనే సంస్థకు దీనిని అప్పగించింది. దీంతో కార్వీ ఉద్యోగులు వందలాది మంది రోడ్డునపడ్డారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేయటం తగదని, తమను ముంచిన కార్వీ సంస్థ ద్వారా తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీఐటీయూ నేతృత్వంలో కార్వీ ఉద్యోగులు కాల్‌ సెంటర్‌ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. 


ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిలాగా పనిచేస్తున్న 1902 కాల్‌ సెంటర్‌ను ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నుంచి విశాఖపట్నంకు తరలించింది. దీనిని నిర్వహిస్తున్న కార్వీ ఏజన్సీకి మంగళం పాడింది. దాని స్థానంలో మౌర్య టెక్‌ను నియమించటంతో.. కార్వీలో పనిచేసిన 700 మంది ఉద్యోగాలను కోల్పోయారు. దీనితోపాటు నాలుగు నెలల జీతాలను, 18 నెలల పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను కూడా కోల్పోయిన ఉద్యోగులు మంగళవారం కార్వీ సెంటర్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. 


వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క పౌరుడికీ చేరాలని గత ప్రభుత్వం 1100 కాల్‌ సెంటర్‌ను ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసింది. దీని నిర్వహణను కార్వీ ఏజన్సీకి అప్పగించింది. అప్పట్లో 2500 మంది ఉద్యోగులు ఈ సెంటర్‌లో పనిచేసేవారు. దీనిలో మొత్తం 30 టీమ్‌లు పనిచేసేవి. ప్రజల నుంచి ఫోన్లను రిసీవ్‌ చేసుకోవటం, వాటిని సంబంధిత శాఖలకు బదలాయించటం ఏజెంట్ల విధి. ఆ కాల్స్‌ను పర్యవేక్షించి, ఆయా శాఖల నుంచి వచ్చిన జవాబులను పంపించే బాధ్యతను అధికారులు తీసుకునేవారు. 


ప్రభుత్వం మారిన తరువాత ఉద్యోగులను కుదించటం ప్రారంభమైంది. మొత్తం 2500 మంది ఉద్యోగుల్లో మూడొంతుల మందికి దశల వారీగా ఉద్వాసన పలికారు. చివరికి 700 మంది మిగిలారు. గత ప్రభుత్వం పెట్టిన 1100 నెంబర్‌ను కూడా మార్చి వేసి, ఈ ప్రభుత్వం కొత్తగా 1902 నెంబర్‌ను ఇచ్చింది. 


విశాఖ తరలించి కార్వీకి ఉద్వాసన 

విశాఖకు కాల్‌సెంటర్‌ను తరలించిన ప్రభుత్వం దీన్ని పర్యవేక్షిస్తున్న కార్వీ సంస్థకు ఉద్వాసన పలికింది. దీని స్థానంలో విశాఖలో మౌరి టెక్‌ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఉద్యోగులను పరిమిత సంఖ్యలోనే తీసుకున్నట్టు తెలుస్తోంది. కార్వీ ఉద్యోగులు 200 మందితో డిసెంబర్‌ వరకు మాత్రమే పని చేసేలా అగ్రిమెంట్‌ తీసుకుంది. 


పత్తా లేని కార్వీ

కార్వీ సంస్థ పత్తా లేకుండా పోయింది. ఈ సంస్థ హెచ్‌ఆర్‌లుగా ఉన్న నలుగురిలో ముగ్గురు వెళ్ళిపోయారు. మిగిలిన ఏకైక హెచ్‌ఆర్‌ కూడా రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఉద్యోగులు మార్చి నుంచి జూన్‌ వరకు వేతనాలను అందుకోలేదు. దీనికి తోడు 18 నెలల పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను కూడా జమ చేయలేదు. దీంతో ఇబ్రహీంపట్నంలోని కార్యాలయం ఎదుట సీఐటీయూ నేతృత్వంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు.


ప్రభుత్వం ఉద్యోగులను ఆదుకోవాలని, కార్వీ సంస్థ నుంచి జీతాలు ఇప్పించాలని సీఐటీయూ మండల కార్యదర్శి మహేష్‌  డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం జేసీ మాదవీలత ఇబ్రహీంపట్నం వచ్చారని తెలుసుకున్న ఉద్యోగులు ఆమెను కలిశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి, కార్వీ నుంచి జీతాలు ఇప్పించాలని, తమ ఉద్యోగాలను నిలబెట్టాలని కోరారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కార్వీ ఉద్యోగుల వద్దకు వచ్చి లిఖిత పూర్వకంగా కార్వీపై ఫిర్యాదు తీసుకున్నారు. 

Updated Date - 2020-09-23T15:38:43+05:30 IST